ఆయ‘కట్టు’ తప్పింది! | Sakshi
Sakshi News home page

ఆయ‘కట్టు’ తప్పింది!

Published Tue, Feb 24 2015 3:13 AM

ఆయ‘కట్టు’ తప్పింది!

లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనే బృహత్తర లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దూరమవుతోంది.. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రణాళికా లోపం రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారుతోంది.. సాగునీటి పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నా మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోంది.. పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులకు నిధులివ్వక, నిధులిచ్చిన ప్రాజెక్టులు పూర్తిగాక ఎక్కడిదక్కడే ఉండిపోతోంది.. శరాఘాతంలా పరిణమించిన భూసేకరణ, ఎటూ తేలని భూ పరిహారం, ఎస్కలేషన్ చెల్లింపులపై తేల్చని ప్రభుత్వ ధోరణితో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది..  ఈ ఏడాది కొత్తగా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరిస్తామన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ హామీ కూడా నీళ్లలోనే కలసిపోయింది.    
 - సాక్షి, హైదరాబాద్
 
 వ్యయం భారీగానే..
 రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను వ్యయం చేస్తోంది. కానీ ఫలితం మాత్రం ఉండడం లేదు. మొత్తంగా 33 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టి... 2004 నుంచి ఇప్పటివరకు రూ. 37,935 కోట్ల మేర ఖర్చుచేశారు. ఈ ఏడాది (2014-15) బడ్జెట్‌లోనూ సాగునీటి ప్రాజెక్టులకు రూ. 4 వేల కోట్ల మేర కేటాయింపులు చేశారు. ఇందులో ఇప్పటివరకు రూ. 3,200 కోట్ల మేర నిధులను ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. వచ్చే బడ్జెట్‌లో సైతం ఇదే స్థాయి కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కానీ ఈ స్థాయిలో నిధుల వ్యయం జరుగుతున్నా... గత పదేళ్లలో సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు కేవలం 6.34 లక్షల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం.
 
 ఒక్క అడుగూ కదల్లేదు..
 ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం కారణంగా ఈ ఏడాది నిర్దేశించుకున్న ఆయకట్టు లక్ష్యం.. ఒక్క అడుగు కూడా కదలలేదు. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించి, వెంటనే పూర్తిచేస్తామని... మార్చి నాటికి ఆరు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందిస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కొత్తగా రెండు వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించగలిగింది.
 
 మూల్యం తప్పదా?
 సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మూల్యం భారీగానే చెల్లించుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఆ అదనపు మోత ఈ ఏడాది వరకు సుమారు రూ. 10 వేల కోట్ల వరకూ ఉంటుందని నిపుణుల అంచనా. ఆలస్యమైన కొద్దీ ఈ ‘భారం’ మరింత పెరగవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. నిర్మాణాలు దాదాపు చివరిదశకు చేరిన పలు ప్రధాన ప్రాజెక్టుల పనులు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. చాలా ప్రాజెక్టుల నిర్మాణాల కోసం పెట్టుకున్న తుది గడువు ఎప్పుడో ముగిసిపోవడంతో... మరి కొన్నేళ్లు పెంచుతూనే వస్తున్నారు. ఇలా పొడిగిస్తుండడంతో అంచనా వ్యయాన్ని కూడా సవరించాల్సి వస్తోంది. పలు ప్రాజెక్టుల పనులకు సంబంధించిన ధరల (ఎస్కలేషన్ చార్జీల)ను పెంచాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తూ.. పనులను కూడా నిలిపివేశారు. ధరలను పెంచితేనే పనులు చేస్తామంటున్నారు. వారు కోరుతున్న మేర ఎస్కలేషన్ చార్జీలను చెల్లిస్తే ప్రభుత్వంపై అదనంగా రూ. 10 వేల కోట్ల భారం పడనుంది.
 
 చేతిదాకా వచ్చినా..
 మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్‌బీమా, కోయిల్‌సాగర్, నల్లగొండలోని ఏఎమ్మార్పీ, వరంగల్‌లోని దేవాదుల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండలకు సాగునీటిని ఇచ్చే ఎస్సారెస్పీ-2, వరద కాలువ, కరీంనగర్‌లోని ఎల్లంపల్లి, ఖమ్మం జిల్లాకు చెందిన రాజీవ్‌సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలు 80 శాతానికిపైగా పూర్తయ్యాయి. ఏఎమ్మార్పీ, దేవాదుల ప్రాజెక్టుల నుంచి ఇప్పటికే పాక్షికంగా నీటిని కూడా విడుదల చేశారు. అలాగే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల నుంచి ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో నీటిని ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కూడా మందకొడిగా సాగుతున్నాయి.
 
 నత్తను మించిపోయింది..
 2014-15లో సాగులోకి తేవాల్సిన ఆయకట్టు లక్ష్యం..
 6,27,607 ఎకరాలు
 (అదనంగా స్థిరీకరణ 12,000 ఎకరాలు)
 ఫిబ్రవరి 15 నాటికి సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు.. 2,000 ఎకరాలు (కొమురంభీమ్ ప్రాజెక్టు పరిధిలో)
 2015-16 ఏడాది కోసం నిర్దేశించుకున్న
 కొత్త ఆయకట్టు లక్ష్యం...
 6,72,000 ఎకరాలు
 
 లక్ష్యాన్ని నీరుగార్చేవి ఇవే..
   ప్రభుత్వ ప్రణాళికా లోపం..
  అధికారుల్లో చొరవ లేకపోవడం
   ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న
 భూసేకరణ సమస్యలు, పరిహారంలో జాప్యం
   ఎస్కలేషన్ చార్జీలు పెంచాలంటూ
  పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు
  కాంట్రాక్టర్ల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం
 ఎటూ తేల్చకపోవడం
 
 లక్ష్యం బారెడు.. పని మూరెడు
 మొత్తం ఆయకట్టు లక్ష్యం..
 47,47,736 ఎకరాలు
 అదనంగా స్థిరీకరించాల్సినది..
 42,000 ఎకరాలు
 ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చినది
 6,20,461 ఎకరాలు
 ఇంకా వృద్ధిలోకి రావాల్సింది...
 41,27,275 ఎకరాలు

Advertisement
Advertisement