నాణ్యత నగుబాటు | Sakshi
Sakshi News home page

నాణ్యత నగుబాటు

Published Fri, Apr 24 2015 1:47 AM

Quality

మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.వేల కోట్ల ఖర్చు తో రోడ్ల నిర్మాణానికి పూనుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ల అనుసంధా నం జరుగుతోంది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్లను పది కాలాల పాటు నిలిచేలా నాణ్యతతో నిర్మించాల్సి ఉండగా.. కాంట్రాక్ట ర్ల ధనదాహం, అధికారుల అవినీతి వల్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు పెద్దపల్లి కాల్వశ్రీరాంపూర్ డబుల్ రోడ్డు పనులే నిదర్శనం.
 
 కరీంనగర్ : పెద్దపల్లి- కాల్వశ్రీరాంపూర్ డబుల్‌రోడ్డు పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయి. తొలిదశగా రూ.10 కోట్లతో పెద్దపల్లి రైల్వే లెవల్ క్రాసింగ్ నుంచి రాంపల్లి వరకు కొనసాగుతున్న రోడ్డు పనుల్లో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లు వదిలారు. గ్రావెల్ పనులు జరుగుతున్న సమయంలో ఆశించిన రీతిలో వాటర్ క్యూరింగ్ ముగించకుండానే నామమాత్రంగా నీల్లు పట్టి రోడ్డు పనులు పూర్తి చేశారు. ఇప్పుడు కంకర తేలి చెల్లాచెదురైన రోడ్డుపైనే బీటీ వేయడం వ ల్ల రోడ్డు మన్నిక ప్రశ్నార్థకంగా మారింది.
 
 రోడ్డుకు ఇరువైపుల చివరలో కంకర పైనా బీటీ వేయడంతో బలంగా పట్టుకునే పరిస్థితులు లేవు. దీంతో కొన్ని నెలల్లోనే ఇరువైపుల చివర భాగాలు దెబ్బతిని దాని ప్రభావం డబుల్ రోడ్డుపై పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కలలుకన్న డబుల్ రోడ్డు నిర్మాణం పనులను పర్యవేక్షించే ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ సైతం పనులు జరుగుతున్న సమయంలో అందుబాటులో ఉండడం లేదు. ఆర్‌ఆండ్‌బీ గ్యాంగ్‌మన్ మాత్రం ఒక్కరిద్దరు రోడ్డు వద్ద ఉండి సారు... ఇప్పుడే ఆఫీసుకు వెళ్లారని సమాధానం ఇస్తున్నారు.
 
 ప్రస్తుతం రైల్వే లెవల్ క్రాసింగ్ నుంచి రాంపల్లి ఎల్లమ్మగుడి వరకు రూ.10 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. రాంపల్లి ఎల్లమ్మగుడి నుంచి కాల్వశ్రీరాంపూర్ వరకు మరో రూ.10 కోట్లతో టెండర్లు పిలిచారు. అవి కూడా వారం పదిరోజుల్లో పూర్తవుతాయని అంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రోడ్డు పనుల్లో భాగంగా కల్వర్టుల నిర్మాణం సైతం నాసిరకంగా ఉంది. పాతకాలంలో నిర్మించిన పైపులైన్ కల్వర్టుకి ఇరువైపుల అతుకులు వేసి పై పై మెరుగులు దిద్దుతున్నారు. డబుల్ రోడ్డు నిర్మాణంతో వాహనాల రద్దీ పెరిగితే పాత కాలం నాటి పైపులైన్ కల్వర్టు దెబ్బతింటే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ల నుంచి అధికారులకు ముడుపులు ముట్టడం వల్లే నాణ్యత గురించి పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఎంతో కీలకమైన అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఇటువైపు తొంగిచూడకపోవడం విశేషం.
 
 కూనారం రోడ్డు నాలుగులైన్ల ప్రతిపాదన
 పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డును నాలుగులైన్ల రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పట్టణంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని హన్మంతుని పేట రైల్వే లెవల్ క్రాసింగ్ వరకు 100 ఫీట్ల వెడల్పుతో కూడిన నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, త్వరలోనే టెండర్లు పిలువన్నుట్లు సమాచారం.
 
 నాణ్యతపై నిఘా
 ఉంచుతున్నాం
 పెద్దపల్లి-కాల్వశ్రీరాంపూర్ డబుల్‌రోడ్డు నిర్మాణ పనులపై నిఘా ఉంచామని పెద్దపల్లి ఆర్‌అండ్‌బీ డీఈఈ రాములు చెప్పారు. నాణ్యత విషయంలో ఎలాంటి అనుమానాలు వచ్చినా ఎప్పటికప్పుడు అనుమతించి పనులు చేయిస్తున్నామన్నారు. క్వాలిటీ అధికారుల నివేదికల తరువాతనే బిల్లులు చెల్లిస్తామన్నారు.
 -డిఇఇ రాములు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement