దేశం గర్వించదగ్గ నటుడు ఎన్టీఆర్‌ | Sakshi
Sakshi News home page

దేశం గర్వించదగ్గ నటుడు ఎన్టీఆర్‌

Published Tue, May 29 2018 1:05 AM

Rich tributes paid to NT Rama Rao on his birth anniversary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నందమూరి తారక రామారావు దేశం గర్వించదగ్గ నటుడని తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అన్నారు. ఎన్టీఆర్‌ గొప్ప గొప్ప పాత్రల్లో నటించి, జీవించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. సోమవారం ఇక్కడి రవీంద్రభారతిలో ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ రవ్వా శ్రీహరికి ఎన్టీఆర్‌ జాతీయ సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

రోశయ్య మాట్లాడుతూ అంతమంచి నటనాకౌశలం ఉన్న నటుడిని ఇక చూడబోమన్నారు. సినీ వినీలాకాశంలో అంతటి గొప్ప వ్యక్తి పేరుతో ఇచ్చే పురస్కారాన్ని భాషాసాహిత్యంలో శిఖరసమానుడు, మహామహోపాధ్యాయడు ఆచార్య రవ్వా శ్రీహరికి ఇవ్వటం సముచితంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ధోరణి, తన ధోరణి వేర్వేరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు వస్తే ఎన్టీఆర్‌ గురించి గొప్పగా చెప్పేవాడినన్నారు.

విశిష్ట అతిథి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు మాట్లాడుతూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్య ప్రభావాలు చాలా విశిష్టమైనవని, వాటిని మనం గుర్తించలేకపోతున్నామని అన్నారు. వ్యక్తిత్వంలో ఎన్టీఆర్‌ భగవంతుడి స్వరూపమన్నారు. గౌరవ అతిథి, ప్రముఖ నటి డాక్టర్‌ జమున మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను మించిన నటుడు మరొకరు లేరని, ఆయనతో కలసి నటించటం తన అదృష్టమని అన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ఎంతోమందికి రాజకీయ జీవితాలు కల్పించిన మహావ్యక్తి అని కొనియాడారు.

ట్రస్టు చైర్‌పర్సన్‌ ఎన్‌.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు తాను భార్య కావటం ఎన్నో జన్మల అదృష్టమన్నారు. శ్రీహరి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ సాహితీ పురస్కారాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని, ఇది తనకు ప్రత్యేకమైనదని అన్నారు. కార్యక్రమంలో ఏపీ సమాచార హక్కు చట్టం పూర్వ కమీషనర్‌ పి.విజయబాబు, అవార్డు కమిటీ సభ్యులు డాక్టర్‌ అనుమాండ్ల భూమయ్య, డాక్టర్‌ ముక్తేవి భారతి, డాక్టర్‌ సూర్య ధనంజయ్, వైకే నాగేశ్వరరావు, నటి దివ్యవాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement