ఇదేం చోద్యం ! | Sakshi
Sakshi News home page

ఇదేం చోద్యం !

Published Wed, Feb 11 2015 5:49 AM

pension list mistakes

ఇందూరు : మగవారికి వితంతు పింఛన్ రావడమేంటీ.. మరీ ఇంత అన్యాయమా పీడీ గారూ ! అర్హూలకు అందించే ‘ఆసరా’ ఇదేనా..? అంటూ జిల్లాలో జరిగిన ఓ ఘటనను ఉద్దేశించి జిల్లా పరిషత్ చైర్మన్, గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం చైర్మన్ దఫేదార్ రాజు అసహనం వ్యక్తం చేశారు. పెన్షన్ల జాబితాలో వితంతు పింఛన్ మంజూరైన రామవ్వ అనే మహిళ పేరును రామయ్యగా తప్పుడు పేరుతో ముద్రించడంతో ఆమె ‘ఆసరా’ కోల్పోయిందన్నారు.

నిజాంసాగర్ మండలంలో చోటు చేసుకున్న ఘటనపై, సంబంధిత అధికారుల పని తీరుపై మండిపడ్డారు. మంగళవారం జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా మొదటి రోజు ఉదయం గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘ సమావేశం జిల్లా పరిషత్‌లో నిర్వహించారు. వికలాంగులు పింఛన్ పొందటానికి ధ్రువపత్రాల కోసం జిల్లా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపునకు వస్తే అక్కడ అధికారులు, డాక్టర్లు పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల తన మండలానికి చెందిన ఓ వికలాంగుడు సదరం క్యాంపునకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ఓ డాక్టరు ఆ దరఖాస్తును తీసి బయటపడేశారన్నారు.

దీంతో వికలాంగుడు తన వద్దకు వచ్చి సదరంలో జరిగిన ఘటనపై గోడును వెల్లబోసుకున్నాడని, తాను స్పందిస్తే కాని ధ్రువ పత్రం లభించలేదన్నారు. ఇదేనా అధికారుల పనితీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల పేర్లను తారుమారు చేయడంతో ఇండ్ల రుణాల విషయంలో లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని హౌసింగ్ పీడీ చైతన్య దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో నిర్వహించిన సదరం క్యాంపుల్లో  సిబ్బంది అనర్హులకు సైతం వికలాంగ ధ్రువ పత్రాలు ఇచ్చారని, డబ్బులకు కక్కుర్తి పడి అడ్డదారులు తొక్కుతున్నారని కొందరు సభ్యులు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని సందరం క్యాంపులో సమయానికి అధికారులు ఉండటం లేదని, వికలాంగులు సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

ఇటు బోగస్ వికలాంగుల పింఛన్‌లపై విచారణ చేపట్టాలని సభ్యులు తీర్మానం చేశారు. జోగినీ, ఎయిడ్స్ బాధితులు, భర్త వదిలేసిన మహిళలకు కూడా పింఛన్ మంజురు చేసే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానం చేశారు. కాగా సమావేశానికి జిల్లా పరిశ్రమల శాఖ డీజీఎం రావడం లేదని, మరోసారి ఇలా జరిగితే ఊరుకోమని ద్వితీయ శ్రేణి అధికారిపై మండిపడ్డారు. యువజన సంక్షేమ శాఖ ద్వారా నిరుద్యోగ యువకులకు బ్యాంకు రుణాలు అందించే విషయంలో బ్యాంకర్లు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు.

అంత్యోదయ రేషన్ కార్డుల విషయంలో అర్హులకు అన్యాయం చేస్తున్నారన్నారు. జిల్లాలో అక్రమ ఇసుక దందాపై ఓ రెండు పేపర్లలో కథనాలు వస్తే తప్ప అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. మైనింగ్ శాఖ అడ్డగోలుగా అనుమతులివ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎవరికి ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని సభ్యులు వాపోయారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన బిద్యుత్ బకాయిలను పంచాయతీలు కట్టే స్థితిలో లేవన్నారు. ఎప్పటిలాగే కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని సమావేశంలో సభ్యులు తీర్మానం చేశారు.

Advertisement
Advertisement