అనుమతులు అడవిపాలు.. కాల్వలు రోడ్డు పాలు..! | Sakshi
Sakshi News home page

అనుమతులు అడవిపాలు.. కాల్వలు రోడ్డు పాలు..!

Published Fri, Sep 1 2017 1:32 AM

అనుమతులు అడవిపాలు.. కాల్వలు రోడ్డు పాలు..!

సాగునీటి ప్రాజెక్టుల కాల్వలకు అడవి, రోడ్లు, రైల్వే క్రాసింగ్‌ల చక్రబంధం
► ప్రధాన పనులపైనే అధికారుల దృష్టి
► అటవీ అనుమతుల్లేక రెండున్నర లక్షల ఎకరాలపై ప్రభావం
► రోడ్డు దాటలేక ఏడు లక్షల ఎకరాలకు చేరని నీరు
► రైల్వే క్రాసింగ్‌ల సమస్యతో 2.8 లక్షల ఎకరాలకు తిప్పలు
► ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేక ప్రాజెక్టుల జాప్యం
► పెరిగిపోతున్న ప్రాజెక్టుల వ్యయ అంచనాలు  


రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగునీటి ప్రాజెక్టులను చేపడుతున్నా.. ఆయకట్టుకు నీరందేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టుల ప్రధాన పనులు పూర్తిచేసినా కాల్వల నిర్మాణానికి అటవీ అనుమతులు, రోడ్లు, రైల్వే క్రాసింగ్‌లు ఇబ్బందిగా మారాయి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం, అనుమతుల జారీలో కేంద్రం చేస్తున్న జాప్యం ఈ సమస్యను మరింతగా పెంచుతున్నాయి. దీంతో  10 లక్షలకుపైగా ఎకరాల ఆయకట్టు ప్రభావితం అవుతుండడం గమనార్హం.       –సాక్షి, హైదరాబాద్‌

రైల్వే క్రాసింగ్‌లతో ఇబ్బందులు
11 ప్రాజెక్టులు
60  క్రాసింగ్‌లు
26 పూర్తయినవి
10 పురోగతిలో ఉన్నవి
24 చేపట్టాల్సినవి
ప్రభావితమయ్యే ఆయకట్టు: 2,83,966 ఎకరాలు

ఆయకట్టును పట్టాలు ఎక్కనివ్వని రైల్వే!
నిర్మాణ దశలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులకు రైల్వే క్రాసింగ్‌లు అడ్డంకిగా మారాయి. కొన్ని ప్రాజెక్టుల రిజర్వాయర్లు, డ్యామ్‌లు, కాల్వల పనులు ముగిసినప్పటికీ.. రైల్వే శాఖ పరిధిలో చేయాల్సిన పనుల్లో జాప్యంతో సుమారు 2.8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిందించలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా 11 ప్రాజెక్టుల పరిధిలో 60 చోట్ల రైల్వేకు సంబంధించిన అడ్డంకులున్నాయి.

అవి పూర్తయితేనే కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తవుతుంది. ఈ 60 పనుల్లో తెలంగాణ ఏర్పాటయ్యాక 26 పనులను రైల్వే శాఖ పూర్తిచేయగా.. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. 24 చోట్ల పనులను అసలు చేపట్టనే లేదు. ఇందులో దేవాదుల, ఎస్‌ఎల్‌బీసీ పరిధిలో 8 చొప్పున క్రాసింగ్‌లు, నెట్టెంపాడు పరిధిలో 16 చొప్పున క్రాసింగ్‌లు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు రైల్వే శాఖతో సంప్రదించింది. స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు కూడా చర్చించారు. అయినా రైల్వే శాఖ స్పందించడం లేదు.

అటవీ అనుమతుల జాడ్యం
సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకిగా మారిన వాటిలో అటవీ భూముల అంశమే ప్రధానమైనది. రాష్ట్రంలో 8 ప్రాజెక్టులకు అటవీ అనుమతులు సమస్యగా మారాయి. మిగతా ప్రాజెక్టులు, ఆయకట్టు కాల్వలకు కలిపి మొత్తంగా 15,672 ఎకరాలకు సంబంధించి అనుమతులు అవసరం. దేవాదుల, కల్వకుర్తి ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులు దాదాపు ఏడెనిమిదేళ్ల కిందే మొదలుపెట్టినా ఇంతవరకు అటవీ రాలేదు.

చాలా ప్రాజెక్టుల పరిధిలో డీజీపీఎస్‌ సర్వే పూర్తికాకపోవడం, అటవీ భూమికి సమానమైన భూమిని చూపక పోవడం, పూర్తిస్థాయి ప్రతిపాదనలు తయారుకాకపోవడం, పలుచోట్ల ప్రత్యామ్నాయంగా చూపిన భూమిని అంతకు ముం దే ఇతరులకు కేటాయించి ఉండడం వంటివి అటవీ అనుమతులకు సమస్యగా మారాయి. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగి అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోయాయి. కొమ్రుం భీం ప్రాజెక్టు పరిధిలో అటవీ అనుమతుల జాప్యంతో వ్యయం రూ. 274 కోట్ల నుంచి రూ.882 కోట్లకు పెరిగింది. రూ.9,427 కోట్లతో చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు వ్యయం రూ.13,445 కోట్లకు పెరిగింది. మొత్తంగా అటవీ భూముల అనుమతుల ప్రభావం రెండున్నర లక్షల ఎకరాలపై పడుతుండడం గమనార్హం.

రోడ్డు కూడా అడ్డే..
ఇక ఆర్‌ అండ్‌ బీ రోడ్లు, జాతీయ రహదారుల కారణంగా కాల్వల నిర్మాణానికి ఇబ్బందులూ తీవ్రంగానే ఉన్నాయి. ఆయకట్టు కాల్వలకు అడ్డంగా ఉన్న రహదారులను పునర్నిర్మించేందుకు అవసరమైన నిధులను నీటి పారుదల శాఖ చెల్లిస్తున్నా.. శాఖల మధ్య సమన్వయంలోపించి పనుల్లో జాప్యం జరుగుతోంది. ఆర్‌అండ్‌బీ రోడ్ల కారణంగా ఏకంగా 5.24 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడుతోంది. ఇందులో ఎస్‌ఎల్‌బీసీ పరిధిలో 9, డిండిలో 29, దేవాదుల పరిధిలో 113 క్రాసింగ్‌ సమస్యలుండగా.. వాటిల్లో 63 పరిష్కారమయ్యాయి. ఇంకా 50 చోట్ల ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఇక జాతీయ రహదారులకు సంబంధించి 8 ప్రాజెక్టుల పరిధిలో 37 క్రాసింగ్‌లు ఉండగా.. ఇంకా 31 పనులు పూర్తి చేయాల్సి ఉంది.

Advertisement
Advertisement