‘లిక్కర్ సిండికేట్’! | Sakshi
Sakshi News home page

‘లిక్కర్ సిండికేట్’!

Published Thu, Jun 19 2014 3:32 AM

‘లిక్కర్ సిండికేట్’! - Sakshi

సాక్షి, ఖమ్మం : మద్యం సిండికేట్ వ్యవహారం జిల్లాలో మరోసారి తెరపైకి వచ్చింది. నూతన విధానంలో మద్యం షాపులకు టెండర్లు పిలిచిన రెండు రోజుల్లోనే జిల్లాలోని రాజకీయ నాయకుల కన్ను పడడంతో ఈసారి టెండర్ల ప్రక్రియ కొత్తరంగు పులుముకుంది. జిల్లాలో ఉన్న షాపులకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపారులు పెద్ద ఎత్తున టెండర్లు దాఖలు చేస్తున్నారన్న సమాచారంతో వారిని ఎలాగైనా అడ్డుకోవాలనే ఆలోచనతో స్థానిక వ్యాపారులు కొందరు రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సిండికేట్ ఎలా కావాలనే దానిపై వీరు వ్యూహరచనలు చేసుకుంటున్నారు.
 
ఇందులో ఖమ్మం నగరానికి చెందిన ఓ కాంట్రాక్టర్ అన్నీ తానై నడిపిస్తుండగా, మరో ఇద్దరు సివిల్ కాంట్రాక్టర్లు తెరవెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా జిల్లా మద్యం వ్యాపారాన్ని ‘చే’జిక్కించుకోవాలన్న ఆలోచనతో వీరు రాజకీయ నాయకులతో సమావేశమవుతున్నారని సమాచారం. ఈ సమావేశాలకు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల అనుచరులు కూడా హాజరయ్యారని, స్థానిక వ్యాపారులతో కలిసి వీరంతా సిండికేట్‌ను తయారుచేయడంలో తలమునకలై ఉన్నారని తెలుస్తోంది.
 
ఆంధ్రావ్యాపారులు ‘టెండర్’ పెడుతున్నారని....
అసలీ ‘సిండికేట్’వ్యవహారం తెరపైకి వచ్చేందుకు ఓ సంఘటన కారణమనే చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన ఓ మద్యం వ్యాపారి ఆంధ్ర ప్రాంతంలోని దుకాణాలకు టెండర్ వేసేందుకు గాను డీడీ తీసేందుకు వె ళ్లగా, అక్కడి వ్యాపారులు ఖమ్మం జిల్లాలోని మెజారిటీ షాపులకు ‘టెండర్’ పెడుతున్నారని ఉప్పందింది.  ఆంధ్ర ప్రాంత వ్యాపారులు జిల్లాలో మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో పెట్టుకోవడాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతో సదరు వ్యాపారి ఖమ్మం వచ్చి రాజకీయ నాయకుల సహకారాన్ని అడిగినట్టు తెలిసింది.
 
జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల అనుచరులతో కలిసి ఖమ్మంలో మంగళవారం సమావేశం నిర్వహించగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేల అనుచరులను ఆహ్వానించినా వారు రాలేదని సమాచారం. మరోవైపు గతంలో సంచలనం సృష్టించిన మద్యం సిండికేట్ నిందితుల్లో ఒక వ్యాపారి మళ్లీ తన బినామీలతో రంగంలోకి దిగుతున్నారు. జిల్లాలోని మొత్తం 147 షాపులకు ఈయన టెండర్ దాఖలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యేల అండతో జిల్లాలో మద్యం వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు కొందరు వ్యాపారులు, కాంట్రాక్టర్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
 
