ఓరుగల్లు లోక్‌సభ అభ్యర్థి ఎవరు? | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు లోక్‌సభ అభ్యర్థి ఎవరు?

Published Fri, Jun 12 2015 3:02 AM

ఓరుగల్లు లోక్‌సభ అభ్యర్థి ఎవరు?

ఆరు మాసాల్లోగా ఉప ఎన్నిక
* కడియం రాజీనామాతో టీఆర్‌ఎస్‌లో చర్చ
* ఇతర పార్టీ నుంచి వచ్చే నేతలకు అవకాశంపై ఊహాగానాలు

సాక్షి, హైదరాబాద్: మళ్లీ ఉప ఎన్నికల చర్చ ఊపందుకుంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి వరంగల్ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన కడియం శ్రీహరి గురువారం తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నికల చర్చ మొదలైంది.

వివిధ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్‌లో చేరిన ఆయన ఇటీవల ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సభ్యుడిగా ఎన్నికవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫలితంగా వరంగల్ ఎంపీ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానాన్ని ఆరు నెలల్లోగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఉపఎన్నిక అనివార్యమని తేలిపోయింది. ఖాళీ అయిన  ఈ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరికి అవకాశం దక్కుతుందో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతల్లోనే ఎవరికైనా అవకాశం ఇస్తారా? ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి రావాలని చూస్తున్న వారికి ఛాన్సు దక్కుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎస్సీ రిజర్వుడు స్థానమైన వరంగల్ నుంచి బరిలోకి దింపడానికి సమర్థుడైన స్థానిక నేత ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు పార్టీ అధినేత కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. తనకు అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తన అంతరంగాన్ని బయట పెట్టారు. ఈ పేర్లు మినహా టీఆర్‌ఎస్ వైపు నుంచి ఇతర పేర్లేవీ బయటకు రాలేదు.
 
కాంగ్రెస్ నుంచి దిగుమతి?
కాంగ్రెస్‌కి చెందిన మాజీ ఎంపీ జి.వివేక్ పేరు గడిచిన కొద్ది నెలలుగా బాగా ప్రచారంలో ఉం ది. ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్ గూటికి చేరుతారని, వరంగల్ లోక్‌సభ అభ్యర్థిత్వం ఆయనకే ఖరారు కానుందన్న గుసగుసలూ పార్టీలో వినిపించాయి. 2009లో కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీగా గెలిచిన ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచే పోటీ చేసి ఓడిపోయారు.

టీపీసీసీ చీఫ్ పోస్టును ఆశించినా అది దక్కలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్సీ వర్గానికే చెందిన భట్టి విక్రమార్కను అధినాయకత్వం నియమించింది. దీంతో వివేక్‌కు దారులు మూసుకుపోయాయి. గతంలో టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు వివేక్‌కు సరైన న్యాయం చేయలేక పోయామన్న అభిప్రాయంలో ఉన్న పార్టీ నాయకత్వం ఆయనను పార్టీలోకి ఆహ్వానించి వరంగల్ టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని కొందరు అంటున్నారు. సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో జరగనున్న బిహార్ ఎన్నికలతోనే వరంగల్ స్థానానికి కూడా ఎన్నిక ఉంటుందని, సాధ్యమైనంత వేగంగానే అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోవచ్చని టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
ఎంపీ పదవికి కడియం రాజీనామా
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన లోక్‌సభ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ఢిల్లీలో కలిసి తన రాజీనామా పత్రాన్ని అందచేశారు. వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరిని సీఎం కేసీఆర్ తన కేబినెట్‌లోకి డిప్యూటీ సీఎంగా తీసుకుని విద్యాశాఖ అప్పగించిన విషయం తెలిసిందే. శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీగా జూన్ ఒకటో తేదీన కడియం శ్రీహరి ఎన్నికవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Advertisement
Advertisement