Sakshi News home page

నా చావుకు ఎవరూ కారణం కాదు

Published Sun, Jan 10 2016 2:56 AM

నా చావుకు ఎవరూ కారణం కాదు - Sakshi

♦ సీఎం గారూ... నా తమ్ముడిని ఏసీబీ కేసు నుంచి తప్పించండి
♦ ఎస్‌ఐ జగన్ సూసైడ్ నోట్..    
♦ మీడియాకు అందజేసిన పోలీసులు
♦ వ్యక్తిగత కారణాలతోనే ఎస్‌ఐ ఆత్మహత్య: డీఐజీ మల్లారెడ్డి
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి నుంచి జమ్మికుంటకు బదిలీ అరుున ఎస్‌ఐ జగన్‌మోహన్ తాను ఆత్మహత్య చేసుకునే ముందు సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రాసిన లేఖను కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పోలీసులు శనివారం సాయంత్రం మీడియాకు అందజేశారు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఆయన అందులో పేర్కొన్నారు. ఎస్పీ, పెద్దపల్లి డీఎస్పీ, సీఐ మంచివారని తెలిపారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బాధపడొద్దని పేర్కొన్నారు. తన సోదరుడిని ఏసీబీ కేసు నుంచి తప్పించాలన్నదే తన ఆఖరి కోరికంటూ సీఎం కేసీఆర్‌కు కోరారు. 2 పేజీల సూసైడ్ నోట్‌లో తన చావుకు ఎవరూ కారణం కాదని చెప్పిన జగన్‌మోహన్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేలు పేర్కొనకపోవడం గమనార్హం.  

 లేఖ సారాంశమిదే...
 గౌరవ ముఖ్యమంత్రిగారూ... నా తమ్ముడు కిరణ్‌కుమార్ గుడిహత్నూర్ ఎస్‌ఐగా పనిచేస్తూ ఏసీబీకి చిక్కారు. అట్టి ఫైలు చూసి వాడిని ఏసీబీ కేసు నుంచి తప్పించమని కోరుతున్నాను. ఇది నా చివరి కోరిక, మీరు సీఎం అయ్యాక పోలీసు డిపార్టుమెంటుకు ఎన్నో సదుపాయాలు కల్పించారు. పెద్దపల్లి డీఎస్పీ, సీఐ మహేష్, సీఐ శ్రీనివాసరావు చాలా మంచివారు. మీరు చల్లగా ఉండాలి. ఎమ్మెల్సీ(టి. భానుప్రసాద్‌రావు), ఎల్.రాజయ్య(నగర పంచాయతీ చైర్మన్)ల ఫ్లెక్సీ 31న తొలగించాం. ఇందులో ఎమ్మెల్యే నాకేమీ చెప్పలేదు. రమణారావు, రవికిషోర్ నన్ను చాలా అభిమానించారు.

సిటీ కేబుల్ గొడవలో ఎల్‌సీవోలకు నష్టం జరగకూడదని చేశానే తప్ప రామ్మూర్తి, మహేందర్‌సింగ్‌లను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదు. సదానందంకు ఏమీ సాయం చేయలేదు. అయినా ఇది నా లెవెల్లో అయ్యేది కాదు. నన్ను తప్పుగా అనుకున్నారు. పెద్దపల్లిలో ఉద్యోగరీత్యా ఎవరినైనా ఏమైనా అంటే  క్షమించండి. ఎస్పీ గారూ... మీరు మంచివారు. నా హయాంలో ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నారని బాధపడతారని నాకు తెలుసు. కానీ బాధపడొద్దు.  ఎమ్మెల్యేగారూ మీరు బాధపడవద్దు. జ్యోతీ!..(మృతుడి భార్య)... నన్ను క్షమించు. నీకేమీ చేయలేకపోయాను. నీవు నాకు బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్నావు.

నేను చనిపోయాక శరీరానికి పోస్టుమార్టం చేయొద్దు. డాక్టర్ వాసుదేవరెడ్డి సార్.. ఇక్కడికే వచ్చి చేయండి. కానీ కోయకండి. ఆనంద్, రమేష్, మోహన్, సంపత్, గౌస్(కానిస్టేబుళ్లు)కు థాంక్స్. అమ్మ, చెల్లి, కిరణ్,  హరి అన్నయ్య.. నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు. కిరణ్(సోదరుడు).. అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఇంట్లో నా ఫొటో పెట్టకండి. అనుక్షణం బాధపడకండి. 3 నెలల్లో నా సంవత్సరీకం చేసి పెళ్లి చేసుకో. నా పేరు మీద డబ్బొస్తే ఇంటి లోన్ కట్టెయ్. ధర్మపురి స్టేషన్‌లో నా కస్టడీలో ఒక మనిషి చనిపోయినప్పుడే నేను చనిపోవాలనుకున్నా. ’’

 వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య: డీఐజీ
 ఎస్సై జగన్‌మోహన్ వ్యక్తిగత కారణాలవల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని డీఐజీ మల్లారెడ్డి తెలిపారు. ఎస్‌ఐ రాసుకున్న సూసైడ్ నోట్‌పై ఎలాంటి అనుమానాలకూ తావులేదన్నారు. ఎస్‌ఐ బదిలీ వెనుక ఎవరి ఒత్తిడీ లేదన్నారు. గడువు ముగియక ముందే బదిలీ చేయడాన్ని ప్రస్తావించగా ‘సాధారణ బదిలీల్లో భాగంగానే బదిలీ చేశాం’ అన్నారు.

 ముగిసిన అంత్యక్రియలు
 శనివారం సాయంత్రం ఎస్‌ఐ జగన్‌మోహన్ అంత్యక్రియలు ముగిశాయి. ఎస్సై జగన్‌మోహన్ బందువులు, సహచరులు, పెద్ద ఎత్తున కరీంనగర్‌లోని జగన్‌మోహన్ నివాసానికి తరలివచ్చారు. తల్లి శాంతమ్మ కుమారుడి చితికి నిప్పంటించారు. ఈ సందర్బంగా పోలీసులు గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు.
 
 ఇదేనా మీ బహుమానం:ఎస్పీని ప్రశ్నించిన ఎస్సై సోదరి
 ‘ఎలాంటి పండుగలకు పబ్బాలకు రాకుం డా సిన్సియర్‌గా డ్యూటీ చేసినందుకు మంచి బహుమానం ఇచ్చారు’.. అంటూ జగన్‌మోహన్ చెల్లెలు జిల్లా శ్రీదేవీ ఎస్పీ జోయల్‌డెవిస్‌ను ప్రశ్నించారు. జగన్‌మోహన్‌కు నివాళులు అర్పించేందు కు వచ్చిన ఎస్పీని చూడగానే ‘‘మా ఇంట్లో ఫంక్షన్‌కు రమ్మంటే ‘కొత్త ఎస్పీగారొచ్చారు. బాగా పని చేయాలని సెలవు కూడా పెట్టలేదు. అట్లా చేసినందుకు మీరిచ్చే బహుమానం ఇదేనా’’అంటూ కంటతడి పెట్టారు.

Advertisement

What’s your opinion

Advertisement