Sakshi News home page

నల్లగొండ ఎస్పీపై బదిలీ వేటు

Published Tue, Mar 13 2018 3:09 AM

Nalgonda SP Transferred - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నల్లగొండ జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రావుపై ప్రభుత్వం బదిలీ వేటువేసింది. గత సెప్టెంబర్‌ 16న ఎస్పీగా నియమితులైన శ్రీనివాస్‌రావు 6 నెలల్లోనే వెనుతిరగడం పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి భర్త శ్రీనివాస్‌ హత్యకేసులో ఎస్పీపై కాంగ్రెస్‌ తీవ్రంగా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.

ఈ కేసులో అధికార పార్టీ ఎమ్మె ల్యే, మంత్రులే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హత్య కేసులో ఓ ఎమ్మెల్యే బంధువులున్నారంటూ కాల్‌డేటా బయటకు రావడం, మీడియాలో ప్రసారం కావడం రాజకీయంగా దుమారం రేపింది. ఇంతటి స్థాయిలో ఆరోపణలు రావడానికి జిల్లా పోలీసుల పనితీరే కారణమని ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. హత్య కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కాంగ్రెస్‌ పిటిషన్‌ వేసింది.

ఈ నేపథ్యంలో పోలీసుశాఖను మరింత ఒత్తిడికి గురిచేసేలా నల్లగొండ పోలీసుల వ్యవహారముందని ప్రభుత్వం గ్రహించింది. దీంతో ఎస్పీపై బదిలీ వేటువేసి ఆయన స్థానంలో మరో అధికారి రంగనాథ్‌ను నియమిస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషి ఉత్తర్వులు వెలువరించారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని శ్రీనివాస్‌రావును ఆదేశించారు.

Advertisement

What’s your opinion

Advertisement