అంతర్జాతీయ యవనికపై ఓరు‘ఘల్లు’..! | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ యవనికపై ఓరు‘ఘల్లు’..!

Published Tue, Aug 8 2017 1:37 AM

అంతర్జాతీయ యవనికపై ఓరు‘ఘల్లు’..!

► వరంగల్‌కు ‘అంతర్జాతీయ’ ప్రచారం
►శాస్త్రీయంగా రూట్‌ గైడ్‌ రూపకల్పన
► పేరు ‘టూర్‌ గైడ్‌ ఆఫ్‌ కాకతీయ హెరిటేజ్‌’
► డెక్కన్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ చొరవ
► బోస్టన్‌ ప్రొఫెసర్‌ వాగ్నర్‌కు బాధ్యతలు
► 4 రోజుల అధ్యయనం ప్రారంభం


సాక్షి, హైదరాబాద్‌: పర్యాటకుల స్వర్గధా మంగా భాసిల్లగల గొప్ప సహజ, చారిత్రక సంపద తెలంగాణ సొంతం.విదేశాల్లో యునెస్కో గుర్తింపు పొందిన పలు ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు దీటైన ఆకర్షణ లు మన దగ్గర ఎన్నో ఉన్నాయి. కానీ అంత ర్జాతీయంగా సరైన ప్రచారం లేక వాటికి రావాల్సినంత ప్రాచుర్యం రాలేదన్నది వాస్తవం.

ఈ నేపథ్యంలో మన చారిత్రక ప్రాం తాలకు అంతర్జాతీయంగా శాస్త్రీయ పద్ధతిలో సరైన ప్రచారం కల్పించేందుకు లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న చారిటబుల్‌ సంస్థ ఒకటి ముందుకొచ్చింది. అందులో భాగంగా కాకతీయుల రాజధాని వరంగల్లు, దాని పరిసరాల్లోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై సమగ్ర అంతర్జాతీయ టూర్‌ గైడ్‌ను రూపొం దించాలని నిర్ణయించింది. అమెరికాలో బోస్టన్‌ నగరంలోని వెస్లీ విశ్వవిద్యాలయ ఆచార్యుడు ఫిలిప్‌ బి వాగ్నర్‌కు ఈ బాధ్యతలను అప్పగించింది. ఆయన ఇప్పటికే వరంగల్‌లో అధ్యయనం ప్రారంభించారు.

డెక్కన్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ చొరవ
లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న డెక్కన్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ దక్కన్‌ ప్రాంత ప్రత్యేకతలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇప్పటికే హంపి, గోవా చర్చిలు, కొంకణ్‌ కట్టడాలు తదితరాలపై అధ్యయనం చేసి, అంతర్జాతీయ పర్యాటకులకు మార్గనిర్దేశం చేసేలా ఆయా ప్రాంతాల టూరిస్ట్‌ గైడ్‌లను వెలువరించింది. తాజాగా కాకతీయ కట్టడాలపై దృష్టి సారించింది. వరంగల్‌కు చెందిన కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ సహకారంతో ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది.

ఈ బాధ్యతలను ప్రొఫెసర్‌ వాగ్నర్‌కు అప్పగిం చడం వెనక కారణ ముంది. దాదాపు 35 ఏళ్ల క్రితం లండన్‌కు చెందిన ప్రఖ్యాత చరిత్రకారుడు జార్జ్‌ మైకేల్‌ వరంగల్‌పై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. దానికి ఆకర్షితుడైన వాగ్నర్‌ ఆ తర్వాత ఆయనతో కలిసి వరంగల్‌లో పర్యటించి ఇక్కడి పలు ప్రత్యేకతలను గుర్తించారు. తర్వాత కూడా రెండు మూడు సార్లు నగరంలో పర్యటించారు. ఇక్కడి సంస్కృతులు, చారిత్రక నేపథ్యం మీదేగాక తెలుగు భాషపైనా కొంత పట్టు సంపాదిం చారు. తాజా అధ్యయనంలో భాగంగా శనివారం ఆయన వరంగల్‌కు వచ్చారు.

పురావస్తు శాఖ విశ్రాంత ఉప సంచాలకుడు రంగాచార్యులు వాగ్నర్‌కు మార్గదర్శనం చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు నగరంలోని ప్రధాన ప్రాంతాలను సందర్శించి, అంతర్జాతీయ పర్యాటకులకు ఉపయోగపడేలా ‘టూర్‌ గైడ్‌ ఆఫ్‌ కాకతీయ హెరిటేజ్‌’ పేరుతో పుస్తకం రూపొందిం చేందుకు వాగ్నర్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీన్ని వచ్చే జూన్‌ నాటికి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకో వడానికి పుస్తకం దోహదపడనుంది. ప్రభుత్వం చొరవ తీసుకుని వరంగల్‌లోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన వసతులు తదితర సౌకర్యాలు కల్పిస్తే విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచుకునే అవకాశముంటుంది. వరంగల్‌ తర్వాత హైదరాబాద్‌ స్టేట్‌ మ్యూజియంలో ఉన్న నాణేలపై కూడా వాగ్నర్‌ అధ్యయనం చేయనున్నారు. వాటి ప్రత్యేకతలు, వివిధ రాజ వంశాలపై పరిశోధన చేసి మరో ప్రత్యేక పుస్తకం కూడా తేనున్నారు.

మరెంతో అధ్యయనం జరగాలి
వరంగల్‌ నగరం ప్రపంచం లోనే ప్రత్యేకత సంతరించుకున్న నిర్మాణం. లండన్‌కు చెందిన చరిత్రకారుడు మైకేల్‌ గతంలో దీనిపై ఎంతో అధ్యయనం చేశారు. ప్రపంచంలో బాగ్దాద్‌ తర్వాత ఏకైక వృత్తాకార నగరం వరంగల్లేనని తేల్చారు. అయితే నాలుగు కీర్తి తోరణాల మధ్య మాత్రమే ఇప్పటిదాకా అధ్యయనం జరిగింది. వాటి వెలుపల ప్రపంచానికింకా తెలియని ప్రత్యేకతలెన్నో దాగున్నాయి. వాటిని వెలుగులోకి తెస్తే విదేశీ పర్యాటకులు ఇక్కడికి బారులు తీరతారు. వాటిపై అధ్యయనం చేయాల్సి ఉంది. అందుకు తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. వరంగల్‌ నాకెంతో ఇష్టమైన నగరం. 1985 ప్రాంతంలో ఇక్కడికొచ్చాను. అప్పటికీ ఇప్పటికీ ఇక్కడెంతో మార్పు వచ్చింది.   

– ఫిలిప్‌ బి వాగ్నర్‌ ఆచార్యుడు, వెస్లీ విశ్వవిద్యాలయం, బోస్టన్, అమెరికా

Advertisement
Advertisement