అమ్మా.. సాంబనొచ్చా..! | Sakshi
Sakshi News home page

అమ్మా.. సాంబనొచ్చా..!

Published Sat, Apr 19 2014 2:29 AM

అమ్మా.. సాంబనొచ్చా..!

14 ఏళ్ల తర్వాత కుమారుడి ప్రత్యక్షం
 చనిపోయాడనుకొని కర్మలు చేసి..సమాధి నిర్మించిన తల్లిదండ్రులు

 
 గుండాల, అమ్మా.. నేను సాంబ’ను అనే పిలుపు ఆ తల్లిదండ్రులకు ఉలిక్కిపడేలా చేసింది. 14ఏళ్ల క్రితం చనిపోయిన కొడుకు రావడమేమిటి? అసలు ఇది కలనా.. నిజమా! అని సంశయంలో పడ్డారు.  ముందు నిలిచి ఉన్న కొడుకును చూసి కూడా వారు తమ కళ్లనే తాము నమ్మలేకపోయారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లాలోని గుండాలకు చెందిన ఆవుల వెంకన్న-కనకమ్మ దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కొడుకు సాంబయ్య 14ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం ఎంత వెతికినా జాడ దొరకలేదు. కొద్దిరోజుల తర్వాత విశాఖపట్నంలో సాంబయ్య పేరుగల వ్యక్తి మృతి చెందాడని పత్రికల్లో చూశారు. అక్కడికి వెళ్లి చూడగా,, మృతదేహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉండడంతో ఇంటికి తిరిగి వచ్చారు. సాంబయ్యనే చనిపోయి ఉంటాడనుకుని కర్మకాండలు నిర్వహించారు.

అతడి స్మృతి చిహ్నంగా సమాధి కూడా నిర్మించారు. అయితే గురువారం రాత్రి ఇంటికి చేరుకున్న సాంబయ్య..  ‘అమ్మా..సాంబను వచ్చానమ్మా’ అంటూ పిలిచాడు. నిద్రలో ఉన్న తల్లిదండ్రులు తలుపు తెరిచి చూడగా.. చెట్టంత కొడుకు వాళ్ల కళ్ల ముందు నిలబడి ఉన్నాడు. చనిపోయిన సాంబయ్య రావడం ఏమిటి? అని ముందు నమ్మలేకపోయారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు గుర్తు తెచ్చుకోవడం.. అతడి తలపై ఉన్న పాతగాయం ఆధారంగా వారు కుమారుడిని గుర్తుపట్టారు. తమ కుమారుడే అని తెలుసుకొని  ఇన్నాళ్లకు వచ్చావా నాయనా.. అంటూ గుండెలకు హత్తుకున్నారు. తాను విజయవాడలో క్యాటరింగ్‌లో పని చేసేవాడినని సాంబయ్య విలేకరులకు తెలిపాడు. ఆరు నెలలుగా గుండెజబ్బుతో బాధపడుతున్నానని, అనారోగ్యంతో ఉన్న తనకు అమ్మానాన్నలను చూడాలనిపించి ఇంటికి తిరిగి వచ్చానని చెప్పాడు. సాంబయ్య వచ్చిన విషయం శుక్రవారం గ్రామంలో దావానలంలా వ్యాపించింది. దీంతో స్థానికులు, స్నేహితులు వచ్చి ఆప్యాయంగా పలకరిం చారు. దీంతో ఆ ఇంట పండుగ వాతావరణం నెలకొంది.
 

Advertisement
Advertisement