‘ఆధార్’ లేదని.. | Sakshi
Sakshi News home page

‘ఆధార్’ లేదని..

Published Tue, Nov 25 2014 11:59 PM

pension cut to 60 thousand people

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  పట్టణ ప్రాంతంలోని పింఛన్‌దారులంతా ఆధార్ కార్డు వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసిన అనంతరం పింఛన్ డబ్బులను లబ్ధిదారుడి వ్యక్తిగత ఖాతాలో వేయాలని పేర్కొంది.

ఈ క్రమంలో లబ్ధిదారులకు వివరాలు సమర్పించడానికి మార్చి నెలాఖరునాటికి గడువిస్తూ.. వివరాలు సమర్పించని వారికి పింఛన్లు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కొందరు లబ్ధిదారులకు సమాచార లోపం, మరికొందరికి ఆధార్ కార్డులు అందకపోవడంతో స్పందన కరువైంది. మరోవైపు ఎన్నికల హడావుడిలో ఉన్న యంత్రాంగం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించలేదు. దీంతో మెజారిటీ లబ్ధిదారులు ఆధార్ వివరాలు ఇవ్వలేదంటూ అధికారులు గ్రేటర్ పరిధిలోని 59,820 మందికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ పింఛన్ల చెల్లింపులు నిలిపివేశారు.

 రూ.11.63 కోట్లు వెనక్కు..
 ఆధార్ అనుసంధానం చేయలేదనే సాకుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  ఎనిమిది నెలలుగా పింఛన్లు పంపిణీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్ల పథకం రద్దు చేస్తూ, కొత్తగా ఆసరా పథకాన్ని అమల్లోకి తేవడంతో ఇందిరమ్మ పింఛన్లకు సంబంధించి రూ.11.63 కోట్లను జిల్లా యంత్రాంగం తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. దీంతో ఆయా లబ్ధిదారులంతా పింఛన్లకు దూరమయ్యారు. ఇటీవల ఈ అంశంపై పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగాన్ని నిలదీయగా.. ఆధార్ వివరాలు అనుసంధానం చేసుకున్న వారి వివరాలు ప్రభుత్వానికి నివేదించినట్లు అధికారులు పేర్కొన్నారు.
 
 నమోదు చేసుకుంది 30 వేలమందే..

 ఇందిరమ్మ పింఛన్ లబ్ధిదారులను ప్రభుత్వం ఆధార్ వివరాలు కోరిన నేపథ్యంలో 59,820 మంది లబ్ధిదారుల్లో 30 వేల మంది మాత్రమే ఆధార్ వివరాలు ఇచ్చినట్లు డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వివరాలు సమర్పించిన 30 వేల మంది లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇన్‌చార్జి పీడీ చంద్రకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం నివేదికను పరిశీలించి నిధుల విడుదలకు అంగీకరిస్తే 30 వేల మందికి పింఛన్ బకాయిలు వచ్చే అవకాశం ఉంది. దీంతో మిగతా 29,820 మందికి పింఛన్లు అందే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

Advertisement
Advertisement