అమాత్యా.. మీపైనే ఆశ | Sakshi
Sakshi News home page

అమాత్యా.. మీపైనే ఆశ

Published Sun, Feb 22 2015 3:42 AM

responsible for hope ..

శాతవాహన యూనివర్సిటీ :శాతవాహన యూనివర్సిటీ బాలారిష్టాలు దాటడం లేదు. ఏర్పడి ఏడేళ్లయినా కోర్సు ల లేమి, బోధనా సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోం ది. బడ్జెట్ కేటాయింపులోనూ ఏటా నిరాశే ఎదురవుతోం ది. యూజీసీ, పీసీఐ గుర్తింపునకు కూడా నోచుకోవడం లేదు. యూనివర్సిటీలో 13 కోర్సులు, 12 మంది బోధన సిబ్బంది మాత్రమే ఉండగా అకడమిక్ కన్సల్టెంట్లతో కాలం వెళ్లదీస్తున్నారు. ఆదివారం యూనివర్సిటీలో పలు కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హాజరవుతున్న సందర్భంగా కథనం.
 శాతవాహన యూనివర్సిటీని జిల్లా కేంద్రంలో 2008లో ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ ఏర్పాటు చేశారన్న మాటే గానీ నిధులు, సిబ్బంది నియామకం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. వర్సిటీలో ప్రస్తుతం 13 కోర్సులుండగా రెగ్యులర్ బోధకులు 12 మందే ఉన్నారు.
 
 అంటే ఒక కోర్సుకు ఒక బోధకుడు సైతం లేరనే విషయాన్ని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. 46 మంది అకాడమిక్ కన్సల్టెంట్లతో కోర్సులు  సాగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 18 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా, అందులో కొన్నింటి భర్తీకి ఇంటర్వ్యూలు సైతం జరిగాయి. వాటి ఫలితాలు వెల్లడించకపోవడంతో అభ్యర్థులు ఏడాదిగా ఉద్యోగాలకోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. బోధనేతర సిబ్బంది 19 మంది మాత్రమే ఉన్నారు. 18 మందిని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకున్నారు. వీరంద రూ యూనివర్సిటీ ఏర్పడినప్పటినుంచి పనిచేస్తున్నవారు కావడంతో రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు.
 
 నేడు జరిగే కార్యక్రమాలివే...
 వర్సిటీలో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్, సెంట్రల్ లైబ్రరీ, క్యాంటీన్, సైన్స్ భవ నాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించనున్నారు. అనంతరం బిజినెస్ స్కూల్, ఆర్ట్స్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. నూతన లైబ్రరీ హాల్ వద్ద సభ నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
 
 వేధిస్తున్న కోర్సుల లేమి
 తమ పరిధిలో లేని కోర్సులకు అఫిలియేషన్ ఇచ్చి వాటిని సజావుగా పర్యవేక్షణ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. వర్సిటీ పరిధిలో 19 బీఈడీ కళాశాలలు, ఒక లా కళాశాల ఉంది. కానీ, యూనివర్సిటీలో మాత్రం దానికి సంబంధించిన విభాగాలే లేవు. దీంతో పర్యవేక్షణకు అవస్థలు పడుతున్నారు. గతంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఉన్నత విద్యాశాఖ అనుమతించినా దానికి సంబంధించిన నిధలు కేటాయించకపోవడంతో మూడేళ్లుగా ఈ ఫైలు మూలకు పడే ఉంది. బీఈడీ కళాశాల, మోడల్ స్కూల్ వర్సిటీ ఆధీనంలో ఉండాలన్న వీసీ వినతికి  ప్రభుత్వం నుంచి స్పందన లేదు. జర్నలిజం, ఇంజినీరింగ్, లా, బీఈడీ వంటి డిమాండ్ ఉన్న కోర్సులు నెలకొల్పేందుకు ప్రభుత్వ అనుమతి కావాలని వర్సిటీ అధికారులు కోరుతున్నారు.
 
 కోరింది రూ.60 కోట్లు...
 ఇచ్చింది రూ.12 కోట్లు
 వర్సిటీలో నూతన నిర్మాణాలు, ఇతరత్రా సౌకర్యాల కోసం నిధులు భారీగా అవసరముంది. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపులు సరిగా లేకపోవడంతో స్వరాష్ట్రంలోనైనా అధిక నిధులు వస్తాయని భావించారు. అధికారులు రూ.60 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తే బడ్జెట్లో రూ.12 కోట్లు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రూ.4.75 కోట్లు జీతభత్యాలు, ఇతర అవసరాలకు అందినట్లు అధికారిక సమాచారం. నిధుల కేటాయింపు పరిస్థితి ఇలాగే ఉంటే ఏళ్లు దాటినా వర్సిటీ సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితి ఉండదని, ఆర్థిక సహకారం అందించాలని ఇప్పటికే యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కడారు వీరారెడ్డి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు విన్నవించినట్లు సమాచారం.
 
 12బీ, పీసీఐ, యూజీసీ గుర్తింపు ఏది?
 వర్సిటీకి అవసరమైన 12 బీ(యూజీసీకి ముందు ఇచ్చే తాత్కాలిక గుర్తింపు), ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) గుర్తింపు ఇప్పటికీ రాలేదు. యూజీసీ గుర్తింపు వస్తే జాతీయస్థాయిలో నిధులు వచ్చే అవకాశముంటుంది. యూజీసీ గుర్తింపునకు కోర్సులు, భవనాలు, బోధనా సిబ్బంది ఉండాల్సి ఉంటుంది. ఒక్కో కోర్సుకు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ, వర్సిటీలో 13 కోర్సులకు రెగ్యులర్ సిబ్బంది 12 మందే ఉన్నారు.
 
 ఇలాంటి క్రమంలో వర్సిటీకి 12బీ, యూజీసీ గుర్తింపు ఎలా వస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. వర్సిటీలోని ఫార్మసీ కోర్సులో ఇప్పటివరకు రెండు బ్యాచ్‌లు పూర్తయినా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు మాత్రం లేదు. దీనికి ప్రధాన కారణం కోర్సు బోధకులందరూ అకడమిక్ కన్సల్టెంట్లు కావడమే. ప్రభుత్వం వెంటనే స్పందించి రెగ్యులర్ సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వర్సిటీకి అన్ని గుర్తింపులు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
 

Advertisement
Advertisement