‘తప్పనితేలితే రాజకీయ సన్యాసం’ | Sakshi
Sakshi News home page

‘తప్పనితేలితే రాజకీయ సన్యాసం’

Published Thu, Sep 3 2015 4:18 AM

‘తప్పనితేలితే రాజకీయ సన్యాసం’ - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘సీబీసీఐడీ దర్యాప్తు కోరుదాం. తప్పుడు పత్రాలు సమర్పించినట్లు విచారణలో తేలితే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా. తప్పు నీదని తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండు’ అని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల కమిషన్ పరిధి లో ఉన్న కేసు నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టించినట్లు ఆయన ఆరోపించారు.

బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్‌లతో కలిసి హరీశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ‘నేను ఎలాంటి ఫోర్జరీకి పాల్పడలేదు. సీఈసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన షెడ్యూల్స్ ఆధారంగా లభించిన తప్పుడు సమాచారం మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. అంతేగానీ మేమే తప్పుడు సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించినట్లు రామ్మోహన్‌రెడ్డి చవకబారు ప్రకటనలు చేయడం ఆయన దివాళాకోరు రాజకీయానికి నిదర్శనమన్నారు.

దమ్ముంటే ఇద్దరం సీఐడీ విచారణ కోరుదాం. తప్పెవరిదో విచారణలో తేలితే దానికి అనుగుణంగా రాజకీయాల నుంచి తప్పుకొందాం’ అని ఆయన అన్నారు. ఎన్నికల వ్యయం పద్దుల తప్పుడు లెక్కింపులో అప్పటి ఎన్నికల అధికారుల పాత్ర కూడా ఉందని హరీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కలెక్టర్‌ను, కోర్టునూ తప్పుదోవ పట్టించేలా నకిలీ పత్రాలు సమర్పించినట్లు తమ వద్ద నిర్దిష్ట ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కోర్టులో సచ్ఛీలతను నిరూపించుకుంటామన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడ్డానని చిల్లరమల్లర ఆరోపణలు చేస్తున్న రామ్మోహన్‌కు నా గత చరిత్ర తెలియనట్టుందని అన్నారు.

వందల ఎకరాల భూమిని పేదలకు పంచానని, పూడూరులో నిజాయితీగా భూ యజమాని నుంచే భూమిని కొన్నానని, ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పినా వ్యక్తిగత ఆరోపణలు, శవరాజకీయాలు చేస్తుండడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ‘అవినీతి మరకలేకుండా రాజకీయ జీవితం గడిపా. నా సొంత డబ్బులను ఖర్చుచేశానే తప్ప.. స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడలేదు. టీఆర్‌ఆర్ ఎక్కడెక్కడా అవినీతికి పాల్పడ్డారో త్వరలోనే చిట్టా విప్పుతా. ప్రభుత్వాన్ని మోసగించి మైనార్టీ కాలేజీలు నడుపుతున్న ఆయన అక్రమాలను వెలుగులోకి తేస్తా’నని హరీశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Advertisement
Advertisement