ఛనాకా–కొరట బ్యారేజీకి క్లియరెన్స్‌ | Sakshi
Sakshi News home page

ఛనాకా–కొరట బ్యారేజీకి క్లియరెన్స్‌

Published Thu, Feb 1 2018 3:50 AM

maharashtra wildlife board clearance to Chanaka-korata barrage

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు సంబంధిం చిన ప్రాణహితలో భాగంగా చేపట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ, ఛనాకా–కొరట బ్యారేజీ సాగునీటి ప్రాజెక్టులకు మహారాష్ట్ర వన్యప్రాణి బోర్డు క్లియరెన్స్‌లు ఇచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గత కొన్ని నెలలుగా మహారాష్ట్రతో జరుపుతున్న సంప్రదింపుల ఫలితంగా ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఈ రెండు బ్యారేజీల వల్ల వన్యప్రాణులకు ఎలాంటి హాని ఉండదని మహారాష్ట్ర తెలిపింది. ఛనాకా–కొరట బ్యారేజీని పెన్‌గంగ నదిపై నిర్మిస్తున్నారు. 51 వేల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టుకు తిప్పేశ్వర్‌ వన్యప్రాణి కేంద్రం నుంచి అనుమతి లభించింది. ప్రాణహిత నదిపై 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మిస్తున్న తమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు చాప్రాల్‌ వన్యప్రాణి కేంద్రం అనుమతిచ్చింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ అధ్యక్షతన బుధవారం ముంబైలో ఆ రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశమైంది. సమావేశంలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్‌ మునిగంటివార్, రాష్ట్ర అటవీ శాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ భగవాన్, తెలంగాణ నుంచి ఆదిలాబాద్‌ సీఈ భగవంతరావు, డిప్యూటీ ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ శ్రీనివాస్, పెన్‌గంగ ఎస్‌ఈ అమ్జద్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు. ఛనాకా–కొరట, తమ్మిడిహెట్టి బ్యారేజీలపై సీఈ భగవంతరావు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రజెంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తూ, వీటి నిర్మాణంతో వన్యప్రాణి కేంద్రాలపై ప్రభావముండదని తేల్చిన మహారాష్ట్ర వన్యప్రాణి మండలి.. జాతీయ వన్యప్రాణి బోర్డుకు సిఫారసు చేసింది. ఆ నిర్ణయం పట్ల హరీశ్‌రావు బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement