విద్యావనంలో ఆందోళనల అలజడి! | Sakshi
Sakshi News home page

విద్యావనంలో ఆందోళనల అలజడి!

Published Tue, Jul 14 2015 2:36 AM

విద్యావనంలో ఆందోళనల అలజడి!

- ఓయూలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆందోళనలు
- పోరుబాటలో పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు
- డిమాండ్ల సాధన కోసం ప్రొఫెసర్లు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు...
- ప్రభుత్వం మొండివైఖరి వీడాలని విజ్ఞప్తి
ఉస్మానియా యూనివర్సిటీ:
ప్రఖ్యాత ఉస్మానియా వర్సిటీ ఇప్పుడు ఆందోళనల నిలయంగా మారింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓయూను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎక్కువయ్యాయి. ఎక్కడ సమస్యలు అక్కడే తిష్టవేయడంతో విద్యావనం అలజడులకు నిలయంగా మారింది. అధికార పార్టీ విద్యార్థి విభాగం టీఆర్‌ఎస్వీ మినహా ఇతర విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, ఉద్యోగులు సర్వత్రా ఆందోళన బాట పట్టారు. పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు, పరిశోధనలు చేసే పీహెచ్‌డీ విద్యార్థులు, చదవుకునే పీజీ విద్యార్థులు, సేవలందిస్తున్న ఉద్యోగులు యావత్తు ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

అందరి ఉమ్మడి డిమాండ్..రెగ్యులర్ వైస్ చాన్సలర్‌ను, పాలక మండలి సభ్యులను నియమించాలనే.. వీటితో పాటు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగ విరమణ వయసు యూజీసీ నిబంధనల ప్రకారం 60 నుంచి 65కు పెంచాలని, బ్లాక్ గ్రాంట్స్ నిధులు పెంచాలని కోరుతున్నారు. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు సీఎం ప్రకటించిన రూ.7 కోట్ల భోజన బకాయిలు చెల్లించాలని, ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని నిరుద్యోగ విద్యార్థులు కోరుతున్నారు. పీఆర్‌సీ, హెల్త్ కార్డులు,  పదోన్నతులు కల్పించాలని పర్మినెంట్ ఉద్యోగులు పోరాడుతున్నారు. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని టైంస్కేల్, కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

డిమాండ్ల సాధన కోసం తొలుత  వినతి పత్రాలు, సభలు, సమావేశాలు, రౌండ్‌టేబుల్ చర్చలు నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ధర్నాలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనాలు,  నల్లబ్యాడ్జీలతో నిరసన, రిలే నిరాహార దీక్షలకు దిగారు. అయినా పట్టించుకోకపోవడంతో అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు జూలై నెల చివరి వరకు వివిధ రూపాలలో దీర్ఘకాలిక పోరాటాలకు పిలుపునిచ్చారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే యూనివర్సిటీ నిరవధిక బంద్ చేపట్టనున్నట్లు వారు హెచ్చరిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రచారం చేసేందుకు విద్యార్థులు రంగం సిద్ధం చేశారు. చలో అసెంబ్లీ, సచివాలయం ముట్టడి, రైళ్లలో ప్రచారం తదితర ఆందోళన కార్యక్రమాలకు ఇప్పటికే విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ తొలి రాష్ట ప్రభుత్వ పాలనలో ఓయూకు ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందని ఎవరూ ఊహించలేదని సీనియర్ ప్రొఫెసర్, పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు.
 
రెగ్యులర్ వీసీ లేక గందరగోళం  
వందేళ్ల ఉత్సవాలను జరుపుకోబోతున్న ఓయూకు ఏడాది కాలంగా రెగ్యులర్ వీసీ లేకపోవడంతో క్యాంపస్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త రాష్ట్రానికి  కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలంగాణ ఉద్యమ కేంద్రం ఓయూ సమస్యలు తీరి, అనేక మందికి ఉద్యోగాలు లభిస్తాయని విద్యార్థులు ఊహించారు. అందుకు భిన్నంగా విద్యార్థులతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ తీరుపై విద్యార్థి జేఏసీ నాయకులు విచారం వ్యక్తం చేశారు.
 
వర్సిటీ ఉద్యోగుల ర్యాలీ
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూతో పాటు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలకు రెగ్యులర్ వైస్ చాన్సలర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీల బోధనేతర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వర్సిటీల సమస్యలపై కొనసాగుతున్న  ఆందోళనలో భాగంగా సోమవారం ఓయూ ఎన్జీవోస్ స్టాఫ్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుంచి పాలనా భవనం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.

అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు కంచి మనోహార్, పార్థసారధి, మల్లేష్, జ్ఞానేశ్వర్, అబ్దుల్ ఖదీర్‌ఖాన్, దీపక్‌కుమార్ తదితరులు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలకు  రెగ్యులర్ వీసీలు లేక ఏడాది కాలంగా ఉద్యోగుల సమస్యలు పేరుకపోయినట్లు తెలిపారు. పదోన్నతులు చేపట్టకుండానే 30 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని వివరించారు. కార్యక్రమంలో ఎల్లమయ్య, ఓంప్రకాష్, సిద్దిక్‌బేగ్, ఖాజా మొయినుద్దీన్, అక్బర్‌బేగ్, శివశంకర్, ఎంఏ మహమూద్, భూమారావు, రమేష్, అవినాష్, లక్షినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement