చేనేత, మరనేతకు తేడా తెలియదు | Sakshi
Sakshi News home page

చేనేత, మరనేతకు తేడా తెలియదు

Published Sat, Nov 25 2017 2:19 AM

Sircilla Mega Textile Mela was started - Sakshi - Sakshi

సిరిసిల్ల: చేనేత, మరనేతకు తేడా తెలియకుండానే గత పాలకులు పాలన సాగించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మెగా టెక్స్‌టైల్‌ మేళాను శుక్రవారం ఆయన ప్రారంభించారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ వస్త్రోత్పత్తి రంగంలో సాంకేతికతను పెంచుకోవాలని, మార్పులతోనే మనుగడ సాధ్యమవుతుందన్నారు. సెల్‌ఫోన్‌తో పవర్‌లూమ్స్‌ను ఆపరేట్‌ చేసుకునే స్థితికి చేరుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నేతకార్మికుల సంక్షేమం కోసం రూ.1,280 కోట్ల బడ్జెట్‌ కేటాయించామని ఆ మేరకు ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో 15 వేల మగ్గాలను ఆధునీకరిస్తామని, ఇందుకోసం రూ.30 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఆసాములపై ఆర్థిక భారం పడకుండా వందశాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరించి ఆధునీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. 

ఆధునీకరించుకుంటేనే ప్రభుత్వ ఆర్డర్లు 
మరమగ్గాలను ఆధునీకరించుకుంటేనే నాణ్యమైన వస్త్రోత్పత్తి సాధ్యమవుతుందని, కార్మికులకు పనిభారం తగ్గుతుందని కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో మగ్గాలను ఆధునీకరించుకున్నవారికే వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. అప్పుల ఊబిలో ఉన్న 4,500 మంది నేతకార్మికుల రుణాలను మాఫీ చేశామని, ఇందు కోసం రూ.15.65 కోట్లు వెచ్చించామని వివరించారు.  

కార్మికులను ఆసాములుగా మార్చుతాం 
సిరిసిల్ల నేతకార్మికులను ఆసాములుగా మార్చేందుకు గ్రూప్‌ వర్క్‌షెడ్లను నిర్మిస్తామన్నారు. తొలిదశలో 1,100 మందికి రూ.203 కోట్లతో ఒక్కొక్కరికి 4 సాంచాలు ఇస్తామన్నారు. ఆసాములను యజమానుల స్థాయికి, యజమానులను ఇంకా కొత్త రంగాల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. సిరిసిల్లలో పది నూలు డిపోలు ఏర్పాటు చేస్తామని, రెండు కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సిరిసిల్లలో మహిళల ఉపా«ధికి అపెరల్‌ పార్క్‌లో అవకాశం ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఏడాదిలోగా పెద్దూరు వద్ద అపెరల్‌ పార్క్‌ నిర్మిస్తామన్నారు. నేతకార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు త్రెఫ్ట్‌ పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. వస్త్రోత్పత్తిలో నాణ్యత పెంచి, మార్కెటింగ్‌ వసతి కల్పించి సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగాన్ని ఆధునీకరిస్తామన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యర్, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

అన్ని గురుకులాల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లు.. 
రాష్ట్రంలోని 800 గురుకులాల్లోనూ కంప్యూటర్‌ శిక్షణ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామ కేటీఆర్‌ వెల్లడించారు. సిరిసిల్ల మండలం చిన్నబోనాల బాలికల గురుకుల విద్యాలయంలో శుక్రవారం కంప్యూటర్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. డిగ్రీ కాలేజీల్లోనూ రెసిడెన్షియల్‌ విద్య అమలు విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ గురుకుల విద్యాలయాలపై ఎంతో సంతృప్తిగా ఉన్నారని గతేడాది 84 మందికి ఎంబీబీఎస్‌లో సీట్లు వచ్చాయని కేటీఆర్‌ అన్నారు. 5 వేల పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ప్రారంభించామన్నారు. హాస్టల్‌లో ఇబ్బందులు తనకు తెలుసునని, తాను కూడా తొమ్మిదేళ్లు హాస్టల్‌లో ఉండి చదువుకున్నానని తెలిపారు. కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల సెక్రటరీ డాక్టర్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement