ఎవరో..? | Sakshi
Sakshi News home page

ఎవరో..?

Published Sat, Dec 27 2014 1:12 AM

ఎవరో..? - Sakshi

ఈసారి పార్టీ జిల్లా కార్యదర్శిగా మళ్లీ నంద్యాలకు బాధ్యతలు అప్పగిస్తారా లేక మారుస్తారా అనేది కూడా చర్చనీయాంశమవుతోంది. అయితే, ఇందుకు కారణం కూడా లేకపోలేదు. పార్టీ జిల్లా కార్యదర్శిగా మూడు టర్మ్‌లు పూర్తి చేసుకున్న వారికి సంప్రదాయబద్ధంగా స్టేట్‌సెంట్రల్ బాధ్యతలు అప్పగించడం జరుగుతోంది. గత రెండు పర్యాయాల్లోనూ అదే జరిగింది. దేవరకొండలో 1997లో జరిగిన జిల్లా మహాసభల్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు వెంకటనర్సింహారెడ్డి స్టేట్‌సెంట్రల్‌కు వెళ్లారు.

పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా నియమితులైన ఆయన స్థానంలో చెరుపల్లి సీతారాములును జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆయన కూడా 2007లో ఎమ్మెల్సీగా వెళ్లడంతో ఆయన స్థానంలో నంద్యాల నర్సింహారెడ్డి జిల్లా సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నియమించిన కమిటీలో నంద్యాల కూడా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు. ఈ కోణంలోనే ఆయన్ను స్టేట్‌సెంట్రల్‌కు పంపుతారా అనే చర్చ జరుగుతోంది. అయితే, పార్టీ అవసరాల దృష్ట్యా మరోసారి ఆయనను కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ పార్టీ నాయకత్వ మార్పు నిర్ణయం తీసుకుంటే మాత్రం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి బాధ్యతలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, జిల్లా కార్యదర్శి బాధ్యతలు తీసుకునేందుకు రంగారెడ్డి ఏమంటారనేది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాలా, జూలకంటా అనేది ఈనెల 29న తేలనుంది.

Advertisement
Advertisement