వ్యవ‘సాయం’ చేస్తాం | Sakshi
Sakshi News home page

వ్యవ‘సాయం’ చేస్తాం

Published Fri, Jun 20 2014 2:33 AM

వ్యవ‘సాయం’ చేస్తాం

ఈ రంగానికే పెద్దపీట
- ఆంక్షలు లేకుండా రుణమాఫీ
- పతి ఎకరాకు నీరందిస్తాం
- పార్టీలతో సంబంధం లేకుండా పనిచేయాలి
- వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
- అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుదాం : ఎంపీ బీబీపాటిల్

 కలెక్టరేట్ : నవ తెలంగాణ నిర్మాణంలో వ్యవసాయ, సంక్షే మ రంగాలకు పెద్దపీట వేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ రంగాల్లో 85శాతం మంది ప్రజలు ఉన్నందున వీటిపైనే దృష్టి సారిస్తామన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రగతిభవన్‌లో గురువారం జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ముందుగా తెలంగాణ సాధనకు ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరలని కోరుతూ మౌనం పాటించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో మొత్తం 32లక్షల మంది రైతుల రూ.22వేల కోట్ల రుణాలను ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా ప్రభుత్వం మాఫీ చేస్తుందన్నారు. ఇందులో బంగా రం పెట్టి తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. జిల్లాలో రూ. 2,675కోట్ల రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఆరువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 650 కిలోమీటర్ల గోదావరి, 370 కిలో మీటర్ల కృష్ణ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్నందున వీటిద్వారా లక్షల ఎకరాలకు నీరందించేందుకు కంకణం కట్టుకున్నామన్నారు.

ఉద్యమనేత నుంచి ప్రభుత్వ రథసారధిగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలను, లక్ష్యాలను సంపూర్ణంగా నెరవేర్చడానికి అందరం ఐక్యమత్యంతో కృషి చేద్దామన్నారు. గుడ్‌గవర్నెన్స్‌తో ప్రజలకు మిత్రులుగా సేవలు అందించడానికి పార్టీలతో సంబంధం లేకుండా పని చే యాలని పోచారం సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని చెప్పా రు.

జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి, విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వసతిగృహాలను అధికారులు తనిఖీ చేయాలని, అవసరమైతే రాత్రిబస చేయాలన్నారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. జిల్లాను, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపడానికి అందరి సహకారం అవసరమన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్ డి. వెంకటేశ్వర్‌రావు, ఎస్పీ తరుణ్‌జోషి, జడ్పీ సీఈఓ రాజారాం, డీఆర్‌ఓ రాజశేఖర్, అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement