ఎంపీటీసీ, జెడ్పీటీసీలు  ఖరారు | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ, జెడ్పీటీసీలు  ఖరారు

Published Tue, Feb 26 2019 12:04 PM

MPTC And ZPTC Elections Candidates Finalized Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  జిల్లాలో మండల, జిల్లా ప్రాదేశిక స్థానాల (ఎంపీ టీసీలు, జెడ్పీటీసీలు) సంఖ్య తేలింది. కొత్త జిల్లా, రెవెన్యూ మండలాల ప్రాతిపదికన రూపొందించిన తుది జాబితాకు యంత్రాంగం ఆమోదం తెలిపింది. 258 ఎంపీటీసీ, 21 జెడ్పీటీసీలతో కూడిన జాబితాను విడుదల చేసింది. 21 గ్రామీణ మండలాలకు ఒకటి చొప్పున జెడ్పీటీసీ స్థానం ఉంటుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా కొనసాగిన సమయంలో జిల్లా వ్యాప్తంగా 753 ఎంపీటీసీలు, 33 జెడ్పీటీసీ స్థానాలు  ఉన్నాయి. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ.. జిల్లా పరిషత్‌ను విభజించలేదు. దీంతో పాత స్థానాలే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. జెడ్పీ పాలకవర్గ కాలపరిమితి వచ్చే జులై మొదటి వారంలో ముగియనుంది.

ఈ గడువులోగా నూతన జిల్లాల ప్రాతిపదికన మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలను ఖరారు చేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. ఈ క్రమంలో కసరత్తు చేసిన పంచాయతీరాజ్‌ విభాగం కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. గతంతో పోల్చుకుంటే జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఉమ్మడి జిల్లా మూడు జిల్లాలుగా విభజించడం.. రాజేంద్రనగర్, సరూర్‌నగర్‌ గ్రామీణ మండ లాలు సంపూర్ణంగా పురపాలనలో విలీనం కావడం.. శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల, తుర్కయంజాల్, శంకర్‌పల్లిలు మున్సిపాలిటీలుగా ఏర్పడటంతో ఆ స్థానాలకు కత్తెర పడింది. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి కొత్త రంగారెడ్డి జిల్లాలో కలిసిన ఆమనగల్లు కూడా పురపాలికగా మారడంతో ఇక్కడి ఎంపీటీసీ స్థానాల్లోనూ కోత పడింది. తుది జాబితాలో ఉన్న స్థానాలు అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది. ప్రభుత్వం అధికారికంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి ఒక తేదీని ఖరారు చేస్తుంది. ఆ సమయం నుంచి కొత్త స్థానాలు మనుగడలోకి వస్తాయని అధికారులు తెలిపారు.
 
సంఖ్య పెంచండి.. 
జిల్లా పరిషత్‌ విడుదల చేసిన ముసాయిదా జాబితాపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 38 అభ్యంతరాలు అధికారులకు అందాయి. ముసాయిదా జాబితాలో ఉన్న వాటి కంటే ఎంపీటీసీల సంఖ్యను పెంచాలని పలువురు నాయకులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఎంపీటీసీ స్థానాల ఏర్పాటు నిర్ధిష్ట నిబంధనలు ఉన్న కారణంగా సాధ్యం కాలేదు. ప్రతి 3500 జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానం ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీని కారణంగా సంఖ్య పెంచలేకపోయామని అధికారులు పేర్కొంటున్నారు.

అలాగే ప్రస్తుతం ఎంపీటీసీ స్థానం పరిధిలో ఉన్న గ్రామాలను.. కొత్తగా ఏర్పడే స్థానం పరిధిలోకి మార్చాలని కూడా వినతులు అందాయి. భౌగోళిక విషయాలను పరిగణనలోకి తీసుకుని గ్రామాలను ఖరారు చేశారు. అవకాశం ఉన్న చోట రెండు మూడు గ్రామాలను ఆయా ఎంపీటీసీ స్థానాల్లో కలిపినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంతేగాక ఎంపీటీసీ స్థానాల పేర్లను కూడా మార్చాలన్న డిమాండ్‌ వచ్చింది. ఒక ఎంపీటీసీ స్థానం పరిధిలో అధిక జనాభా ఉన్న గ్రామం పేరిటే సదరు ఎంపీటీసీ స్థానాన్ని ఖరారు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇది సాధ్యపడకపోవడంతో ఈ వినతులను యంత్రాంగం పక్కనబెట్టింది.

15లోగా ఓటర్ల జాబితా 
కొత్తగా ఏర్పాటయ్యే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల జాబితాని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. తొలుత ముసాయిదా జాబితా రూపొందించి దానిపై అభ్యంతరాలు, ఆక్షేపణలకు అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత వీటిని పరిష్కరించి 15 కల్లా తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. 

Advertisement
Advertisement