వడగళ్ల వానతో.. రైతుకు కడగండ్లు | Sakshi
Sakshi News home page

వడగళ్ల వానతో.. రైతుకు కడగండ్లు

Published Mon, Apr 9 2018 9:53 AM

Rice Crops And Mango Farmers Loss With Rain - Sakshi

కేశంపేట: ఆదివారం తెల్లవారు జామున ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కురిసిన వర్షం రైతులకు కన్నీటిని మిగిల్చింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చె సమయానికి వడగళ్ల వర్షం రూపంలో రైతుకు కడగండ్లను మిగిల్చింది. ఆదివారం మండలంలో 28.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలో కురిసిన వడగండ్ల వర్షానికి వరి పూర్తిగా నీట మునిగింది. బోర్లలో నీరు ఇంకిపోవడంతో ట్యాంకర్ల ద్వారా వరి పంటను బతికించుకున్నామని, అకాల వర్షం పంటంతా తడిసిముద్దవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వాన రూపంలో పంటలు పడవడంతో పాపిరెడ్డిగూడ గ్రామంలో రైతు అబ్బి రవి కన్నీరు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఈదురు గాలులకు మామిడికాయలు నేలరాలాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 

కందుకూరులో భారీ వర్షం
కందుకూరు: మండల పరిధిలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. 24.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా వర్షంతో పాటు ఈదురు గాలులతో లేమూరు, సరస్వతిగూడ, గూడూరు, అగర్‌మియాగూడ తదితర గ్రామాల పరిధిలోని తోటల్లో మామిడికాయలు నేలరాలి రైతులు నష్టపోయారు. ఈ ఏడాది అతి తక్కువగా కాత ఉండడం ప్రస్తుతం ఈదుర గాలులకు కాయలు నేల రాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా పులిమామిడి పరిసర ప్రాంతాల్లో తెల్లవారు జామున స్వల్పంగా వడగళ్లు కురిశాయి.

చేసిన అప్పులు తీరేదెలా..
తలకొండపల్లి(కల్వకుర్తి): అకాలవర్షంతో రైతులు తలలు పట్టుకున్నారు. మండలవ్యాప్తంగా సుమారుగా 500 ఎకారాలకు పైగా వరిపంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తలకొండపల్లి, పడకల్, మెదక్‌పల్లి, వెల్‌జాల్, చంద్రధన, చుక్కాపూర్, తాళ్లగుట్టతండా, తదితర గ్రామాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో కల్లు రాజేశ్వర్‌రెడ్డి 6 ఎకరాల్లో, జబ్బార్, సేవ్య, తార్యా, హూమ్లా, శక్రు, పుల్యా, రాములు, చందు, బాటా, తదితర రైతులకు సంబందించి సుమారుగా 300 ఎకరాలకు పైగా వరి పంట దెబ్బతిందని రైతులు బావురుమంటున్నారు. వడగండ్లవానకు కళ్ల ముందే పంట నాశనమైందని, దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంట వివరాలు సేకరించి ప్రభుత్వపరంగా నష్ట పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Advertisement
Advertisement