జెడ్పీలో బాహాబాహీ | Sakshi
Sakshi News home page

జెడ్పీలో బాహాబాహీ

Published Sun, Jun 28 2015 2:30 AM

Officers Fight in ZP Office

 ఆదిలాబాద్ :జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌లో బాహా బాహీ చోటుచేసుకుంది. శనివారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో ఈ వివాదం జరిగింది. సాక్షాత్తు జిల్లా మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ జగన్మోహన్, ఎస్పీ తరుణ్‌జోషిలు సంఘటనా స్థలానికి కూతవేటు దూరంలో జెడ్పీ సమావేశ మందిరంలో ఉన్నా.. ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈని నిర్మల్ ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్ చెప్పుతో కొట్టాడనే ప్రచారం గుప్పుమంది. బిల్లు సెటిల్‌మెంట్ వివాదమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. ఈ విషయంలో సదరు అధికారి కూడా కనీసం తన ఉన్నత అధికారికి ఫిర్యాదు చేయడంగాని, పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టడం గాని చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మరోపక్క అధికారి విషయంలో సదరు కాంట్రాక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గాని.. ఏసీబీని ఆశ్రయించడం గాని చేయాల్సిందిపోయి దాడికి పాల్పడడం సబబుకాదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.
 
 బిల్లు సెటిల్‌మెంట్ వివాదమే..
 జెడ్పీ కార్యాలయంలో పైఅంతస్థులోని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయంలో శనివారం ఉదయం డిప్యూటీ ఈఈని ఓ కాంట్రాక్టర్ ఆ సమయంలో అక్కడ ఉన్న అటెండర్ల సమక్షంలోనే చెప్పుతో కొట్టినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించడం లేదు. తాము సమావేశంలో ఉన్నామని.. వివాదం తన దృష్టికి రాలేదని ఈఈ మూర్తి పేర్కొన్నారు. కాగా నిర్మల్ ప్రాంతానికి చెందిన ఆ కాంట్రాక్టర్ నిర్మల్ డివిజన్‌లో గతేడాది వేసవిలో బోరువెల్ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. సుమారు 40 పనులకు సంబంధించి సుమారు రూ.20 లక్షల వరకు ఆయనకు బిల్లులు రావాల్సి ఉంది. దీనికి సంబంధిం చి కాంట్రాక్టర్‌కు డిప్యూటీ ఈఈకి బిల్లుల చెల్లింపులో పలుమార్లు వివాదాలు జరిగినట్లు సమాచారం. 13 ఫైనాన్స్ కింద గ్రాంట్ రిలీజ్ కాకపోవడంతో బిల్లు చెల్లించలేదని అధికారి చెబుతున్నాడు. కాగా ఈ విషయంలో మరో ప్రచారం జరుగుతోంది.
 
 ఇతర కాంట్రాక్టర్లకు సంబంధించి ముఖ్యంగా జిల్లా నేతలకు దగ్గర సంబంధాలున్న కాంట్రాక్టర్లకు ఇటువంటి పనుల్లోనే ఇతర గ్రాంట్ల నుంచి బిల్లులు చెల్లించారని, తన విషయంలో మాత్రం ఇతర గ్రాంట్ల నుంచి బిల్లులు చెల్లిం చకపోవడం పట్ల కాంట్రాక్టర్ ఆగ్రహంతోనే అధికారిపై దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య ఈ బిల్లు సెటిల్‌మెంట్ విషయంలో వివాదం కొనసాగుతున్నట్లు శాఖలో ప్రచా రం జరుగుతోంది. తాను మేజర్‌మెంట్ అన్ని పూర్తిచేసి బిల్లులను నిర్మల్ పీఏవో కార్యాలయానికి 9 నెల ల కిందట పంపినట్లు డిప్యూటీ ఈఈ చెబుతున్నారు. 13 ఫైనాన్స్ కింద గ్రాంట్ రిలీజ్ కాకపోవడంతో బిల్లు చెల్లించలేదని పేర్కొంటున్నారు. ఈ విషయంలో కాంట్రాక్టర్‌ను సంప్రదించేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. గతంలో వేరే జిల్లాలో పనిచేసినప్పుడు ఈ అధికారి అవినీతి కేసులో ఏసీబీకి కూడా పట్టుబడినట్లు సమాచారం. ఈ విషయంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఇంద్రసేన్‌ను వివరణ కోరగా.. తాను పుష్కరాల పనుల పరిశీలనలో ఉన్నత అధికారులతో కలిసి ఉన్నట్లు వివరించారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. ఎవరు ఫిర్యాదు కూడా చేయలేదని తెలిపారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement