ఫలితాలు సాధిస్తా.. | Sakshi
Sakshi News home page

ఫలితాలు సాధిస్తా..

Published Mon, Jan 19 2015 3:53 AM

ఫలితాలు సాధిస్తా..

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘నేను ఏ జిల్లాకు కలెక్టర్ వెళతానో ముందుగా తెలియలేదు. ఐఏఎస్‌ల కేటాయింపుల్లో భాగంగా నన్ను తెలంగాణకు కేటాయించిన సమయంలో జరిగిన వీడ్కోలు పార్టీలో మాత్రం చాలా మంది నువ్వు నల్గొండ కలెక్టర్‌గా వెళుతున్నావని చెప్పారు. కొందరేమో వరంగల్ అన్నారు. నాకైతే కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా రావాలని మనసులో ఉండేది. అయినా నేనా మాట ఎవరికీ చెప్పలేదు. ఏదో ఒక జిల్లాకు కలెక్టర్‌గా పంపాలని మాత్రం రిక్వెస్ట్ చేశాను. ప్రభుత్వం నన్ను ఇక్కడికి పంపడం సంతోషంగా ఉంది’ అని కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ వ్యాఖ్యానించారు.

జిల్లా పాలనాధికారిగా రెండ్రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్న నీతుకుమారి ప్రసాద్ ఆదివారం సాయంత్రం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రభుత్వం జిల్లాకు ఎన్నో నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేసిందని, ఇవిగాకుండా అనేక పెండింగ్ ప్రాజెక్టులున్నాయని చెప్పారు. వీటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే తన ముందున్న లక్ష్యమని, ఆశించిన ఫలితాలు సాధిస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌గా తన ప్రాధాన్యతలు వివరించారు. అవేంటో ఆమె మాటల్లోనే...
 
ప్రభుత్వ ప్రాధాన్యతలే ముఖ్యం
ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడమే కలెక్టర్‌గా నా ప్రాధాన్యత. వాస్తవానికి ప్రభుత్వం ఈ జిల్లాకు ఎన్నో పథకాలు మంజూరు చేసింది. వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. ఇవన్నీ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవిగాక పెండింగ్ ప్రాజెక్టులూ చాలానే  ఉన్నాయి. వీటిని నిర్ణీత సమయంలోగా పూర్తి చేయడమే నా ముందున్న లక్ష్యం. ఎందుకంటే సకాలంలో పనులు పూర్తయితేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరేది. ప్రభుత్వ ప్రాధాన్యతే నా తొలి ప్రాధాన్యత కాబట్టి నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయడానికే కృషి చేస్తా. ఆశించిన ఫలితాలు సాధిస్తా.
 
విద్య, వైద్యం పునాదులు
ఏ జిల్లా కలెక్టర్‌కైనా విద్య, వైద్య రంగాలు పునాదులు. జిల్లాలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. దీనిపై దృష్టి పెడతా. అట్లాగే కరీంనగర్ జిల్లాలో వెనుకబడిన మారుమూల ప్రాంతాలున్నాయి. నక్సల్స్ సమస్య వల్ల అక్కడ అభివృద్ధి నిలిచిపోయింది. ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా. ఇవిగాకుండా కలెక్టర్‌గా నాకు ఏ శాఖ అయినా  సమానమే. ఎందుకంటే చిన్న శాఖల్లోనూ బాగా మార్పులు తేవొచ్చు. హార్టికల్చర్, డెయిరీ, ఫిషరీస్ వంటివి చూడటానికి చిన్న శాఖలైనా... అందులో అపారమైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. అధిక ఉత్పత్తులను సాధించవచ్చు. అందులో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యతనిస్తా. నా దృష్టిలో ఎన్ని పరిశ్రమలొస్తే అన్ని ఉద్యోగాలొస్తాయి. ఎంత ఉత్పత్తి చేస్తే అంతగా వృద్ధిరేటు సాధించవచ్చు.
 
 టూరిజం హబ్‌గా మారుస్తా

 ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అందులో పర్యాటక శాఖ పాత్ర కూడా కీలకం. కేరళ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 1/3వ వంతు ఆదాయం టూరిజం ద్వారా సమకూరుతోంది. దుబయ్ వంటి దేశాల్లోనే సగం ఆదాయం టూరిజం ద్వారా సమకూర్చుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా విస్తరించేందుకు చాలా అవకాశాలున్నాయి. అందుకోసం కృషి చేస్తా. అట్లాగే విత్తనాభివృద్ధి కేంద్రంగా జిల్లాను తీర్చిదిద్దుతా.

Advertisement
Advertisement