పదేళ్లలో తెలంగాణ నంబర్‌వన్‌ | Sakshi
Sakshi News home page

పదేళ్లలో తెలంగాణ నంబర్‌వన్‌

Published Sun, Nov 12 2017 2:44 AM

Telangana number in next ten years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన ఉందని, రాబోయే పదేళ్లలో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా మారడం ఖాయ మని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లో జరిగిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. నిజాం పాలనలో వందేళ్ల క్రితం ప్రపంచంలోనే హైదరాబాద్‌ నంబర్‌ వన్‌గా గుర్తింపు పొందిందని, తిరిగి కేసీఆర్‌ పాలనలో ఆ స్థాయికి చేరేందుకు కృషి జరుగుతోందని వెల్లడించారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యారంగానికి పెద్ద పీట వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. విద్యతో అభివృద్ధి సాధ్యమని గుర్తించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు. రాబోవు పదేళ్లలో ప్రపంచంలోనే లండన్‌ తరహాలో హైదరాబాద్‌ విద్యానగరిగా మారడం ఖాయమన్నారు. నిజాం రాజు హిందూ– ముస్లింలను సమాన దృష్టితో చూసేవారని, అదే తరహాలో సీఎం కేసీఆర్‌ కూడా సమాన దృష్టితో చూస్తూ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్నారని చెప్పారు.  

మైనారిటీల్లో వెలుగు.... 
తెలంగాణ ఏర్పాటు అనంతరమే మైనారిటీ కుటుంబాల్లో వెలుగు కనిపిస్తోందని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డిఅన్నారు. ఆంధ్రపాలకుల పాలనలో మైనారిటీల జీవన పరిస్ధితి దళితుల కంటే దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం హయంలో ముస్లిం ఉద్యోగులు 22 శాతం ఉండగా, ప్రస్తుతం ఒక శాతానికి పడిపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1.35 కోట్లు గురుకులాల కోసం కేటాయించిందని, దానిని రూ. 200 కోట్ల వరకు పెంచేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం మైనారిటీల కోసం సేవలు అందించిన డాక్టర్‌ మహ్మద్‌ హైదర్‌ఖాన్‌కు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జాతీయ అవార్డు–2017 తో పాటు రూ.2.25 లక్షల నగదు పురస్కారంతో ఘనంగా సన్మానించారు.

జకాత్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గయాసోద్దీన్‌ బాబుఖాన్‌కు కూడా అవార్డు అందజేసి సన్మానించారు. అనంతరం గురుకుల విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ వ్యవహార సలహాదారుడు ఏకేఖాన్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ సలీం, టీఎస్‌ ఎంఎఫ్‌సీ చైర్మన్‌ అక్బర్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీర్, టెమ్రీస్‌ కార్యదర్శి షఫీఉల్లా, దిలావర్, విలాయత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement