కొంచెం దగ్గర దూరం | Sakshi
Sakshi News home page

కొంచెం దగ్గర దూరం

Published Sun, Feb 8 2015 4:11 AM

కొంచెం దగ్గర దూరం - Sakshi

     డిప్యూటీ సీఎంపై ఎమ్మెల్యేల్లో అనుమానాలు
     పాత అనుభవాలు గుర్తు చేసుకుంటున్న నేతలు
     పస్తుతం ఎలా ఉంటారో అని ఆలోచన
     ‘కడియం’కు పదవితో మారుతున్న రాజకీయాలు
     జిల్లా టీఆర్‌ఎస్‌లో సరికొత్త సమీకరణలు

 
 సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఉప ముఖ్యమంత్రి మార్పుతో జిల్లా రాజకీయాల్లో సమీకరణలు మారుతున్నాయి. తాటికొండ రాజయ్య స్థానంలో ఆయన ప్రత్యర్థి కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో అధికార టీఆర్‌ఎస్‌లో సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు రాజయ్యకు సన్నిహితంగా ఉన్న ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఇప్పుడు కడియం శ్రీహరికి దగ్గర య్యే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం లో కీలకంగా వ్యవహరించిన కడియం శ్రీహరి పరిపాలన పరంగా, పార్టీ పరంగా పదేళ్లపాటు జిల్లా రాజకీయాలను శా సించారు.
 
 కడియం శ్రీహరితోపాటు టీడీపీలో పని చేసిన పలువురు ఇటీవలి సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరుఫున గెలిచారు. కొందరు కడియం శ్రీహరికి ముందు, మరికొంద రు ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరారు. టీడీపీలో రాజకీయంగా అవకాశాలు రాకపోవడం, వ్యక్తిగత కారణాలతో అ ప్పట్లో ఆ పార్టీని వీడిన వారు.. టీఆర్‌ఎస్‌లో చేరి కీలక నా యకులయ్యారు. ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇప్పుడు వీరికి, కడియం శ్రీహరికి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనేది గులాబీ శ్రేణులకు ఆసక్తికరంగా మారింది. సత్సంబంధాల విషయంలో ఉప ముఖ్యమంత్రితో ఏ ఎమ్మెల్యే ఎలా ఉంటున్నారనే విషయంలో ఒకింత సందేహాలు ఉన్నాయి.
 
  మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యకు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజకీయంగా దీర్ఘకాలికంగా ప్రత్యర్థి. రాజయ్యకు పదవి దూరమవడం ఎలా ఉన్నా.. శ్రీహరి అదే పదవిలో ఉండడం ఇబ్బందికరంగా మారింది. శ్రీహరి, రాజయ్య ఇద్దరు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందినవారే. సాధారణ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఈ సెగ్మెంట్‌లో పట్టు కోసం రాజయ్య ఎంపీపీ ఎన్నికల్లో కడియం వర్గంపై పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పరిస్థితి మారింది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఈ రెండు వర్గాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
 
  గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ గతంలో టీడీపీలో పని చేసినవారే. 2004 ఎన్నికల్లో చందూలాల్‌కు టీడీపీ తరుఫున ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం దక్కలేదు. అప్పడు టీడీపీ జిల్లా పార్టీలో కడియం శ్రీహరి కీలకంగా వ్యవహరించారు. తాజాగా చందూలాల్‌కు మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు కడియం శ్రీహరితో చందూలాల్ మధ్య దూరం లేదు. అలాగని పూర్తిస్థాయిలో సన్నిహితంగానూ లేరు.
 
  పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్ గతంలో టీడీపీలో పని చేశారు. మాజీ మంత్రి ప్రణయ్‌భాస్కర్ రాజకీయ వారసుడిగా వినయ్‌భాస్కర్‌కు 1999లోనే శాసనసభకు పోటీ చేసే అవకాశం ఉన్నా రాలేదు.  2004లోనూ వినయ్‌భాస్కర్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పడు టీడీపీలో కీలకంగా ఉన్న ఇద్దరు అగ్రనేతల వల్లే వినయ్‌కి అవకాశాల పరంగా ఇబ్బందులు కలిగాయని రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ చర్చ జరుగుతోంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. వినయ్‌భాస్కర్ టీఆర్‌ఎస్‌లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం వీరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా వాస్తవ పరిస్థితి ఏమిటనే విషయంలో గులాబీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.
 
  వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో రాజకీయంగా ఎలా ఉంటున్నారనేది ఈ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ కార్యకర్తలకు స్పష్టత రావడం లేదు. కొండా సురేఖకు మంత్రి పదవి రాకుండా జిల్లా ప్రజాప్రతినిధులు పలువురు ప్రయత్నించారని ప్ర చారం జరుగుతోంది. దీనికి కారకులు ఎవరనే విషయంలోనూ గులాబీ పార్టీ నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది.
 
  డోర్నకల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన డీఎస్ రెడ్యానాయక్ గత నవంబరులో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదే నియోజకవర్గం నుంచి సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యవతి రాథోడ్ అంతకుముందు టీడీపీలో పని చేశారు. కడియం శ్రీహరి సహకారంతోనే సత్యవతి రాథోడ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో, నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న సత్యవతి రాథోడ్‌కు రాజకీయంగా సహకరించే కడియం శ్రీహరితో డీఎస్ రెడ్యానాయక్‌కు సత్సంబంధాలు సాధ్యమేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
  జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి టీఆర్‌ఎస్‌లో సీనియర్ నేతగా ఉన్నారు. జనగామ అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జనగామ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో అప్పటి వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిపై ముత్తిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కొద్ది నెలలుగా మాత్రం వీరి మధ్య సత్సంబంధాలే ఉన్నట్లు కనిపిస్తోంది.
 
  వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ గతంలో టీడీపీలో పని చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ సెగ్మెంట్‌లో పోటీ విషయంలో గతంలో కడియం శ్రీహరి, అరూరి రమేశ్ మధ్య అంతరం పెరిగింది. సాధారణ ఎన్నికల్లో ఇద్దరు టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయినా ఇద్దరి మధ్య కొంత అంతరం కొనసాగింది. టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుపై అధ్యయనానికి కడియం నేతృత్వంలో ఏర్పాటు చేసిన బృందంలో అరూరి రమేశ్ ఉన్నారు. ఈ పార్కు ఏర్పాటు అధ్యయనం కోసం గుజరాత్, తమిళనాడుకు వెళ్లిన సందర్భాల్లో ఇద్దరి మధ్య అంతరం తగ్గిపోయిందని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి.
 
  పరకాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి గత నవంబరులో టీఆర్‌ఎస్‌లో చేరారు. కడియం టీడీపీలో ఉన్న రోజుల్లోనూ ధర్మారెడ్డికి ఈయనకు మధ్య అంతరమే ఉండేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరే సమయంలోనూ వరంగల్ ఎంపీగా ఉన్న కడియంను కలవలేదని తెలిసింది. టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు అధ్యయన బృందంలో ధర్మారెడ్డి ఉన్నారు. ఇతర రాష్ట్రాల పర్యటనల్లో వీరిద్దరు దగ్గరగా ఉండడంతో వీరి మధ్య అంతరం తగ్గిందని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి.
 
  మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో టీడీపీలోనే పనిచేశారు. ఇ న్నాళ్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యకు సన్నిహితం గా ఉన్న శంకర్‌నాయక్‌కు, ప్రస్తుత డిప్యూటీ సీఎం శ్రీహరితో సాధారణ సంబంధాలు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.
 

Advertisement
Advertisement