Sakshi News home page

కాంగ్రెస్‌తోనే ‘నవతెలంగాణ’

Published Tue, Apr 8 2014 11:50 PM

nava telangana possible with congress says damodara rajanarasimha

 గజ్వేల్, న్యూస్‌లైన్: నవ తెలంగాణ నిర్మాణం కాంగ్రెస్‌కే సాధ్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దామోదర ప్రసంగిస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటువల్ల రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో పార్టీ తీవ్రమైన నష్టానికి గురవుతుందని తెలిసీ కూడా పోనియాగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. అదే  స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో ముందుకుసాగుతోందని చెప్పారు. సొంత రాష్ట్రం కలను నిజం చేసిన సోనియాను మరిచిపోవద్దన్నారు.

 పూటకో మాట మాట్లాడే కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి గారడీ మాటలతో వస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను గెలిపిస్తే దొరల తెలంగాణ వచ్చి పేదల జీవితాలు మరింత అగాధంలోకి వెళతాయని చెప్పారు. తెలంగాణ ప్రజల సుందర స్వప్నమైన ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని పూర్తి చేయడం కాంగ్రెస్‌కే సాధ్యమనే విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ టీఆర్‌ఎస్ స్థాపించకముందే తానూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశానని గుర్తు చేశారు. 41మంది ఎమ్మెల్యేలతో సోనియాగాంధీకి వినతిపత్రం సమర్పించానని చెప్పారు. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రజలను ప్రజావంచనకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు అమలుకు సాధ్యంకానీ మేనిఫెస్టోను విడుదల చేశాయని మండిపడ్డారు.  ఎన్నో హమీలనిచ్చి నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు.

 గజ్వేల్‌పై కేసీఆర్ పెత్తనమేంటీ?
 గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ స్థానికేతరుడైన కేసీఆర్ గజ్వేల్ ప్రజలపై పెత్తనం చెలాయిస్తానంటే ఇక్కడి ప్రజలు సహించేస్థితిలో లేరని పేర్కొన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లాలంటే నాలుగు గేట్లు ఉంటాయని, ఈ గేట్లు దాటి ప్రజలు వెళ్లటం అసాధ్యమని చెప్పారు. అదే గజ్వేల్‌లోని తన ఇంటికి ప్రజలు ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటానని చెప్పారు. టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిది మోసాల చరిత్ర అని విమర్శించారు. గజ్వేల్‌లో టీఆర్‌ఎస్, టీడీపీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదిలావుంటే తనకు రాజకీయాల్లో ఎంతోప్రోత్సాహన్నిచ్చి సమర్థంతమైన పాలన అందించిన వైఎస్‌ను మరిచిపోలేనని చెప్పారు. ఇంకా ఈ సభలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి శ్రవన్‌కుమార్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.

 గజ్వేల్‌లో భారీ ర్యాలీ....
 నర్సారెడ్డి నామినేషన్ సందర్భంగా గజ్వేల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోటమైసమ్మ గుడి నుంచి ఇందిరాపార్క్, అంబేద్కర్ చౌరస్తాల మీదుగా బహిరంగ సభా ప్రదేశం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు ఈ సందర్భంగా బతుకమ్మలు, బోనాల ఊరేగింపుతో ఆకట్టుకున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement