రహదారి రక్తసిక్తం | Sakshi
Sakshi News home page

రహదారి రక్తసిక్తం

Published Sun, Jun 22 2014 3:14 AM

రహదారి రక్తసిక్తం - Sakshi

తిరుమలాయపాలెం: వరంగల్ రాష్ట్రీయ రహదారి రక్తమోడింది. ఆటోలో బయలుదేరిన వారు కొద్ది క్షణాల్లో గమ్యస్థానాలకు చేరుతారనుకునేలోపే నలుగురు వ్యక్తులను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. మండలంలోని మాదిరిపురం- సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్ద శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.
 
 పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని మేడిదపల్లి గ్రామానికి చెందిన మిడతపల్లి వెంకన్న(35) అనే ఆటోడ్రైవర్ తన ఆటోని బచ్చోడు నుంచి వరంగల్ జిల్లా మరిపెడకు నడుపుతున్నాడు. శనివారం బచ్చోడు నుంచి పలు గ్రామాల ప్రయాణికులను ఎక్కించుకుని మరిపెడకు బయలు దేరాడు. మధ్యాహ్నం సమయంలో సుబ్లేడు క్రాస్‌రోడ్డు నుంచి మరిపెడ వైపుకు వెళ్తున్న ఆటోని ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. కొద్దిదూరం వరకు ఆటోను ఈడ్చుకెళ్లింది. అక్కడే ఉన్న దిమ్మెను ఢీకొని ఆ వ్యాన్ పల్టీ కొట్టింది. ఆటోను వ్యాన్ ఢీకొట్టడంతో మేడిదపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ మిడతపల్లి వెంకన్నతో పాటు ఆటో ముందు భాగంలో కూర్చున్న మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బచ్చోడుతండాకు చెందిన గుగులోత్ సత్యం(38), నల్లగొండ జిల్లా మోతె మండలం నేరడవాయి పరిధిలోని గోపతండాకు చెందిన జర్పుల సరోజ ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందారు.
 
హస్నాబాద్ గ్రామానికి చెందిన ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ మాగి వీరస్వామి,అతని భార్య తిరపమ్మ, తవడబోయిన మంగమ్మ, పల్లి కల్పనలతో పాటు డీసీఎం వ్యాన్‌లో ప్రయాణిస్తున్న తొర్రూరు అచ్చుతండాకు చెందిన గుగులోత్ అచ్చమ్మలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న కిరాణషాపు నిర్వహిస్తున్న బోడపట్ల సత్యం మీదకు డీ సీఎం వ్యాన్ దూసుకుపోవడంతో అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఫీల్డ్ అసిస్టెంట్ మాగి వీరస్వామి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద స్థలి వద్ద మృతిచెందిన మరోవ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదు. విషయం తెలిసి ఖమ్మం డీఎస్పీబాలకిషన్‌రావు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆయనతో పాటు తహశీల్దార్ శివదాసు, ఎస్సై ఓంకార్‌యాదవ్ కూడా ఉన్నారు.
 
మిన్నంటిన రోదనలు...
సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్ద తమవారు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి క్షతగాత్రుల బంధువులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాం తంలో రోదనలు మిన్నంటాయి. ఆటో డ్రైవర్ వెంకన్న భార్య, ఇతర బంధువులు రోదిస్తున్న తీరు హృదయాలను కలచి వేసింది. అందరితో కలివిడిగా ఉండే వెంకన్న అకాల మరణంతో మేడిదపల్లి గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. బచ్చోడు తండాకు చెందిన గుగులోత్ సత్యం వ్యవసాయంతో పాటు కిరాణం వ్యాపారం చేస్తుంటాడు.
 
సరుకుల కోసం మరిపెడ వెళ్తూ ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యం మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. నేరడవాయి గోపతండాకు చెందిన జర్పుల పద్మ హస్నాబాద్ జెండాలతండాలో బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదంలో మరణించింది. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. డీసీఎం వ్యాన్‌లో ఉన్న డ్రమ్ములు చెల్లాచెదరుగా పడ్డాయి.
 
శోకసంద్రంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి

ఖమ్మంసిటీ: తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు క్రాస్‌రోడ్డు- మాదిరిపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల ఆర్తనాదాలు, వారి బంధువుల రోదనలతో జిల్లా ఆస్పత్రి దద్దరిల్లింది. ఆటోను డీసీఎం ఢీకొట్టడంతో సంఘటన స్థలంలో ఇద్దరు మృతిచెందగా, మిగతా వారిని ఖమ్మంలోని జిల్లా ఆస్పత్రి, ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు 108 అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. వీరిలో బచ్చోడు తండాకు చెందిన జి.సత్యం (45), చింతకాని మండలం నేరెడకు చెందిన బోడ సరోజి (50) ఆస్పత్రిలో చేర్పించిన కొద్ది నిమిషాల్లోపే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన తిరుపతమ్మ, కాళి పరిస్థితి విషమంగా ఉంది. బి.సత్యం, మంగమ్మ, రమలు తీవ్ర గాయాలపాలయ్యారు.
 
కల్పన, మాగి వీరస్వామి తదితరులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన వారి బంధువులు పెద్ద పెట్టున ఆస్పత్రికి చేరుకుని తమ వారిని చూసి రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. క్యాజువాలిటీ మొత్తం గాయపడ్డ వారితో రక్తసిక్తంగా మారింది. సమయానికి ఆస్పత్రి సిబ్బంది కొంతమంది అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రుల బంధువులు, 108 సిబ్బంది చేతులపైనే వారిని ఆస్పత్రిలోకి మోసుకు వచ్చారు. మృతులు, క్షతగాత్రుల బంధువులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు విజయ్, అభిరామ్ తదితర సిబ్బంది వారికి వైద్యసేవలు చేశారు. 108 సిబ్బంది రమణ, ప్రసాద్, కృష్ణయ్య సహాయం అందించారు.

Advertisement
Advertisement