‘రైతుబంధు’ మాయం.!  | Sakshi
Sakshi News home page

‘రైతుబంధు’ మాయం.! 

Published Sun, Jun 24 2018 9:09 AM

Rythu Bandhu Scheme Cheques Gone In Bhadradri - Sakshi

అశ్వారావుపేటరూరల్‌ : అశ్వారావుపేటలో సుమారు 228 ఎకరాలకు సంబంధించిన 14 రైతుబంధు చెక్కులు మాయమయ్యాయి. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా.. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ వద్ద ఉన్నాయని రెవెన్యూ అధికారులు పేర్కొంటూ తప్పించుకుంటున్నారు. పెట్టుబడి సాయం కోసం రైతులు నెల రోజుల నుంచి తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.  

పాస్‌ పుస్తకాలిచ్చారు కానీ.. 
అశ్వారావుపేట రెవెన్యూలోని ఊట్లపల్లి సమీపంలో శీమకుర్తి సాయిబాబా అనే రైతుకు ఖాతా నంబరు 154లో.. సర్వే నంబరు 302/ఆ/1లో 2.03 ఎకరాలు, 303/ఆ సర్వే నంబర్‌లో 6.10 ఎకరాలు, 304అ/1 నంబర్‌లో 3–39 ఎకరాలు, 306 సర్వే నంబర్‌లో 2–16 ఎకరాలు, 307/ఆ నంబర్‌లో 1–12, 339/1 సర్వే నంబర్‌లో 2–39 ఎకరాలతోపాటు మరికొన్ని నంబర్లలో మొత్తం సుమారు 28 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూములకు సంబంధించిన రైతుబంధు చెక్కులు అందలేదు. శీమకుర్తి చక్రధరరావు, శీమకుర్తి రామలింగం, శీమకుర్తి కైలాస్‌నా«థ్, జల్లిపల్లి నారాయణరావు, జల్లిపల్లి లక్ష్మి, కొనకళ్ల నాగేశ్వరరావులకు చెందిన సుమారు 200వందల ఎకరాలకు సంబంధించి సుమారు రూ.7లక్షల పెట్టుబడి సాయం చెక్కులు గల్లంతయ్యాయి.

వీళ్లందరికీ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పాస్‌ పుస్తకాలు, పెట్టుబడి సాయం కింద చెక్కులు మంజూరు కాగా వీటిని ఆయా రైతులు తీసుకునేందుకు గత నెల 10న అశ్వారావుపేటలో జరిగిన పంపిణీ కార్యక్రమానికి వెళ్లారు. ఆ సమయంలో పాస్‌ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కులు మంజూరైనట్లు అధికారులు రైతులకు చూపించి, పాస్‌ పుస్తకాల్లో పొలాలకు సంబంధించిన చిన్న పొరపాటు ఉందని చెప్పి పంపిణీ చేయకుండా నిలిపి వేశారు. దీంతో రైతులు తమ వద్ద ఉన్న పాత రికార్డులు, ఆధారాలతో స్థానిక రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా అందించారు.

విచారణ చేసిన రెవెన్యూ అధికారులు ఎలాంటి పొరపాట్లు లేవని ధ్రువీకరిస్తూ పత్రాన్ని ఇచ్చారు. ఆ పత్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు సమర్పించగా కేవలం పాస్‌ పుస్తకాలు పంపిణీ చేసి, పెట్టుబడి సాయం చెక్కులు మాత్రం ఇవ్వలేదు. అప్పటి నుంచి రైతులు అటు రెవెన్యూ, ఇటు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ చెక్కులు మాయమయ్యాయని, అందుకే ఇరు శాఖల అధికారులు తేల్చిచెప్పడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రైతుబంధు సాయాన్ని స్వాహా చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.  

నెల రోజులుగా తిరుగుతున్నా 
నాకు పెట్టుబడి సాయం కింద చెక్కులు మంజూరయ్యాయి. వాటి కోసం గడిచిన నెల రోజులుగా కార్యాలయాల చూట్టు తిరుగుతున్నాను. వ్యవసాయ కార్యాలయానికి వెళ్తే, తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లమని, ఇక్కడికి వెళ్లితే అక్కడికే వెళ్లమని తిప్పుతున్నారు. గట్టిగా నిలదీస్తే చెక్కులు గల్లంతైనట్లు చెప్పారు. వికలాంగుడైన నేను 70 ఏళ్ల వయసులో ఇంకా ఎన్ని రోజులు తిరగాలి.         –శీమకుర్తి సాయిబాబా, బాధిత రైతు, అశ్వారావుపేట 


చెక్కులు కనిపించడం లేదు 
కొందరు రైతులకు మంజూరైన పెట్టుబడి సాయం చెక్కులు కనిపించని మాట వాస్తవమే. తొలిరోజు పంపిణీ కార్యక్రమంలో ఈ చెక్కులు గల్లంతైనట్లు గుర్తించాం. ఉన్నతాధికారులకు లేఖ రాసి, ఆయా రైతులకు తిరిగి చెక్కులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలించి చెక్కుల గల్లంతుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.                                 
– నవీన్, ఏవో, అశ్వారావుపేట

మాకు సంబంధమే లేదు 
పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ బాధ్యత వ్యవసాయ శాఖదే. కనిపించకుండా పో యిన చెక్కులకు, రెవెన్యూ శా ఖకు సంబంధం లేదు. వ్యవసాయ శాఖ నుంచి కూడా ఎ లాంటి నివేదికా రాలేదు. చెక్కులు మాయమైన విషయం శనివారమే నా దృష్టికి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధ్యుడైన వ్యవసాయాధికారికి  సూచించాను.             –యలవర్తి వెంకటేశ్వరరావు, తహసీల్దార్, అశ్వారావుపేట 

Advertisement
Advertisement