జిల్లాకో మెడికల్ కాలేజీ! | Sakshi
Sakshi News home page

జిల్లాకో మెడికల్ కాలేజీ!

Published Thu, Jul 2 2015 1:18 AM

జిల్లాకో మెడికల్ కాలేజీ! - Sakshi

 కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం,
 సంగారెడ్డి, పాలమూరులో ఏర్పాటుకు ప్రతిపాదనలు
 కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు
 ప్రాధాన్యత
 పీఎంఎస్‌ఎస్‌వై కింద కేంద్రాన్ని
 నిధులు కోరాలనే యోచన

 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు లేని కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఒక్కో మెడికల్ కళాశాల ఏర్పాటుకు రూ.400 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం ప్రధానమంత్రి స్వస్థ్య సురక్షా యోజన(పీఎంఎస్‌ఎస్‌వై) పథకం కింద కేంద్ర సాయం కోరాలని భావిస్తోంది. ఆయా జిల్లాల్లో కళాశాలల ఏర్పాటుకు సంబంధించి గతంలో స్థలాలను గుర్తించినప్పటికీ వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టారు.
 
 ఈ నేపథ్యంలో అధికారుల బృందం త్వరలోనే ఆయా జిల్లాల్లో పర్యటించి గతంలో గుర్తించిన స్థలాలను మరోసారి పరిశీలించనుంది. మరోవైపు కళాశాలల ఏర్పాటుకు అయ్యే వ్యయంలో కేంద్రాన్ని ఏ మేరకు సాయం అడగాలనే  అంశంపై కసరత్తు జరుగుతోంది. వీలైనంత ఎక్కువ సాయాన్ని అందించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో గతంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకైన వ్యయంలో కేంద్రం 80 శాతం, రాష్ట్రం 20 శాతం నిధులను ఖర్చు చేసినందున ఇదే నిష్పత్తిలో కేంద్ర సాయం కోరాలని అధికారులు భావిస్తున్నారు.
 
  మరోవైపు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని, వీటిని అతి త్వరలోనే కేంద్రానికి పంపనున్నట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కేంద్రం ఐదు కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇస్తుందనే అంశంపై స్పష్టత లేనప్పటికీ కనీసం మూడు కొత్త కళాశాలలైనా మంజూరవుతాయని అధికారులు ధీమాతో ఉన్నారు. వీటిలో కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. కేంద్రం నుంచి అనుమతి లభించినప్పటి నుంచి రెండేళ్లలో కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చే సేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement