పట్నం.. వారసత్వానికి దూరం | Sakshi
Sakshi News home page

పట్నం.. వారసత్వానికి దూరం

Published Fri, Nov 9 2018 7:26 PM

Patnam Generation not interested politics - Sakshi

   సాక్షి, ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) :  రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు కొత్తేమికాదు. తల్లిదండ్రుల్లో ఎవ్వరైనా రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యే, ఎంపీగా ఎదిగితే.. తదనంతరం ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కుటుంబసభ్యుల్లో ఎవ్వరినో ఒకరిని రాజకీయంగా ప్రొత్సాహిస్తారు. తమతోనే రాజకీయ ప్రస్థానం ముగిసిపోవద్దని వారసత్వ పరంపర కోనసాగాలని తపన పడతారు. అందుకు అనుగుణంగా వారసులకు తర్ఫీదు నిస్తూ రాజకీయాలు చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంది. 
ఇబ్రహీంపట్నం  నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 11 మంది ఎమ్మెల్యేలుగా కోనసాగారు. వారి కుటుంబసభ్యుల్లో  ఎవ్వరూ కూడా వారి స్థానాలను భర్తీ చేసేందుకు రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకోలేదు.   1952 ద్విసభ్య నియోజకవర్గం ఉన్నప్పుడు కాంగ్రెస్‌ నుంచి ఎంబీ గౌతమ్, పీడీఎఫ్‌ నుంచి పిల్లయిపల్లి పాపిరెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగారు.

వారి సంతానం ఎవ్వరూ రాజకీయాల్లోకి రాలేదు. స్థానికేతరుడైన లక్ష్మీనర్సయ్య  1957, 1962,1967లో మూడుసార్లు వరుసగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. వారి కుటుంబసభ్యులేవ్వరో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియదు. స్థానికుడైన యాచారం మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన అనంతరెడ్డి  1972లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా కొనసాగారు. అ తదుపరి ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు కావడంతో అయన సంతానం రాజకీయాల్లో రాలేదు.  1978లో కాంగ్రెస్‌ నుంచి సుమిత్రాదేవి గెలిచినా అనారోగ్యంతో మధ్యలోనే కన్నుమూశారు. ఆమె కుటుంబ వివరాలు ఈ ప్రాంత ప్రజలకు తెలియవు.  తదనంతరం 1981, 1983లో జరిగిన ఉపఎన్నిక, సాధారణ ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్‌ తరుపున ఎమ్మెల్యేగా ఏజీ కృష్ణ గెలిచారు. అతనికున్న ఒక్క కుమారుణ్ణి సైతం నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయకపోవడం గమనార్హం.

అందరికీ ఆదర్శం
1985లో టీడీపీ నుంచి గెలిచిన సత్యనారాయణ పరిస్థితి అదే. కుటుంబసభ్యులనేవ్వరిని అయన రాజకీయాల్లోకి రానివ్వలేదు.   1989, 1994లో రెండు సార్లు సీపీఎం తరుపున గెలిచిన కొండిగారి రాములుకు భార్య, ఇద్దరు కూమారులు ఉన్నప్పటికీ రాజకీయాలకు వారు దూరంగానే ఉన్నారు.  టీడీపీ నుంచి 1999లో పుష్పలీల గెలిచినా కుటుంబ సభ్యులేవ్వరు రాజకీయాల్లోకి రాలేదు. 2004లో సీపీఎం నుంచి గెలిచిన మస్కు నర్సింహకు ఇద్దరు కుమారులు. రాజకీయాల్లో అయన కొనసాగుతున్నా కుటుంబసభ్యులను ప్రోత్సాహించలేదు.

టీడీపీ నుంచి 2009, 2014 రెండుసార్లు  గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు.  అయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తండ్రి వెంట రాజకీయాల్లో కొనసాగుతున్నా.. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే స్థాయికి అయన ఎదగలేదు.  గత ఎమ్మెల్యేల వారసులేవ్వరూ రాజకీయాల్లోకి వచ్చి నియోజకవర్గన్ని పాలించిన దాఖలాలులేవు. పలు నియోజకవర్గల్లో ఎమ్మెల్యేల వారసులుగా వారి కుటుంబసభ్యులు రాజకీయాల్లో రాణిస్తున్నా.. ఈ నియోజకవర్గంలో ఆ పరిస్థితి లేవకపోవడం గమనార్హం. ఎంబీ గౌతమ్, పిల్లాయి పాపిరెడ్డి, లక్ష్మీనర్సయ్య, సుమిత్రాదేవి, ఏజీ కృష్ణ, సత్యనారాయణలు స్థానికేతరులుగా.. అనంతరెడ్డి, కొండిగారి రాములు, కొండ్రు పుష్పలీల, మస్కు నర్సింహ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్థానికులుగా   ఎమ్మెల్యేలుగా పనిచేశారు

Advertisement
Advertisement