ధాన్యం కొనే దిక్కేది!? | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనే దిక్కేది!?

Published Sun, Oct 26 2014 1:51 AM

ధాన్యం కొనే దిక్కేది!? - Sakshi

 నీలగిరి : వ్యవసాయ మార్కెట్లలోకి తరలివస్తున్న ధాన్యం కొనే దిక్కేలేకుండా పోయింది. వ్యాపారులు, మిల్లర్లు ముందుకు రావట్లేదు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలకు వస్తున్న ధాన్నాన్ని మాత్రమే కొంటున్నారు. దీంతో రైతులు తీసుకొచ్చిన ధాన్యం రాశులతో వ్యవసాయ మార్కెట్లు నిండిపోతున్నాయి. మార్కెట్లోకి తీసుకొస్తున్న ధాన్యం నాణ్యత పరిశీలించి రైతులకు సహరించాల్సిన మార్కెట్ యంత్రాంగం స్పదించకపోవడంతో శనివారం జిల్లాలో పలుచోట్ల కురిసిన అకాల వర్షానికి భారీ నష్టం వాటిల్లింది. నల్లగొండ, చిట్యాల, భువనగిరి, గంజ్, వలిగొండ మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఇక నల్లగొండలో అధికారుల పనితీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన రైతాంగం ఏకంగా రోడ్డెకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
 జిల్లా మార్కెటింగ్ అధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో మిర్యాలగూడ మార్కెట్ కార్యదర్శికి ఇక్కడి బాధ్యతలు అప్పగించారు. దీంతో కొనుగోళ్ల వ్యవహారం ఆగమ్యగోచరంగా మారింది. శనివారం వర్షానికి నల్లగొండ మార్కెట్‌లో 30 వేల బస్తాల ధాన్యం తడిసిపోగా, భువనగిరి మార్కెట్‌లో 2వేల బస్తాలు, భువనగిరి గంజ్ మార్కెట్‌లో వెయ్యి బస్తాల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది. భారీ వర్షం కారణంగా ధాన్యం రాశులపై పట్టాలు కప్పినప్పటికీ వర్షపు నీటి ప్రవాహానికి చాలా ధాన్యం కొట్టుకుపోయింది. చిట్యాల మార్కెట్‌కు ఇరవై రోజుల క్రితం తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో 15 క్వింటాళ్ల ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. మరో 6 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. ఇక్కడ మార్కెట్‌లో సరైన వసతులు లేకపోవడంతో రైతులు అనేక ఇక్కట్లు పడుతున్నారు. వలిగొండ మార్కెట్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది.
 
 పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు...
 ఐకేపీ, పీఎసీఎస్‌లకు తరలివస్తున్న ధాన్యం నాసిరకంగా ఉంటుందని, నాణ్యత పరిశీలించిన తర్వాత కొనుగోలు చేస్తామని నిన్నామొన్నటి వరకు మిల్లర్లు పేచీ పెట్టారు. దీంతో రెండు కేంద్రాలకు ఒకరు చొప్పున మండల అసిస్టెంట్ వ్యవసాయ అధికారిని నియమించారు. ధాన్యంలో తేమ, చెత్తశాతం పరిశీలించిన తర్వాతే నాసిరకంగా ఉందీ..లేనిది ఏఈఓ సర్టిఫికె ట్ ఇచ్చిన ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు దింపుకుంటున్నారు. కానీ ఇప్పటికే ఐకేపీ కేంద్రాలు 12,467 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాయి. దీంట్లో 8,590 క్వింటాళ్లు మిల్లర్లకు పంపారు.
 
 ఇంకా 3,877 క్వింటాళ్ల ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో పేరుకుపోయింది. పీఏసీఎస్‌లు 12,470 క్వింటాళ్లు కొనుగోలు చేశాయి. చౌటుప్పుల్, పోచంపల్లి, కొయ్యలగూడెం ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల నత్తనడకన సాగుతున్నాయి. ఈ సీజన్ నుంచి కొత్తగా పెట్టిన టోకెన్ పద్ధతి రైతాంగాన్ని ఇబ్బందుకు గురిచేస్తోంది. ఇక మార్కెట్ల్‌లో తేమశాతం పరిశీలించి రైతాంగానికి తోడ్పాటునందించే వారు లేకపోవడంతో రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. అదీగాక మార్కెట్ అధికారులు తేమశాతాన్ని లెక్కించడంలో పొరపాట్లు చేస్తున్నారు. తేమ 17 శాతం వరకు ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ 15 శాతం వరకే పరిశీలించి నాణ్యత సరిగా లేదని తేల్చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్ ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించాలని రైతాంగం కోరుతోంది.                           

Advertisement
Advertisement