ఇప్పుడు సాధ్యమవుతుందా?
వ్యాపారుల రహస్య సమావేశాల్లో భాగంగా సిండికేట్ అయ్యేందుకు గల మార్గాలపై చర్చలు జరిగాయని తెలుస్తోంది. గత టెండర్లలో ఒక్కో వ్యాపారి 50 షాపులకు దరఖాస్తు చేసినా ఒకటి, రెండు షాపులే లాటరీలో రావడంతో దరఖాస్తు ఫీజు రూపంలో లక్షలాది రూపాయలు నష్టపోయారు. ఈ నేపథ్యంలో షాపుల వారీగా దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్న వారి వివరాలను సేకరించి, వారితో మాట్లాడాలని, అవసరమైతే ఎమ్మెల్యేల చేత సిఫారసు చేయించాలనే చర్చ జరిగినట్లు సమాచారం. అయితే, టెండర్ల కంటే ముందే సిండికేట్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆంధ్ర  వ్యాపారులను అడ్డుకునే అంశంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
 
గత ప్రభుత్వం హయాంలోనే మద్యం షాపుల పర్మిట్లను మరో ఆరునెలలు పొడిగించుకుని ఉంటే సమస్య ఉండేది కాదని, అది చేసుకోకుండా మళ్లీ ఇప్పుడు టెండర్లు కాకుండానే సిండికేట్ ఎలా సాధ్యమవుతుందని ఓ వ్యాపారి ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో 57 దుకాణాలకు గిరిజనులే టెండర్లు వేయాలని, వీటికి చాలా కాలం నుంచి బినామీలే టెండర్లను వేస్తున్నారని, దీనిని ఎలా అడ్డుకోగలుగుతామనే అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తమయింది.
 
స్థానిక వ్యాపారులే ఆంధ్ర వ్యాపారుల సహకారంతో టెండర్ పె డితే ఏమీ చేయలేమని, ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత లాటరీలో దుకాణాలు వచ్చినవారందరినీ పిలిపించి సిండికేట్ గురించి ఆలోచిద్దామని కొందరు ప్రతిపాదించినట్లు సమాచారం. కానీ, సిండికేట్‌గా ఏర్పడి టెండర్ వేద్దామని, మనకే వస్తే తర్వాత కూడా ఇబ్బంది ఉండదని కొందరు సూచించారని, ఈ నేపథ్యంలో మళ్లీ టెండర్ల ప్రక్రియ ముగిసేలోపు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం.
 
ప్రభుత్వ ఆదాయానికి గండి...
ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం మద్యం దుకాణాల టెండర్ల ద్వారా వచ్చేదే. ఎంత ఎక్కువ మంది నుంచి టెండర్ దరఖాస్తులు తీసుకుంటే ప్రభుత్వానికి అంత ఎక్కువగా ఆదాయం వస్తుంది. అయితే వ్యాపారులు సిండికేట్ అయితే ఈ ఆదాయానికి రూ.కోట్లలో గండి పడే అవకాశం ఉంది. సిండికేట్ విధానంతో ఇటు మైదాన, అటు ఏజెన్సీలో వ్యాపారం బాగా జరిగే దుకాణాలకు తక్కువ మొత్తంలో టెండర్లు పడతాయి. ఈ టెండర్లు వేసే వారు కూడా సిండికేట్ రింగ్ నుంచే ఉంటారు. ఒక్కో టెండర్ దరఖాస్తుకు రూ.25వేలు చెల్లించాలి. టెండర్ దక్కినా, దక్కకపోయినా ఈ డబ్బు అంతా ప్రభుత్వ ఖజానాలోకే వెళ్తుంది.
 
 సిండికేట్ వ్యవహారంతో ఒక్కో దుకాణానికి తక్కువగా టెండర్లు పడితే ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే మందుబాబుల జేబుకు చిల్లు పడనుంది. జిల్లా వ్యాప్తంగా, లేదంటే ప్రాంతాల వారీగా సిండికేట్ కావడం ద్వారా మద్యం ధరలను విపరీతంగా పెంచి కోట్లాది రూపాయల మద్యం తాగించి సొమ్ములు లాక్కునే ప్రయత్నాలకు ఎక్సైజ్ అధికారులు ఎలా చెక్‌పెడతారో, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement