ప్రచారానికి పనుల పోటు | Sakshi
Sakshi News home page

ప్రచారానికి పనుల పోటు

Published Mon, Dec 3 2018 9:55 AM

Tighten the campaign - Sakshi

సాక్షి, అచ్చంపేట: అసలే పనుల కాలం.. పత్తి ఏరే దశ.. వరి కోసే దశ.. మిరప పందెలు పడేక్రమంలో నిత్యం పల్లెలు బిజీబీజీగా ఉంటున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన గ్రామాల్లో ఒక్కరూ కనిపించడం లేదు. నేతల ప్రచారానికి వ్యవసాయ పనుల దెబ్బ తాకుతోంది. గత మూడు వారాల నుంచి నాయకులు విస్తృతంగా ప్రచారంలో పొల్గొంటున్నారు.

ఇదే సమయంలో పత్తి తీయడం, వరికోతలు, మిరపలో తీయడం వంటి పనుల్లో వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు నిమగ్నమై ఉంటున్నారు. మధ్యాహ్నం పూట గ్రామాల్లో నిశబ్ద వాతావరణం కనిపిస్తోంది. నేతలు తమ ప్రచారాన్ని ఉదయం పది గంటలకు ముందు, సాయంత్రం నాలుగు గంటల తర్వాత కొనసాగించే పరిస్థితి నెలకొంది.


ఇటు ప్రచారం.. అటు వ్యవసాయం..
ప్రస్తుతం జిల్లాలో ఓవైపు ప్రచారం మరోవైపు వ్యవసాయం అన్న వాతావరణం కనిపిస్తోంది. రెండు ఒకసారి కావడంతో ప్రజలకు ఈ సీజన్‌లో వరిపంట చేతికి వస్తుంది. జిల్లాలోని 21 మండలాల్లో జోరుగా కోతలు నడుస్తున్నాయి. మరోవైపు పత్తి తీసేందుకు గ్రామాల్లో వ్యవసాయదారులు, కూలీలు పొలాలకు వెళ్తున్నారు.


నాయకులు, కార్యకర్తల పాట్లు..
ప్రస్తుతం గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలు జన సమీకరణ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొందరు నాయకులు వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు, కూలీలను పొలాల వద్దకు వెళ్లి ప్రసన్నం చేసుకుంటున్నారు. జర మాకు ఓటేయండి..మీకు అండగా ఉంటామని బతిమిలాడుకుంటున్నారు.

కొంతమంది వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా కొద్దిసేపు పనులు చేస్తూ మరీ మెప్పించడం విశేషం. ఇక కొంతమంది ప్రజాప్రతినిధులు తెల్లవారకముందే ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. 


ప్రచారానిక వచ్చే సమయంలో..
జిల్లాలో గ్రామీణ జనాభా అధికం. ప్రధాన వృత్తి వ్యవసాయం. తమ నాయకుడు వచ్చి ప్రచారం చేసే సమయంలో ప్రజలు తక్కువగా ఉంటే మొదటికే మోసం వస్తుందని ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు. జనాలు తక్కువ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకరావడమో, తమ గ్రామాల్లోని వారికే రూ.వంద, రెండు వందలు ఇవ్వడం వారే ఏదో విధంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. నేతల ప్రచారానికి వచ్చే రోజు ఎలాగైనా ప్రజలు ఉండేలా చూసుకుంటున్నారు. 


కూలీలు లేకపోతే..
గ్రామాల్లో కూలీలు లేకపోతే వ్యవసాయ పనులు కష్టం. ముఖ్యంగా వీరు పనులకు వెళ్లకుంటే దాదాపుగా గ్రామాల్లోని ప్రజలందరూ పనులకు వెళ్లరని భావిస్తున్నారు. దీంతో ఈరోజు తమ గ్రామంలో ప్రచారం ఉందంటే గ్రామాల్లోని నాయకులు ప్రజలు ఉండేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు.

ముందురోజు కూలీలకు డబ్బులు ఇవ్వడంతో పాటు భోజనం, తాగే వారికి మందు సరఫరా చేస్తున్నారు. మరోవైపు అత్యవసరమైతే కూలీలు రాకున్నా ఇంటిల్లిపాది వ్యవసాయ పనులకు వెళ్తున్నారు.  

Advertisement
Advertisement