సర్కార్ బడికి తాళం! | Sakshi
Sakshi News home page

సర్కార్ బడికి తాళం!

Published Thu, Dec 4 2014 12:11 AM

సర్కార్ బడికి తాళం! - Sakshi

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యాభివృద్ధికి పాటుపడాల్సిన ఆ శాఖ అధికారులు నిరుపేద చిన్నారులను బడికి దూరం చేస్తున్నారు. ఉన్న ఒక్క టీచర్‌ను.. వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరుతో వేరే మండలానికి పంపించి పాఠశాల మూతపడేలా చేశారని రాయికోడ్ మండల పరిధిలోని అల్లాపూర్‌వాసులు మండిపడ్డారు. ఇలాగైతే  తమ పిల్లల బతుకులు ఏం కావాలని ప్రశ్నించారు.
 

- ‘వర్క్ అడ్జస్ట్‌మెంట్’తో మూతపడిన పాఠశాల
- ఉన్న ఒక్క టీచర్‌ని వేరే చోటకు పంపిన వైనం
- ఆందోళనలో అల్లాపూర్‌వాసులు

రాయికోడ్: ఉపాధ్యాయులు లేక, విద్యార్థుల సంఖ్యతగ్గిబోసిపోతున్న సర్కారీ బడులను బలోపేతం చేయాల్సిన విద్యాశాఖ అధికారులు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరుతో ఇష్టానుసారంగా టీచర్లను ఇతర మండలాలకు పంపిస్తూ పేద విద్యార్థులను చదువు నుంచి దూరం చేస్తున్నారు. మండలంలోని అల్లాపూర్ ప్రాథమిక పాఠశాలే దీనికి నిదర్శనం. దీనిలో 1 నుంచి 5వ తరగతి వరకు 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే టీచర్ ఉండటంతో.. గ్రామానికి చెందిన 40 మంది పిల్లలు ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన 25 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు.

ఈ క్రమంలో స్కూల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయురాలు సంతోషను వర్క్ అడ్జస్ట్‌మెంట్‌పై పటాన్‌చెరు మండలం కిష్టారెడ్డిపేటకు పంపించారు. వంట మనిషి నాగమ్మ బుధవారం మధ్యాహ్న భోజనం వడ్డించిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు పాఠశాలకు తాళం వేశారు. ఉన్న ఒక్క టీచర్‌ను కూడా ఇతర పాఠశాలకు పంపించడంపై తల్లిదండ్రులు, స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నవాళ్లు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాల్లో చదివిస్తున్నారని.. కూలీనాలి చేసుకుని బతికే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. డీఈఓ కార్యాలయం నుంచి గత నెల 28న తమకు అందిన ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయురాలిని వర్క్ అడ్జస్ట్‌మెంట్‌పై పంపించామని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు.

పాఠశాల మూతపడటం, వర్క్‌అడ్జస్ట్‌మెంట్ అంటే అర్థమేంటని..?  జోగిపేట డిప్యూటీ  ఈఓ పోమ్యానాయక్‌ను అడగగా.. టీచర్‌ను ఇతర మండలానికి పంపించినట్లు తనకు సమాచారం లేదని జవాబు దాటవేశారు. రాష్ట్ర స్థాయి నాయకులు, అధికారుల నుంచి వచ్చిన వత్తిడి మేరకే పాఠశాల మూత పడుతోందని తెలిసినా అధికారులు నోరు మెదపడం లేదని తెలిసింది. ఈ ఏడాది జూలై లోను మండల పరిధిలోని కర్చల్ పాఠశాల ఉపాధ్యాయరాలు స్వప్నను కూడా ఇదే రీతిలో లింగారెడ్డిపల్లి  పాఠశాలకు పంపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు తమ పాఠశాలలో సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement