స్వయంకృతం | Sakshi
Sakshi News home page

స్వయంకృతం

Published Sun, May 18 2014 1:27 AM

స్వయంకృతం - Sakshi

  •     సమన్వయ లేమి, అంతర్గత కలహాలతో కాంగ్రెస్ చిత్తు
  •      సీనియర్ల వైఖరితో టీడీపీకి నష్టం
  •      ‘జోరు’ కొనసాగించడంలో కారు విఫలం
  •      నమో ప్రచారంలో బీజేపీ నిర్లక్ష్యం
  •      కొన్నిచోట్ల గెలుపును చేజార్చుకున్న ప్రధాన పార్టీలు
  •  సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : అతివిశ్వాసమే కాంగ్రెస్ పుట్టిముంచింది. మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని బీరాలు పలికిన ఆ పార్టీని చావుదెబ్బతీసింది. కేవలం రెండు సీట్లకే పరిమితం కావడం... అవి కూడా అత్తెసరు ఓట్లతో గట్టెక్కడం చూస్తే ఆ పార్టీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 2009లో కాంగ్రెస్ ఎనిమిది చోట్ల విజయం సాధించింది. ఈ సారి ఆ స్థాయిలో సీట్లు దక్కకపోగా.. చాలాచోట్ల మూడో స్థానానికి దిగజారింది.

    మల్కాజిగిరి, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మేడ్చల్, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల చేతిలో కాంగ్రెస్ మట్టికరిచింది. ఈ స్థానాల్లో ఓటమి పాలవడమే కాకుండా టీఆర్‌ఎస్ / స్వతంత్ర అభ్యర్థుల కంటే వెనుకబడింది. పార్టీ గ్రాఫ్ ఈ స్థాయిలో పడిపోవడానికి ప్రధాన కారణం సమన్వయలేమి, నేతల అంతర్గత కలహాలే. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించాల్సిన అధిష్టానం... పట్టించుకోకపోవడంతో పార్టీ నడ్డివిరిగింది.

    కుత్బుల్లాపూర్, ఎల్‌బీనగర్, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన ఆశావహులు టికెట్ రాకపోవడంతో ఇతర పార్టీల్లోకి జంప్ చేయడమేగాకుండా ఆ పార్టీ తరఫున బరిలో దిగారు. దీంతో చాలా స్థానాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే చిల్లు పడింది. మరోవైపు అసంతుష్టులను దారిలో తెచ్చేందుకు కూడా పార్టీ నాయకత్వం చొరవచూపలేదు.

    ప్రజా వ్యతిరేకత తీవ్రంగా మూటగట్టుకోవడం, టీఆర్‌ఎస్, మోడీ హవా ఉందని పసిగట్టినా దాన్ని నివారించే ప్రయత్నం చేయకపోవడంతో ఘోర పరాజయాన్ని మూటగ ట్టుకుంది. ఇబ్రహీంపట్నంలో పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం తిరుగుబాటు అభ్యర్థి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన మల్‌రెడ్డి రాంరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం, ఆయనకు మరికొందరు పార్టీ నేతలు సహకరించడంతో పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ పరాజయానికి దారితీసింది.

    కాంగ్రెస్ ఓట్లే స్వతంత్ర అభ్యర్థి ఖాతాలోకి వెళ్లడంతో టీడీపీ ఇక్కడ సలువుగా విజయం సాధించింది. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ఎల్‌బీ నగర్‌లో ఎం.రామ్మోహన్‌గౌడ్, కుత్బుల్లాపూర్‌లో హన్మంతరెడ్డి టికెట్టు రాకపోవడంతో చివరి నిమిషంలో కారెక్కారు. ఆ పార్టీ తరఫున బరిలోకి దిగడం కాంగ్రెస్ ఓట్లలో చీలిక తెచ్చింది.

    ఇది ప్రత్యర్థి పార్టీని విజయతీరాలకు చేర్చింది. వికారాబాద్‌లోను ఒకవర్గం వ్యతిరేకంగా పనిచేయడం కూడా మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఓటమి కారణంగా విశ్లేషించుకోవచ్చు. ఇదే పరిస్థితి పార్లమెంటు స్థానాల్లోను స్పష్టమైంది. అటు మల్కాజిగిరి, ఇటు చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లో భారీ క్రాస్ ఓటింగ్ జరిగింది. స్థానికంగా ఎంపీ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత వారికి పోలైన ఓట్లలో స్పష్టమైంది.
     
    వైరం... గెలుపునకు దూరం!

    తెలుగుదేశం జిల్లాలో ప్రభంజనం సృష్టించినా.. కొన్ని నియోజకవర్గాలు చేజారేందుకు సీనియర్ల వ్యవహారశైలే కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మల్కాజిగిరిలో బీజేపీ, మేడ్చల్‌లో పార్టీ పరాజయం చవిచూసేందుకు దారితీసింది. తనకు టికెట్ దక్కకుండా రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ పావులు కదపడాన్ని జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాత్రికి రాత్రే పార్టీకి గుడ్‌బై చెప్పడమేగాక..మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు.

    మైనంపల్లికి అనుచరుడిగా పేరున్న నక్కా ప్రభాకర్‌గౌడ్‌కు కూడా టికెట్ ఇవ్వకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో రెబల్‌గా బరిలో దిగిన న క్కా.. చివరి నిమిషంలో తన బాస్ మైనంపల్లిని అనుసరించారు. దీంతో అటు మల్కాజిగిరిలోను, ఇటు మేడ్చల్‌లోని వీరి ప్రధాన అనుచరగణం పూర్తిగా గులాబీ పంచన చేరింది. ఈ పరిణామంతో నామమాత్రపు పోటీ ఇస్తుందనుకున్న టీఆర్‌ఎస్.. వీరి చేరికతో అనూహ్యంగా పుంజకుంది. ఈ రెండు స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్‌లలో పార్టీ కేడర్ పక్కచూపులు చూస్తోందని తెలుస్తున్నా జిల్లా నాయకత్వం నష్టనివారణ చర్యలకు దిగకపోవడంతో చేవెళ్ల ఎంపీ స్థానం చేజారింది.
     
    కమలానికి శల్య సారథ్యం!
     
    పొత్తులో భాగంగా జిల్లాలో నాలుగు సీట్లు దక్కించుకున్న బీజేపీ.. వీటిలో ఒకదాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. వికారాబాద్, పరిగిలలో మాజీ మంత్రులకు టికెట్లు ఇచ్చినా, వారి తరఫున జిల్లా నాయకత్వం కనీసం ప్రచారం చేసిన దాఖలాలు కూడా లేవు. సీనియర్లను కాదని, వలసనేతలకు సీట్లు కట్టబెట్టడంపై అసంతృప్తితోనే ప్రచారానికి దూరంగా వ్యవహరించారు. దీంతో ఈ రెండు స్థానాల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. వికారాబాద్‌లో ఐతే నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

    పరిగిలో మూడో స్థానానికే పరిమితమైనా, ఉప్పల్‌లో గెలుపొందడం, మల్కాజిగిరిలో దాదాపు గెలుపు దాకా వెళ్లడం పార్టీకి ఊరట కలిగించింది. ఏది ఏమైనా నాయకత్వ వైఫల్యం అభ్యర్థుల ఓటమిలో ప్రధానభూమిక పోషించిందనడం నిర్వివాదాంశం. దేశవ్యాప్తంగా నమో జపం న డుస్తున్నా దాన్ని సొమ్ము చేసుకోవడంలో స్థానిక నాయకత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది.
     
    కొంపముంచిన వ్యతిరేకత!

    ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడంతో చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ భంగపడింది. సీనియర్ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ఓటమికి ప్రజలు మార్పు కోరడమే ప్రధాన కారణమైతే, చేవెళ్లలో కొంతమేర తిరుగుబాటు అభ్యర్థి కారణమైతే, మరికొంత ప్రజా వ్యతిరేకత తోడయింది. ఈ రెండు చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలను నమోదుచేసిన గులాబీ దళం.. ఎమ్మెల్యేకొచ్చేసరికి బోల్తా పడింది. చేవెళ్లలో రెబల్ అభ్యర్థిని తేలికగా తీసుకోవడం కొంపముంచింది.

    నాలుగుసార్లు గెలిచిన హరీశ్వర్‌పై ప్రజలకు విముఖత ఏర్పడటం, కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్‌రెడ్డికి సానుభూతి పవనాలు వీచడం టీఆర్‌ఎస్ పరాజయానికి దారితీసింది. ఇక ఇతర నియోజకవర్గాల్లో పార్టీ అనూహ్యంగా పుంజుకున్నా, పోల్ మేనేజ్‌మెంట్‌లో కొరవడిన అవగాహనతో మంచి ఫలితాలను రాబట్టలేకపోయింది. తెలంగాణవ్యాప్తంగా వీచిన హవా జిల్లాలోనూ స్పష్టంగా కనిపించినా... దాన్ని అందిపుచ్చుకోవడంలో స్థానిక నాయకత్వం విఫలమైంది.
     

Advertisement
Advertisement