టీటీడీపీలో అసంతృప్తి జ్వాలలు | Sakshi
Sakshi News home page

టీటీడీపీలో అసంతృప్తి జ్వాలలు

Published Tue, Sep 13 2016 5:01 AM

టీటీడీపీలో అసంతృప్తి జ్వాలలు - Sakshi

- తెలుగుయువత కమిటీలో విధేయులకు మొండిచెయ్యిపై రగులుతున్న సీనియర్లు

- రేవంత్‌రెడ్డి దూకుడును వ్యతిరేకిస్తున్న ఒక వర్గం

 

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. రాష్ట్రంలో ఎదురవుతున్న గడ్డు పరిస్థితుల్లోనూ పార్టీకి చేదోడు వాదోడుగా ఉన్న నాయకులు, కేడర్‌కు సరైన గుర్తింపు లభించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో కొందరు ముఖ్యనాయకులు సరిగా పనిచేయకపోగా, ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న వారిని కూడా అడ్డుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్న బీసీ వర్గాల నాయకులను పైకి రానీయకుండా పెద్ద నాయకులు తొక్కి పడుతున్నారని పార్టీలో అంతర్గత చర్చ సాగుతోంది. జిల్లాల్లో పలువురు నాయకులు తమ రాజకీయ వారసులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న సీనియర్ల హోదా తగ్గించి, పదవుల పరంగా ఇతరత్రా తగిన గౌరవం ఇవ్వకుండా చిన్నబుచ్చుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
 

 తెలుగుయువత కొత్త కమిటీతో భగ్గు..

 ఇటీవల 108 మందితో ఏర్పాటు చేసిన తెలుగుయువత నూతన కమిటీ కూర్పుపై ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని నాయకులు భగ్గుమంటున్నారు. 10, 15 ఏళ్ల క్రితమే రాష్ట్రస్థాయిలో పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత కల్పించకుండా, కమిటీలో చోటు కల్పించకుండా రాష్ట్రస్థాయి నాయకులే అడ్డుపడ్డారనే విమర్శలు పార్టీలో వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో క్రియాశీలకంగా ఉన్న నాయకులకు కమిటీలో అవకాశం కల్పిస్తూ.. ఇందుకు సిద్ధం చేసిన జాబితాలో వారి పేర్లను పొందుపరిచారు. అయితే ఆయా జిల్లాల్లోని ముఖ్య నాయకులు వీరు ఎక్కడ తమకు పోటీగా మారతారనే ఉద్దేశ్యంలో జాబితా నుంచి వారి పేర్లను తొలగించినట్లు విశ్వసనీయ సమాచారం. రాబో యే రోజుల్లో ఎమ్మె ల్యే టికెట్‌కు వారు తమకు పోటీ అవుతారనే అభిప్రాయంతోనే ఇప్పటి నుంచే నియంత్రించే ఆలోచనతో ఇది జరి గిందని ఒక నాయకుడు ‘సాక్షి’తో వాపోయారు. ఈ కమిటీలో సీనియర్లకు ప్రాధాన్యత లభించలేదని, సీనియర్లను కాదని జూనియర్లకు పెద్దపీట వేసిన మాట వాస్తవమన్నారు. తెలుగుయువత కమిటీలో స్థానం లభించని కొందరు నాయకులు టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద బహిరంగ ంగా నిరసన తెలిపేందుకు సిద్ధం కాగా.. చివరకు ఒక నేత సర్ది చెప్పడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు.

 

రేవంత్ దూకుడుపై నేతల గుర్రు

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రతి దానికీ దూకుడుగా వ్యవహరించడం కొందరు ముఖ్య నేతలకు మింగుడుపడడం లేదు. వివిధ జిల్లాల్లో రేవంత్‌కు అండగా ఉంటూ, ఆయనకు మద్దతిస్తున్న వారిని పార్టీలోని ఒక వర్గం అధిమేసే ప్రయత్నం చేస్తోందని ఆయా జిల్లాల్లోని నాయకులు ఆరోపిస్తున్నారు. రేవంత్ ఎదిగితే తమకు కష్టమని, అందువల్ల ఎక్కడికక్కడ ఆయనను నియంత్రించేందుకే కొందరు ముఖ్యనాయకులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ అనుయాయులకు ఆయా కమిటీల్లో ప్రాధాన్యతను కల్పించే విషయంలోనూ నాయకులు ఆచితూచి స్పందిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పలు కమిటీల నియామకాల్లోనూ రేవంత్ అనుచరులకు గుర్తింపు లభించకుండా వీరు జాగ్రత్త పడ్డారనే అభిప్రాయాన్ని కొందరు పార్టీ నాయకులే వెలిబుచ్చుతున్నారు.

Advertisement
Advertisement