మహావేడుక! | Sakshi
Sakshi News home page

మహావేడుక!

Published Wed, May 27 2015 2:15 AM

Three days from today mahanadu

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే ‘మహానాడు’కు మరోసారి జిల్లా అతిథ్యమిస్తోంది. మహానాడును వేడుకలా భావించే టీడీపీ నాయకత్వం గండిపేట కుటీరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. మూడు రోజులపాటు జరిగే సమావేశాలకు భారీ వేదిక, సభా ప్రాంగణాన్ని సిద్ధం చేసిన ‘దేశం’ నాయకులు తెలుగు రాష్ట్రాల చారిత్రక, సంస్కృతులు ప్రతిబింబించేలా వేదికను ఏర్పాటు చేశారు. కాకతీయ కళాతోరణం, అమరావతి బుద్ధ విగ్రహాంతో స్టేజీని రూపొందించింది.
 
 వివిధ అంశాలపై సమావేశాల్లో చర్చలు, తీర్మానాలు చేయనున్నారు. సభాస్థలికి దారితీసే మార్గాలను ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలతో పసుపుమయం చేశారు. ఇరు రాష్ట్రాల నుంచి తరలివచ్చే కార్యకర్తలు సేదతీరేలా, ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌లో బస చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ బాట పట్టినప్పటికీ, దాని ప్రభావం పార్టీపై లేదని చూపేలా గండిపేట మార్గాన్ని అలంకరించారు. మహానాడుకు 40వేల మంది నేతలు, కార్యకర్తలు తరలివస్తారని అంచనా వేస్తున్న టీడీపీ.. ప్రాంగణంలో నేతల ప్రసంగాలను ఎక్కడి నుంచైనా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామక్రమాలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను నిర్వహించను న్నారు. దీనికితోడు దూరప్రాంతాల నుంచి వచ్చే శ్రేణులకు భోజనాలను వడ్డించేందుకు పసందైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల వంటకాలు మెనూలో చర్యలు తీసుకుంటున్నారు.
 
 తమ్ముళ్లకు అలంకర ణ బాధ్యత!
 అధికారపార్టీ దూకుడుతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న జిల్లా టీడీపీ నాయకత్వం.. మహానాడుతో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహానాడుకు ఆతిథ్యమిస్తున్న మార్గాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని టిప్పుఖాన్ వంతెన నుంచి స్థభాస్థలి వరకు స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు. హిమాయత్‌నగర్ గ్రామంలో ఉదయం 9 గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ జెండా ఆవిష్కరించేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. పార్టీ జిల్లా సారథిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జరుగుతున్న మహానాడును విజయవంతం చేసేందుకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సర్వశక్తులొడ్డారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమేకాకుండా.. వేలాదిగా తరలివచ్చే వాహనశ్రేణిని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.

Advertisement
Advertisement