Sakshi News home page

క్షమించేది లేదు

Published Thu, Sep 10 2015 11:39 PM

క్షమించేది లేదు - Sakshi

జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ గురువారం మున్సిపల్ కార్యాలయం సిబ్బంది మొద్దు నిద్దర పోగొట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది... దుమ్ముకొట్టుకుని అపరిశుభ్రంగా మారిన రోడ్ల తీరుపై ఆగ్రహించారు. ఉదయం ఆరు గంటలకు మున్సిపాలిటీలో ప్రత్యక్షమైన ఆయన... అసిస్టెంట్ ఇంజనీరుతో పాటు మరో ముగ్గురు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేశారు. వారంలో కార్యాలయాన్ని సమూలంగా మారుస్తానని... ఉద్యోగుల్లో ఆవహించిన నిర్లక్ష్యాన్ని వదలగొడతానని చెప్పారు.
- మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ  
- విధుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం
- అసిస్టెంట్ ఇంజనీర్, మరో ముగ్గిరిపై వేటు
- సిబ్బంది స్థానికంగా ఉండాల్సిందేనని ఆదేశం

అడిగేవారే లేరన్న ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో షాకిచ్చారు. ఉద్యోగమంటే కాలక్షేపం కాదని... బాధ్యతగా పనిచేయాలని హితవు పలికారు. గ్రూప్‌ల వారీగా పారిశుధ్య కార్మికులను పేరుపేరునా అడిగి ఇబ్బందులు తెలుసుకున్నారు. వారికి జాకెట్స్ ఇవ్వకపోవడంపై కమిషనర్‌ను ప్రశ్నిం చారు. ప్రస్తుతం ఉన్న జాకెట్స్ నాసిరకంగా ఉన్నాయని, వెంటనే కొత్తవి తెప్పించాలని ఆదేశించారు. ఈ సమయంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరు మహేష్‌రాజు అక్కడ లేరు. ఎక్కడని కలెక్టర్ అడగ్గా... ఇంకా రాలేదని కమిషనర్ చెప్పారు. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని సూచించారు.

అనంతరం టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఉద్యోగుల వివరాలు అడిగారు. ఇద్దరు టీపీఎస్‌ల్లో ఒకరు హైదరాబాద్ నుంచి వస్తున్నట్టు కమిషనర్ చెప్పడంతో ఆగ్రహించిన కలెక్టర్... జిల్లా కేంద్రంలో పనిచేస్తూ హైదరాబాద్ నుంచి రావడమేంటని ప్రశ్నించారు. ఇష్టం లేకుంటే పనిచేయవద్దని, ఉద్యోగులు కచ్చితంగా స్థానికంగానే ఉండాలని హితవు పలికారు. అందుకు సర్కులర్ జారీ చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. రెగ్యులర్ సిబ్బందిలో ఆంజనేయులు బుధవారం చెప్పకుండా విధులకు డుమ్మా కొట్టడంపై అడగ్గా... తనకు అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్లానని అతను బదులిచ్చాడు. ‘ఏ ఆసుపత్రి? డాక్టర్ ఎవరు?’ అని కలెక్టర్ ప్రశ్నించగా... ప్రభుత్వాసుపత్రని, డాక్టర్ పేరు మల్లేశం అని ఆంజనేయులు బదులిచ్చాడు. అసలా పేరుతో అక్కడ డాక్టరే లేరని, తప్పుడు కారణాలు చెప్పడం తగదంటూ అతన్ని సస్పెండ్ చేశారు. అతనితో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారిశుధ్య కార్మికులు కృష్ణ, అరుణలను సస్పెండ్ చేశారు.
 
కమిషనర్లు భయపడుతున్నారు...
పారిశుధ్య కార్మికులు.. చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ ఇళ్లలో పనిచేస్తున్నారని శానిటేషన్ సూపర్‌వైజర్ తెలిపారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ చైర్మన్ ఇంట్లో తప్ప మరెవరి ఇళ్లలో పనిచేయడానికి వీల్లేదన్నారు. ఇక్కడ పనిచేయడానికి కమిషనర్లు భయపడుతున్నారని, ఎందుకని ఆరా తీస్తే... సిబ్బంది సరిగ్గా పనిచేయరని తేలిందన్నారు. వారంగా తానే ఈ విషయాన్ని ప్రత్యక్షంగా గమనించానన్నారు. సిబ్బంది పూర్తి బద్దకంగా తయారయ్యారని, వారం రోజుల్లో పూర్తిగా మార్చేస్తానని, నిర్లక్ష్యం వహించేవారిపై వేటు తప్పదని హెచ్చరించారు.
 
ఏమిటీ రోడ్లు?
‘నేను జిల్లాకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా... ప్రధాన రహదారిపై ఈ దుమ్మేమిటి? శుభ్రం చేయడంలేదా?’ అని కలెక్టర్ శానిటేషన్ ఇన్‌చార్జి కుమార్‌ను అడిగారు.  రెండు రోజుల్లో మొత్తం క్లీన్ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఉద్యోగులందరికీ గుర్తింపు కార్డులివ్వాలని కమిషనర్‌కు సూచించారు. అలాగే పారిశుధ్య కార్మికులకు సబ్బులు, నూనె ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్ ఇంతవరకు సరఫరా చేయలేదని కమిషనర్ చెప్పగా... వెంటనే అతని కాంట్రాక్టు రద్దు చేయాలని సూచించారు. ఇంటింటికీ తిరిగే చెత్త సేకరణ కార్మికులు... తమకు ప్రస్తుతం ఇస్తున్న రూ.20 సరిపోవడంలేదన్నారు. దాన్ని రూ.50కి పెంచేందుకు ప్రయత్నిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

Advertisement

What’s your opinion

Advertisement