పట్నంలో అడవి దోమ!

18 Jul, 2019 12:57 IST|Sakshi

సిటీలో ప్రమాదకరమైన పీఎఫ్‌ మలేరియా విజృంభణ

ఈ ఏడాది ఇప్పటికే 191 కేసులు నమోదు

పెరుగుతున్న డెంగీ జర్వాల కేసులు

నిర్లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటి దాకా ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకే పరిమితమైన దోమలు ఇప్పుడు గ్రేటర్‌లోనూ దాడులు చేస్తున్నాయి. ప్రధానంగా మలేరియాలో ప్రమాదకరమైన ప్లాస్మోడియం పాల్సీ ఫారం(పీఎఫ్‌) నగరంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి దాకా 191 మలేరియా కేసులు నమోదవగా, వీటిలో 150 మందిలో పీఎఫ్‌ లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అనధికారికంగా ఈ లెక్క మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి ద్వారా మలేరియా సోకుతుంది. మలేరియాలో ప్లాస్మోడియం వైవాక్స్‌(పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారం(పీఎఫ్‌) అనేవి రెండు రకాలు. ప్లాస్మోడియం వైవాక్స్‌ వ్యాపించినపుడు జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు ఉంటాయి. మందులు వాడితే తగ్గిపోతుంది. ఇది అంత ప్రమాదకరమైంది కాదు. కానీ ప్లాస్మోడియం పాల్సీఫారం మలేరియా చాలా ప్రమాదకరమైంది. గతంలో ఎక్కడో గిరిజన, అటవీ ప్రాంతాల్లో కన్పించే ఈ జ్వరాలు.. ప్రస్తుతం నగరంలోనూ వ్యాపిస్తున్నాయి. శివారు ప్రాంతాలు విస్తరించడం, కొత్తగా ఫామ్‌హౌస్‌లు అందుబాటులోకి రావడం, నిర్మాణానికి సంబంధించిన గుంతల్లో వరద నీరు చేరి నిల్వ ఉండటం, వాటి నిండా చెత్త పేరుకపోవడం వల్ల ఈ దోమల వ్యాప్తికి కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

రక్త పరీక్ష చేసేవారే లేరు
హైదరాబాద్‌ జిల్లాలో ఫీవర్‌ ఆస్పత్రి, కింగ్‌కోఠి, మాసాబ్‌ ట్యాంక్, మలక్‌పేట, సికింద్రాబాద్, కంటోన్మెంట్‌లలో మలేరియా సబ్‌సెంటర్లు ఉన్నాయి. 17 మంది ల్యాబ్‌ టెక్నిషియన్‌ పోస్టులు ఉండగా, వీటన్నింటికీ ఒక్క టెక్నీషియన్‌ మాత్రమే ఉన్నాడు. మిగతా 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో రక్త పరీక్షలు చేసే నాథుడే కనిపించడం లేదు. ఒక ప్రాంతంలో మలేరియా, డెంగీ కేసు నమోదైన వెంటనే ఆ కుటుంబంలోని మిగతా సభ్యులతో పాటు సదరు కాలనీలో 50 మందికి తక్కువ కాకుండా రక్త నమూనాలు సేకరించాలి. వాటిని ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు నమూనాలు సేకరించాలి. కొన్ని ఏరియాల్లో సేకరిస్తున్నా అవి ల్యాబ్‌లకు పంపి చేతులు దులుపుకొంటున్నారు. వాటిని పరీక్షించేందుకు తీవ్రంగా సిబ్బంది కొరత వేధిస్తోంది. పారిశుధ్యంపై దృష్టి దోమల నియంత్రణ చేపట్టాల్సిన బల్దియా చోద్యం చూస్తోంది.  

విజృంభిస్తున్న డెంగీ జ్వరాలు
కొన్ని రోజులుగా నగరంలో డెంగీ జ్వరాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో గతేడాది 150 డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదైతే.. ఈ ఏడాది ఇప్పటి దాకా 205 కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి ఈ జ్వర లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీని పూర్తిగా నివారించవచ్చు. అయితే, అందుకు తొలుత రక్త పరీక్షలు చేయాల్సి ఉన్నా ఆస్పత్రుల్లో ఆ అవకాశం దాదాపు ఉండడం లేదు. నగరంలో మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలుతున్నా సరే వైద్య ఆరోగ్యశాఖ మాత్రం నివారణ చర్యలు తీసుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం ఆ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.  

లక్షణాల గుర్తింపు ఇలా..  
ప్లాస్మోడియం పాల్సీఫారం రకం మలేరియాను వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. చికిత్స అందించడంలో ఆలస్యమైతే కాలేయం, మూత్ర పిండాలను దెబ్బతీస్తుంది. మెదడుపైనా దాడి చేసి రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దోమ కుట్టిన 10 నుంచి 14 రోజుల్లో జ్వరం వస్తుంది. రోజు విడిచి రోజు ఒక సమయంలో ఎక్కువగా సాయంత్రం వేళల్లో చలి జ్వరం వస్తుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు మూడు రోజులు మించి ఉంటే వెంటనే రక్త పరీక్షలు చేసుకోవాలి.    – డాక్టర్‌ శ్రీహర్ష, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 

మరిన్ని వార్తలు