కారు.. టాప్‌గేరు | Sakshi
Sakshi News home page

కారు.. టాప్‌గేరు

Published Mon, Apr 1 2019 1:27 AM

Lok Sabha Elections Most Of The People Are TRS Side - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్‌ఎస్‌.. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రభంజనాన్ని సృష్టించనుందని తాజాగా నిర్వహించిన పార్టీ అంతర్గత సర్వేలో వెల్లడైంది. పార్టీ చెబుతున్నట్లుగానే 16 పార్లమెంట్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్, హైదరాబాద్‌లో మిత్రపక్షం మజ్లిస్‌ గెలవనుంది. టీఆర్‌ఎస్‌ గెలిచే స్థానాల్లో పార్టీ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఘనవిజయాలు సాధించనుందని, 57.45% ఓట్లను గులాబీదళం సాధించనుందని సర్వేల్లో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా పార్ల మెంట్‌ నియోజకవర్గాల్లో పార్టీ ఇటీవల సర్వే నిర్వ హించింది. ఈ సర్వేలో ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టంకట్టారు. ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 9 గ్రామాలు, మండలాల్లో ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు.

అత్యధికుల మద్దతు కారుకే!
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్లమెంట్‌ స్థానాల నుంచి 1,88,616 మంది అభిప్రాయాలు సేకరించారు. ఇందులో 57.45%మంది టీఆర్‌ఎస్‌కే జై కొట్టారు. కాంగ్రెస్‌ 28%, బీజేపీకి 11.85%, లెఫ్ట్‌ పార్టీలకు 1.45%, ఇతరులకు 1.25% మంది మద్దతు పలికారు. ఇందులోనూ 62.29% మహిళలు, కారు గుర్తుకే ఓటేస్తామని తేల్చిచెప్పగా, పురుషుల్లోనూ 53.84%మంది కారుకే మద్దతు ప్రకటించారు. వయస్సు పరంగా చూస్తే 60ఏళ్లకు పైబడిన వృద్ధుల్లో 74.63%, 46–60 ఏళ్ల వయసు వారిలో 59.31%, 30–45ఏళ్ల వారిలో 56.64%మంది టీఆర్‌ఎస్‌కు ఓటేస్తామని తెలిపారు. 67.28% మైనార్టీలు, 58.47%బీసీలు, 58.25% ఎస్సీలు, 57.41% ఎస్టీలు, 48.11% ఓసీలు గులాబీ జెండాకు జై కొట్టారు. ఈ సర్వేల్లో రైతులు పూర్తిగా టీఆర్‌ఎస్‌ వైపున్నట్లు స్పష్టంగా తేలింది. 69.21% మంది రైతులు టీఆర్‌ఎస్‌కు ఓటేస్తామని తెలుపగా, గృహిణులు 62.33% మంది కారు గుర్తుకే మొగ్గు చూపారు. టీఆర్‌ఎస్‌కు 56.6% నేత, స్వర్ణకారులు, తదితర నైపుణ్య వృత్తి పనివారు మద్దతు పలికారు. 54.85% ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, 50.71% మంది రిటైర్డ్‌ ఉద్యోగులు గులాబీ వైపే ఉన్నారు. వ్యాపారస్తులు 49.04%, ప్రైవేట్‌ ఉద్యోగులు 44.80%, యువత, విద్యార్థులు 39.54%, ప్రభుత్వ ఉద్యోగులు 35.19% టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారు.

ఆదిలాబాద్, భువనగిరి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, జహీరాబాద్‌లో పోటీలో ఉన్న టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీలనే మరోసారి గెలిపిస్తామని ఆయా జిల్లాల జనం సర్వేలో పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, మల్కాజ్‌గిరి, పెద్దపల్లిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఎదురేలేదని సర్వేలో స్పష్టమైంది. ఇక చేవెళ్ల, నాగర్‌కర్నూల్, సికింద్రాబాద్‌లలో మిగతా పార్టీలకంటే టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. గట్టిపోటీ ఉంటుందనుకున్న చేవెళ్లలో టీఆర్‌ఎస్‌కు 57.11% మంది మద్దతు పలకగా, కాంగ్రెస్‌కు 30.48% మంది మద్దతు ప్రకటించారు. మల్కాజ్‌గిరిలో టీఆర్‌ఎస్‌కు 59.81%, కాంగ్రెస్‌కు 27.54%, నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితకు 55.56%, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు 20.50%, మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌కు 58.10%, బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు 20.93% మంది మద్దతుగా నిలిచినట్లు సర్వేల్లో వెల్లడైంది. నల్లగొండలో టీఆర్‌ఎస్‌కు 52.94% ఓటర్లు మద్దతు తెలపగా, కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై 37% మంది సానుకూలత వ్యక్తం చేశారు. ఇక భువనగిరిలో టీఆర్‌ఎస్‌కు 55.46%, కాంగ్రెస్‌కు 34.69%, ఖమ్మంలో టీఆర్‌ఎస్‌కు 50%, కాంగ్రెస్‌కు 37.24%, మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు 53.78%, కాంగ్రెస్‌కు 34.83% మంది మద్దతు ప్రకటించినట్లు సర్వే తేల్చింది. హైదరాబాద్‌లో మజ్లిస్‌కు పోటీయే లేదని అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తంగా లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని పార్టీ అంతర్గత సర్వేలో వెల్లడించింది. 

1/1

Advertisement
Advertisement