నైరుతి.. మరో నాలుగు రోజులు..! | Sakshi
Sakshi News home page

నైరుతి.. మరో నాలుగు రోజులు..!

Published Sun, Jun 11 2017 1:47 AM

Monsoon to reach four days delay

సాక్షి, హైదరాబాద్‌: నేడో రేపో తెలంగాణలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు మళ్లీ ఆలస్యం కానున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా, బెంగాల్‌ వైపు తరలిపోవడంతో రుతుపవనాలు మందగించినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. దీంతో ఈనెల 10–12 తేదీల మధ్యలో రాష్ట్రంలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు 14వ తేదీ నాటికి వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలోనూ అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. వాస్తవంగా నైరుతి రుతుపవనాలు గత నెల 30వ తేదీన కేరళలోకి ప్రవేశించాయి. సాధారణం కంటే రెండు రోజుల ముందే అక్కడ ప్రవేశించడంతో తెలంగాణకు ఈనెల ఐదు–ఆరు తేదీల్లోనే ప్రవేశిస్తాయని అంచనా వేశారు. అయితే అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రుతుపవనాలు నిలిచిపోయాయి.

ఎట్టకేలకు ఆ అడ్డంకి తొలిగింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా వచ్చింది. కానీ అది కాస్తా ఒడిశా–బెంగాల్‌ వైపు తరలిపోవడంతో ఇప్పుడు రుతుపవనాలు మందగించాయి. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే కోస్తాకు సమీపంలో అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనమైనా రావాలి లేకుంటే బంగాళాఖాతంలోనైనా రావాలి. దీనిపై అతి క్షుణ్నంగా పరిశీలన చేస్తున్నట్లు వై.కె.రెడ్డి తెలిపారు. అల్పపీడనం ఒడిశా–బెంగాల్‌వైపు పోవడంతో రాష్ట్రంలో భారీ వర్షాలకు బ్రేక్‌ పడినట్లు పేర్కొన్నారు. నేటి నుంచి వచ్చే నాలుగు రోజులు కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు. మరోవైపు గత 24 గంటల్లో లక్సెట్టిపేటలో 6 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, ధర్మపురిలలో 5 సెంటీమీటర్ల చొప్పున, గాండీడ్, హకీంపేట, మేడ్చల్‌లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

Advertisement
Advertisement