నిండా..సిరుల బెండ | Sakshi
Sakshi News home page

నిండా..సిరుల బెండ

Published Fri, Sep 5 2014 1:46 AM

more profit with lady finger crop

బెండసాగుతో లాభాలు ఆర్జిస్తున్నారు ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన మద్ది గంగిరెడ్డి. దాదాపు 18 ఏళ్లుగా ఈయన బెండ సాగు చేస్తున్నారు. దీనిబట్టి ఆ పంట ఆయనకు ఎంత సంతృప్తినిస్తుందో అర్థమవుతోంది. ఏటా మూడు ఎకరాల వరకు బెండ సాగు చేసేవారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఎకరం భూమిలో మాత్రమే బెండ వేశారు. బెండ సాగు గురించి రైతు గంగిరెడ్డి ఏమంటున్నారో ఆయన మాటల్లోనే... బెండ సాగు మెళకువలు..
     
విత్తనాలు:    మే మూడోవారంలో బెండ విత్తాను. జె.కె-7315, రాశి, సఫారి రకాలు దీనిలో శ్రేష్టమైనవి. నేను ఆ రకాలనే విత్తుతుంటాను. ఎకరానికి రెండు కిలోల విత్తనాలు వేశాను. విత్తనానికి రూ. 3,500 నుంచి రూ.5 వేల వరకు ఖర్చు వచ్చింది.

ఎరువుల యాజమాన్యం: దుక్కిని నాలుగు సార్లు దున్ని ఎకరానికి రెండు క్వింటాళ్ల వర్మి కంపోస్టు వేశాను. దుక్కిలో 8 సెం.మీలకు  ఒక గింజ చొప్పున నాటాను. విత్తనం వేసిన తెల్లారి కలుపు నివారణకు ఎకరానికి 500 మి.లీ పిండి మిథాలిన్‌ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేశాను. విత్తనం నాటిన 40 రోజుల తర్వాత 20:20 కాంప్లెక్స్ ఎరువును 50 కిలోలు వేశాను. 55 రోజుల కాలంలో నీమ్ యూరియా 50 కిలోలు వేశాను.
 
తెగుళ్లు- నివారణ: ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి కాబట్టి కాపు దశలో ఎర్రనల్లి సోకింది. దీని నివారణకు రిజెండ్ 500 మి.లీ, ఒబేరాన్ 200 మి.లీ 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేశాను. మొగి పురుగు ఆశిస్తే కోరోజిన్ 60 మి.లీ, ఫ్రైడ్ 100 గ్రాములను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేశాను.
 
పెట్టుబడుల వివరాలు: ఎకరా దుక్కి దున్నినందుకు రూ.5 వేలు, పాట్లు చేయడానికి రూ.2 వేలు, విత్తనానికి రూ.5 వేలు, కలుపు కూళ్లకు రూ.2 వేలు, కోత కూళ్లకు రూ.10 వేలు, ఎరువులకు రూ.2 వేలు, పురుగు మందులకు రూ. 5 వేలు  మొత్తంగా సుమారు రూ. 30 వేల వరకు ఖర్చు వస్తుంది.
 
దిగుబడి:  విత్తిన తరువాత 55 రోజులకు పంట కోతకు వస్తుం ది. 55 రోజుల నుంచి 130 రోజుల వరకు పంట దిగుబడి ఇస్తుంది. ప్రతిరోజూ ఎకరానికి క్వింటా నుంచి క్వింటన్నర వరకు సేకరించవచ్చు. ఇలా మొత్తంగా ఎకరానికి 80 క్వింటాళ్ల నుంచి వంద క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో కిలో బెండకాయలు రూ.12 నుంచి రూ.15 వరకు ధర పలుకుతున్నాయి. ఈ దిగుబడి నుంచి దాదాపు రూ. లక్షకు పైగా ఆదాయం వస్తోంది. ’
 
ఇతర పంటలకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది: గంగిరెడ్డి, రైతు
 బెండ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర పంటల సాగుకు ఉపయోగిస్తున్నాను. ఎనిమిది ఎకరాల్లో మాగాణి, ఎకరానికి పైగా మిర్చి వేస్తాను. ఈ పంటలకు అయ్యే పెట్టుబడి, ఇద్దరు పిల్లల చదువుకు అయ్యే ఖర్చులకు బెండ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తాను. ఇతర పంటలకన్నా బెండ సాగు ఎంతో బాగా కలివస్తోంది. అందుకే 18 ఏళ్లుగా దీన్ని క్రమంతప్పకుండా సాగు చేస్తున్నాను. మా పరిసర ప్రాంత రైతులు నా వద్దకు వచ్చి సాగు వివరాలు తెలుసుకుంటున్నారు.
 
శ్రద్ధ, ఆసక్తితోనే దిగుబడులు: గజ్వెల్లి సత్యనారాయణ, ఖమ్మం ఉద్యానవిస్తర్ణ అధికారి
 శ్రద్ధ, ఆసక్తి, అనుభవం, వీటికితోడు మెళకువలు తెలుసుకోవడం. యాజమాన్య పద్ధతులను ఉద్యానశాఖ ద్వారా తెలుసుకుని పాటించడం వల్లే గంగిరెడ్డి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మిగతా రైతులు కూడా ఆయనలాగే పట్టుదలతో సాగు చేయాలి.

Advertisement
Advertisement