అభివృద్ధికి చేయూత | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి చేయూత

Published Sun, Jun 8 2014 1:50 AM

అభివృద్ధికి చేయూత - Sakshi

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హామీ
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి సహకారం
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పండే పంటలను దృష్టిలో ఉంచుకుని వాటికిసంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో వరి, మొక్కజొన్న ఎక్కువగా సాగవుతున్నందున వాటికి సంబంధించిన యూనిట్లకు ప్రాధాన్యమిస్తామన్నారు. దీనికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రితో త్వరలో మాట్లాడతానన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా నిర్మలాసీతారామన్ శనివారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
 
  హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పటికీ తెలంగాణలోని ఇతర పట్టణాలు వెనకబడి ఉన్నాయని, ఆయా జిల్లాల ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. దానివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అలాగే, ప్రత్యేక నైపుణ్యాలను పెంచుకునేలా యువతకు శిక్షణనందించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.
 
  రాష్ట్రంలో ఖాయిలాపడ్డ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశించారన్నారు.
 
  ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా తానే ఉన్నందున పారిశ్రామిక ప్రగతిపై రూపొందించిన ప్రణాళికల అమలు సులువవుతుందన్నారు.
 
  కొన్ని సంవత్సరాలుగా దేశంలో పారిశ్రామిక ఉత్పాదకత హీనదశకు చేరుకున్న నేపథ్యంలో దాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు.
  త్వరలో కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రకటిస్తామని, ఎఫ్‌డీఐల విషయంలో తాము ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన అంశాల మేరకే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
 
  రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను బట్టి కాకుండా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం ప్రగతి సాధిస్తుందనే మౌలిక సూత్రం మేరకు తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు రుణ మాఫీ గురించి ప్రస్తావించగా.. అది రాష్ట్రప్రభుత్వాలకు సంబంధించిన విషయమన్నారు.
 విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, సీనియర్ నేతలు శేషగిరిరావు, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 బీజేపీ శ్రేణుల స్వాగతం
 
 శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో నిర్మాలా సీతారామన్‌కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు వెంటరాగా ర్యాలీగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నేతలు ఆమెను ఘనంగా సన్మానించారు.

Advertisement
Advertisement