ఆడపడుచులకు పెద్దన్న కేసీఆర్‌

24 Sep, 2019 08:36 IST|Sakshi

బతుకమ్మ కానుకలతో గౌరవిస్తున్నారు  

రాష్ట్రవ్యాప్తంగా 1.03 కోట్ల చీరల పంపిణీ  

విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి

సాక్షి, మహేశ్వరం: తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్‌ పెద్దన్నగామారి దసరా పండుగకు బతుకమ్మ చీరలను కానుకగా ఇచ్చి గౌరవిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం పోతర్ల బాబయ్య ఫంక్షన్‌హాల్‌లో ఆమె జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌తో కలిసి ప్రభుత్వం అందజేసిన చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ మహిళల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేశారు. దసరా పండుగను ఆనందంగా జరుపుకోవడానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచు కు బతుకమ్మ చీరలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు తీరోక్క పూలతో మహిళలు బతుకమ్మను పేర్చి ఆడిపాడుతారని తెలియజేశారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కోటి 3 లక్షల బతుకమ్మ చీరలను పంపిణీ చేయనుందన్నారు. జిల్లాలో 6,65, 686 చీరలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో చేనేత కార్మికులకు అన్నివిధాలుగా ప్రోత్సహించి, వారికి ఉపాధి ఆవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరలను తయారు చేయించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో జరుగుతున్న 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై అభివృద్ధికి సహకరించాలని కోరారు.

మహిళా సంక్షేమం కోసం కృషి   
సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ మహిళా సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు మహిళల అభివృద్ధి కోసం చొరవ చూపలేదని విమర్శించారు. మహిళలందరికీ దసరా కానుకగా చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.

100 రకాలు, పది రంగుల చీరలు   
18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని ఇన్‌ చార్జి కలెక్టర్‌ హరిష్‌ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని తెలిపారు. తెలంగాణలో మహిళలు వైభవంగా నిర్వహించే పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ప్రభుత్వం 100 రకాలు, 10 రంగుల్లో బతుకమ్మ చీరలను అందజేస్తున్నట్లు వివరించారు. రేషన్‌ కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేస్తామన్నారు. అంతకు ముందు అతిథలు జ్యోతి ప్రజ్వళన చేసి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలతో కలిసి జెడ్పీ చైర్‌పర్సన్‌  తీగల అనితారెడ్డి బతుకమ్మ ఆడిపాడారు.

అనంతరం మహేశ్వరం మండల కేంద్రంలో హరితహారంలో భాగంగా మంత్రి, జెడ్పీ చైర్‌పర్సన్‌  తదితరులు మొక్కను నాటారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ ప్రశాంత్‌కుమార్, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ ఎంపీపీ సునితానాయక్, తహసీల్దార్‌ సుజాత, ఎంపీడీఓ నర్సింహ, పీఏసీఎస్‌ చైర్మన్‌  అంబయ్య యాదవ్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు కూన యాదయ్య, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, మహిళా సమాఖ్య ఏపీఎం సత్యనారాయణ, మహేశ్వరం సర్పంచ్‌ ప్రియంక ఉన్నారు. బాగా చదువుకుంటున్నారా..?

మహేశ్వరం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని నాగుల్‌దోని తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ప్రభుత్వ బడుల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అంతకు ముందు ఆమె టీచర్‌ అవతారమెత్తారు. విద్యార్థులకు గణితం బోధించారు. వారితో ఎక్కాలు చెప్పించారు. బాగా చదువుకుంటున్నారా.. అని అడిగి తెలుసుకున్నారు. పాఠ్యంశాల్లోని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. విద్యాశాఖ మంత్రి అయిన సబితారెడ్డి టీచర్‌ అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు బోధించి అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని సర్పంచ్‌కి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ ఎంపీపీ సునీతానాయక్, ఎంపీడీఓ నర్సింహ, ఎంఈఓ కృష్ణ, సర్పంచ్‌ మెగావత్‌ రాజు నాయక్, ఉప సర్పంచ్‌ జగన్‌  ఉన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా