సర్కారు బడికి ‘లాంగ్‌బెల్’ | Sakshi
Sakshi News home page

సర్కారు బడికి ‘లాంగ్‌బెల్’

Published Fri, Feb 13 2015 3:07 AM

సర్కారు బడికి ‘లాంగ్‌బెల్’ - Sakshi

సర్కారు బడిలో గణగణ గంటలు మోగుతున్నా.. బుడిబుడి అడుగుల సవ్వడి లేదు.. విశాలమైన ఆటస్థలం ఉన్నా... ఆడుకునే చిన్నారి లేడు.. ‘ప్రైవేటు’ పాఠాల పోటీలో ప్రభుత్వ స్కూళ్ల వైపు విద్యార్థులు కన్నెత్తి కూడా చూడడం లేదు. వెరసి అమ్మఒడి లాంటి సర్కారు బడి ఇప్పుడు తన ఒడిలో చదువుకొనే బిడ్డలు లేరని దీనంగా రోదిస్తోంది.. తన మనుగడకే ‘లాంగ్ బెల్’ కొడతారేమోనని భయపడుతోంది.

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి సర్కారు స్కూళ్లలో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నా.. ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నా.. నిపుణులైన ఉపాధ్యాయులు నియమిస్తున్నా... విద్యార్థులు మాత్రం చేరడమే లేదు. అదే సమయంలో ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహించే ప్రైవేటు స్కూళ్లలో మాత్రం ప్రవేశాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల వెలువరించిన గణాంకాలను పరిశీలిస్తే సర్కారు పాఠశాలలో గత 10 ఏళ్లుగా ప్రవేశాల సంఖ్య ఎంత ప్రమాదకర స్థాయిలో తగ్గిందో తేటతెల్లమవుతోంది.

నిష్పత్తి తగ్గితే బడికి ‘గంటే’..
పిల్లలందరూ ప్రైవేటు బాట పట్టడంతో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, విద్యార్థుల నిష్పత్తి దారుణంగా తగ్గుతోంది. పదేళ్ల కిందట ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుడు, విద్యార్థుల నిష్పత్తి 1:36 గా ఉంటే ప్రస్తుతం 1:25 కు చేరింది. అంటే 25 మంది పిల్లలకు ఒక టీచరున్నట్టు లెక్క. టీచర్- విద్యార్థి నిష్పత్తి ఇంకా తగ్గితే ప్రభుత్వ పాఠశాలలు మూత పడక తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం క్లస్టర్ పేరిట స్కూళ్లను విలీనం చేసి మండలానికి కొన్ని స్కూళ్లు మాత్రమే ఉంచాలన్న ఆలోచనలో ఉంది. గ్రామానికి సమీపంలో ప్రభుత్వ స్కూలు ఉన్న ప్రస్తుత తరుణంలోనే విద్యార్థుల చేరికలు తగ్గిపోతున్నాయి. ఇక క్లస్టర్ పేరిట సమీపంలోని స్కూళ్లు కూడా దూరమైతే ఒక్క విద్యార్థి కూడా సర్కారు స్కూల్‌లో చేరే పరిస్థితి ఉండదు.

సర్కారు వద్దు.. ప్రైవేటు ముద్దు..
అక్షరాలా 25 లక్షలు.. గత పదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు స్కూళ్ల వైపు మళ్లిన విద్యార్థుల సంఖ్య ఇది. 2003-04 నుంచి 2013-14 మధ్య గణాంకాలను పరిశీలిస్తే దిమ్మ తిరిగే ఇలాంటి వాస్తవాలు ఎన్నో కనిపిస్తాయి. 2003-04 లో ప్రభుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య 1,02,50,658 గా ఉంటే గత విద్యాసంవత్సరంలో ఈ సంఖ్య 77,66,845 మాత్రమే. పదేళ్ల కిందటితో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్లలో చేరే చిన్నారుల సంఖ్య 24,83,813 కి తగ్గిపోయింది.

ఇదే ప్రైవేటు స్కూళ్లలో పదేళ్ల కిందట 32,78,828 మంది పిల్లలు చేరగా ఇప్పుడీ సంఖ్య 57,48,917కు పెరిగింది. అంటే దాదాపుగా 25 లక్షల మందికి పైగా పిల్లలు ప్రైవేటు బడులలో చేరారు. అలాగే, ఉమ్మడి రాష్ట్రంలో గత పదేళ్లలో ప్రభుత్వ రంగంలో 79,781 బడులు ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య ఇంచుమించు అలాగే ఉంది. కానీ, ప్రైవేటు పాఠశాలల సంఖ్య దశాబ్దం కిందట 12,573 ఉండగా ఇప్పుడు 25,302కు చేరింది.

ప్రైవేటు వైపే ఎందుకు...?
గతంతో పోలిస్తే ఇటీవల సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం భారీగానే ఖర్చు చేస్తోంది. టీచర్ల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కూడా బాగానే చేపట్టింది. ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు కూడా నిర్వహిస్తోంది. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సక్సెస్ స్కూళ్ల పేరుతో ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను కూడా తీసుకొచ్చింది. కానీ, విద్యార్థులను ఆక ర్షించడంలో మాత్రం విఫలమైంది. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు బడుల్లోనే తమ బిడ్డలకు నాణ్యమైన విద్య అందుతుందని సగటు జీవి బలంగా నమ్ముతున్నాడు.

సర్కారు బడుల్లోని ఉపాధ్యాయులను ప్రభుత్వం తరచుగా వేరే పనులకు ఉపయోగించుకోవడం. టీచర్లలో జవాబుదారీతనం లోపించడం. పాఠశాలలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సర్కారు బడిలో పాఠాలు వానాకాలం చదువులే అనే అపవాదు ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. దీంతో సహజంగానే తల్లిదండ్రులు తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం జేబులు గుల్ల చేసుకొని మరీ ప్రైవేటు పాఠశాలలకు పంపాల్సి వస్తోంది.

Advertisement
Advertisement