ఆర్‌టీఏ కార్యాలయం..ఏజెంట్ల రాజ్యం | Sakshi
Sakshi News home page

ఆర్‌టీఏ కార్యాలయం..ఏజెంట్ల రాజ్యం

Published Fri, Jul 11 2014 1:56 AM

no change in rta office if sometimes acb raids

ఖమ్మం క్రైం: ఆర్టీఏ- ఈ పేరు విన్నంతనే అనేకమందికి ‘కరెన్సీ నోట్లు’ గుర్తుకొస్తాయి. ఈ శాఖలో అటు అధికారులు, ఇటు ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు దండుకుంటున్నారు. ఈ శాఖలో అడపాదడపా ఏసీబీ దాడులు జరుగుతున్నా పరిస్థితిలో ఏమాత్రం మార్పుండడం లేదు. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఏజెంట్ల రాజ్యం నడుస్తోంది. లెసైన్స్ కోసమో, రిజిస్ట్రేషన్ కోసమో నేరుగా ఇక్కడకు వెళ్లేవారు చాలా తక్కువ.

 ఒకవేళ వెళ్లినా.. అనేక కొర్రీలు పెడుతూ రోజులతరబడి తిప్పించుకుంటారు. ఇలా లాభం లేదనుకుని ఏజెంటు వద్దకు వెళితే.. అవసరమైన పత్రాలేవీ లేకపోయినా మీ పని వెంటనే పూర్తవుతుంది. ఏజెంట్ల నుంచి ఇక్కడి అధికారులు, సిబ్బంది కమీషన్లు తీసుకుంటూ.. వారికి పని చేసిపెడుతున్నారు. కేవలం కమీషన్ల కోసమే ఏజెంట్ల వ్యవస్థను ఇక్కడి అధికారులు, సిబ్బంది కొన్నేళ్ల నుంచి పెంచి పోషిస్తున్నారు.

లెసైన్స్, ట్రాన్స్‌పోర్ట్, నాన్ ట్రాన్స్‌పోర్ట్ ఫీజు కట్టేందుకు వాహనదారులు కౌంటర్ వద్ద గంటలతరబడి లైన్‌లో నిలుచున్నా సిబ్బంది పట్టించుకోరు. అదే ఏ ఏజెంటో వచ్చి కాగితం కింద నోటు పెట్టి నిలబడగానే.. పనయిపోతుంది. ఈ కార్యాలయ సిబ్బంది ఒకొక్కరికి ఒక్కో ఏజెంట్ చొప్పున ఉన్నారు. వీరంతా సాయంత్రం పూట ‘పంపకాలు’ సాగిస్తుం టారు. ఇదంతా ఇక్కడ బహిరంగ రహస్యమే. అయినప్పటికీ ఉన్నతాధికారులెవరూ ఇప్పటివరకూ స్పందించిన దాఖలాల్లేవు.

 అవినీతికి కేరాఫ్‌గా...
 ఆర్‌టీఏ శాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. లెర్నింగ్ లెసైన్స్ నుంచి పెద్ద పెద్ద వాహనాల పర్మిట్ వరకు లక్షల్లో డబ్బు చేతులు మారుతోంది. ప్రైవేట్ పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్ లేకపోయినా, హెవీ వెహికిల్స్‌కు లెసైన్స్ లేకపోయినా ఏమాత్రం టెన్షన్ అవసరం లేదు. ఈ వాహనాన్ని అధికారులు పట్టుకుంటే... ఎంతోకొంత డబ్బు ముట్టచెప్పి తేలిగ్గా బయటపడొచ్చు. 2006లో ఆర్టీఏ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి, అనధికారికంగా ఉన్న డబ్బును స్వాధీనపర్చుకున్నారు.

2008లో అప్పటి వైరా మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావును ఏసీబీ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, ఆయన అక్రమ ఆస్తులను స్వాధీనపర్చుకున్నారు. జిల్లాలోని ఓ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ అవినీతిపై ఇటీవల ఒక టీవీ చానల్ లైవ్ టెలికాస్ట్ చేసినా కూడా ఆర్టీఏ ఉన్నతాధికారుల్లో స్పందన కనిపించలేదు. దీనినిబట్టి ఇక్కడి ఈ శాఖలోని అవినీతిపై ఉన్నతాధికారులు ఎంత ఉదాసీనంగా ఉన్నారో ఊహించుకోవచ్చు.

 ప్రైవేట్ సైన్యానిదే పెత్తనం
 ఆర్టీఏ శాఖలో కొంతకాలంగా ప్రైవేట్ సైన్యం పెత్తనం సాగిస్తోంది. ఆర్డీవో దగ్గరి నుంచి ఎంవీఐలు, అసిస్టెంట్ ఎంవీఐలు సొంతంగా తమ కింద ప్రైవేట్ అసిస్టెంట్లను నియమించుకుని, వారి ద్వారా తమ అవినీతి కార్యకలాపాలు సాగిస్తున్నారు.

 ఆ ప్రైవేట్ వ్యక్తులు ఏకంగా అధికారుల సీట్లలోనే కూర్చుని ‘పాలనా వ్యవహారాలు’ చక్కబెడుతున్నారంటే.. ఇక్కడి పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. వీరు లక్షల్లో డబ్బు దండుకుంటూ, అందులతో కొంత వాటాను అధికారులకు, సిబ్బందికి ముట్టచెబుతున్నారు.

Advertisement
Advertisement