చెరువుకు ముప్పు తప్పదా? | Sakshi
Sakshi News home page

చెరువుకు ముప్పు తప్పదా?

Published Tue, Oct 7 2014 12:03 AM

చెరువుకు ముప్పు తప్పదా? - Sakshi

ఇబ్రహీంపట్నం:  మండలంలో 1000 ఎకరాలకు పైబడి  భూములకు సాగునీరందించే ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఉనికికి ముప్పు పొంచి ఉంది. దురాక్రమణలు, రియల్ మాఫియా, మైనింగ్ మాఫియా, అధికారయంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటం ఇబ్రహీంపట్నం చెరువు ఉనికికి ముప్పు తెచ్చిపెడుతున్నాయి. వర్షాలు లేకపోవడం వల్లనే చెరువు నిండటంలేదని అనుకుంటున్నా వర్షాలు కురిసినా చెరువులోని నీరురావడం అంత సులువుకాదన్నది నిజం.

 రైతులకు నాటి భరోసా ఏదీ?
 ఇబ్రహీంపట్నం చెరువు పూర్తిస్థాయిలో నిండితే కొన్ని సవంత్సరాలు కరువుఛాయలు దరిచేరవని రైతాంగంలో భరోసా ఉండేది. చెరువులోని నీరు సం వృద్ధిగా చేరితే సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు ఉండవని రైతులు, ప్రజల్లో గతంలో నమ్మకం ఉండేది. ఆ భరోసా  దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి లేదు.

 కబ్జాకోరల్లో చెరువు
 రియల్టర్లు, మైనింగ్ మాఫియా ఇష్టానుసారం రెచ్చిపోవడంతో ఇబ్రహీంపట్నం చెరువు కబ్జాకోరల్లో చిక్కుకుంటోంది. 800 ఎకరాల్లో ఉన్న చెరువు ప్రధాన నాలాలు, వాగులు పరాధీనం అవుతున్నాయి. దీంతో 47 గొలుసు చెరువులకు ప్రాణాధారమైన వనరులన్నీ హరించుకుపోతున్నాయి. ప్రధానంగా 85 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఫిరంగి నాలా అన్యాక్రాంతం అరుుంది. షాబాద్ మండలం చందన్‌వెల్లి మీదుగా ప్రారంభం అయ్యే ఈ నాల చేవెళ్ల, సరూర్‌నగర్, శంషాబాద్ మండలాల మీదుగా ఆదిబట్లద్వారా ఇబ్రహీంపట్నం చెరువులోకి వచ్చిచేరుతుంది.  

ఈ నాలాను ప్రస్తుతం ఆక్రమించడం, పూడిపోవడంతో అస్తవ్యస్తంగా మారింది. తాజాగా చెరువులో సైతం అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి.

 చెరువు నిండితే పండగే: పోచారం వాగులో కొనసాగుతున్న ఇసుక తవ్వకాలు, ఫిరంగి నాలా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపితే   ఇక్కడి రైతాంగం కళ్లలో ఆనందంచూడొచ్చు. ఇబ్రహీంపట్నం తూర్పుభాగంతోపాటు మంచాల, హయత్‌నగర్, సంస్థాన్ నారాయణ్‌పూర్, చౌటుప్పల్ మండలాల్లోని  వందగ్రామాల రైతాంగం, ప్రజలకు సాగు, తాగునీరు కు ఈచెరువు ఆధారం. వర్షాభావ పిరిస్థితులు, చెరువు నుంచి నీటి విడుదల అయ్యేమార్గం లేకపోవడంతో ఆయకట్టు భూముల్లో కంపచెట్లు మొలకెత్తున్నాయి.

Advertisement
Advertisement