Sakshi News home page

చెరువుల పునరుద్ధరణ!

Published Thu, Sep 18 2014 12:21 AM

The restoration of the pond!

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు నీటిపారుదల వ్యవస్థను అతలాకుతలం చేశాయి. ఆయకట్టు పొలాలకు సాగునీరందించే పలు చెరువులను పెద్దఎత్తున దెబ్బతీశాయి. కొన్నిచోట్ల చెరువు కట్టలకు గండ్లు పడగా.. మరికొన్ని చోట్ల ఫీడర్ ఛానళ్లు దెబ్బతినడంతో ఆయకట్టు ప్రాంతమంతా నీటిలో మునిగిపోయింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 63 చెరువులకు గండ్లు పడడంతో వేల హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ చెరువుల బాగుకు జిల్లా నీటిపారుదల విభాగం ప్రణాళికలు రూపొందించింది. అందుబాటులో ఉన్న నిధులతో దెబ్బతిన్న చెరువులకు తాత్కాలిక, శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు మొదలుపెట్టింది.

 శాశ్వత మరమ్మతులకు  రూ.4.03 కోట్లు
 నీటిపారుదల శాఖ ఇంజినీర్లు గుర్తిం చిన 63 చెరువులకు మరమ్మతులు చేపట్టేందుకు రెండు రకాల ప్రణాళిక లు తయారుచేశారు. ఇందులో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన మరమ్మతు లు చేపట్టేలా కార్యాచరణ రూపొం దించారు. 63 చెరువులకు తాత్కాలిక మరమ్మతుల నిమిత్తం రూ.43.58 లక్షలతో ప్రణాళిక తయారు చేయగా.. శాశ్వత పద్ధతిలో రూ.4.03 కోట్లతో పనులు నిర్ధారించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో ఈ పనులు చేపట్టాలని భావిస్తున్న అధికారులు స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని నిర్ణయించారు. ఈ చెరువులన్నీ పశ్చిమ ప్రాంతానికి చెందినవే. తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు నమోదు కాకపోవడంతో చెరువులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

 చేజారిన ఆశలు..
 వరద ప్రభావం కారణంగా చెరువులు దెబ్బతినడంతో రైతాంగం భారీగా నష్టపోయింది. ఈ చెరువుల నుంచి ఆయకట్టుకు నీరుపారే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. నిల్వ ఉన్న నీటితో భూగర్భ జలాలపై ఆందోళన ఉండేది కాదు. ఒకవైపు వర్షాలు తగ్గుముఖం పట్టగా.. మరోవైపు భారీ వరదలతో చెరువులకు గండ్లు పడడంతో నీరంతా లోతట్టుప్రాంతాలకు చేరింది. తాజాగా చెరువుల మరమ్మతులకు యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. కానీ ఇప్పటికే వరదనీరు ఇతర ప్రాంతాల పాలుకావడంతో తాజా రబీ సీజన్లో రైతులకు ఒరిగేదేమీలేదు. వాస్తవానికి వర్షాకాలానికి ముందే మరమ్మతులు చేయాల్సి ఉండగా.. అధికారుల ఉదాసీన వైఖరితో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4కోట్లు వెనక్కు వెళ్లిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement