మంత్రులంతా హస్తినకే! | Sakshi
Sakshi News home page

మంత్రులంతా హస్తినకే!

Published Tue, Mar 6 2018 1:18 AM

TRS Seniors To Contest in Loksabha Polls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. రాష్ట్రంలోని లోక్‌సభ సీట్లన్నింటినీ గెలుచుకోవడం లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. బలమైన నాయకులను, సీనియర్లను లోక్‌సభ అభ్యర్థులుగా పోటీ చేయించాలని యోచిస్తున్నారు. దీనిపై అంచనాలు వేసిన ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టు కేసీఆర్‌ సన్నిహితులు వెల్లడించారు. జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించాలంటే.. ముందుగా సొంత రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలపై గురిపెట్టడం మంచిదనే యోచనతో వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది.

కచ్చితంగా గెలిచేవారిపై సర్వే..: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా... 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 11 స్థానాలు గెలుచుకుంది. తర్వాత టీడీపీ ఎంపీ
మల్లారెడ్డి, వైఎస్సాఆర్‌సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేరడంతో.. టీఆర్‌ఎస్‌ బలం 14కు చేరింది. కేంద్రంలో ప్రభావశీల పాత్ర పోషించాలంటే ఇంతకుమించి సీట్లు గెలుచుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. అయితే సాధారణంగా ప్రస్తుతమున్న ఎంపీలపై వ్యతిరేకత ఉంటుంది. దీనిని ఎదుర్కొని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు.

లోక్‌సభ స్థానాల్లో కచ్చితంగా గెలిచే వారెవరనే విషయంలో వివిధ సర్వేలు, నాయకుల స్థాయి, నియోజకవర్గాల్లో బలహీన అంశాలేమిటనే వాటిపై లోతుగా సమాచారాన్ని సేకరించారు. టీఆర్‌ఎస్‌లో సీనియర్లు, ప్రస్తుతం మంత్రివర్గంలో, ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ లోక్‌సభ పరిధిలో గట్టిపట్టు, ప్రభావమున్న నేతలను బరిలో నిలపాలని నిర్ణయించారు. కేసీఆర్‌ సైతం ఎంపీగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రానున్న ఎన్నికల్లో మెదక్‌ లోక్‌సభ సీటుతోపాటు సిద్దిపేట అసెంబ్లీ స్థానంలో పోటీచేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

లోక్‌సభకు పోటీ చేసేది వీరే!
కేసీఆర్‌కు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీ అభ్యర్థులు, లోక్‌సభ స్థానాలకు ఎంపికపై సీఎం కేసీఆర్‌ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. అనూహ్య రాజకీయ పరిణామాలు, మార్పులుంటే తప్ప ఈ జాబితానే అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం..

– మెదక్‌ లోక్‌సభకు కేసీఆర్‌ పోటీ చేయనున్నారు. దీంతోపాటు తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన సిద్దిపేట నుంచి అసెంబ్లీకి పోటీచేయాలని భావిస్తున్నారు.
– సిద్దిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి టి.హరీశ్‌రావును జహీరాబాద్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయించాలని భావిస్తున్నారు. లోక్‌సభకు పోటీచేయడానికి హరీశ్‌ విముఖంగా ఉంటే గజ్వేల్‌ లేదా హుస్నాబాద్‌ అసెంబ్లీ స్థానాల్లో ఒకదానికి పోటీచేయించే అవకాశముంది.
– ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ను కరీంనగర్‌ ఎంపీగా బరిలోకి దింపనున్నారు. హూజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈటల సతీమణి జమునకు అవకాశమివ్వాలని యోచిస్తున్నారు.
– ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని వరంగల్‌ లోక్‌సభకు పోటీచేయించనున్నారు. గత ఎన్నికల్లో ఆయన లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు.
– మంత్రి పి.మహేందర్‌రెడ్డిని చేవెళ్ల లోక్‌సభ నుంచి పోటీచేయించనున్నారు. చేవెళ్ల ఎంపీగా ఉన్న విశ్వేశ్వర్‌రెడ్డిని మల్కాజిగిరి నుంచి పోటీ చేయించే అవకాశముంది. ఒకవేళ లోక్‌సభకు వెళ్లడానికి మహేందర్‌రెడ్డి విముఖంగా ఉంటే.. మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డిని చేవెళ్ల నుంచి పోటీ చేయించాలనే ప్రతిపాదన ఉంది.
– మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేయించాలనే యోచన ఉంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు అసెంబ్లీ స్థానంలో ప్రస్తుత ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని రంగంలోకి దింపే అవకాశాలున్నాయి.
– ఆదిలాబాద్‌కు చెందిన రమేశ్‌ రాథోడ్‌ ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి గతంలో టీడీపీ తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆయనను.. తిరిగి ఇదే స్థానం నుంచి బరిలో దింపాలని టీఆర్‌ఎస్‌ అధినేత యోచిస్తున్నారు.
– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను సికింద్రాబాద్‌ ఎంపీగా పోటీ చేయించనున్నారు. అయితే బీజేపీలోని సీనియర్‌ నాయకుడు ఒకరిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని, ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలన్న ప్రతిపాదన ఉంది. ఆ నేత టీఆర్‌ఎస్‌లోకి రాకపోతే తలసానిని లోక్‌సభకు పోటీచేయించి.. ఆయన కుమారుల్లో ఒకరికి అసెంబ్లీ నుంచి అవకాశమివ్వాలనే యోచన ఉంది.
– ఎమ్మెల్యేగా రెడ్యా నాయక్‌ను మహబూబాబాద్‌ నుంచి లోక్‌సభ బరిలో దింపే యోచన ఉంది. రెడ్యా నాయక్‌ కుమార్తె, మాజీ ఎమ్మెల్యే కవితను ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశముంది.
– ఇంకా కొందరు మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను ఇతర లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీచేయించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. రెండు, మూడు చోట్ల ఇతర పార్టీల ముఖ్యనేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

Advertisement
Advertisement