నీటి సమర్థ వినియోగమే దిక్కు! | Sakshi
Sakshi News home page

నీటి సమర్థ వినియోగమే దిక్కు!

Published Fri, Nov 14 2014 4:20 AM

నీటి సమర్థ వినియోగమే దిక్కు!

  • వాతావరణాన్ని కాపాడుకోలేకపోతే విపత్తులు ఖాయం
  •  వాతావరణ మార్పులపై సదస్సులో నిపుణులు
  • సాక్షి, హైదరాబాద్: ‘నీటి కోసం వివిధ రంగాల్లో డిమాండ్ పెరుగుతోంది. నీటి లభ్యత, అవసరాల మధ్య వ్యత్యాసం కూడా వేగంగా పెరుగుతోంది. అందువల్ల ఉన్న నీటినే మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది’ అని కేంద్ర జలసంఘం చైర్మన్ ఎ.బి.పాండ్యా అన్నారు.

    ‘వాతావరణ మార్పులు, నీటి సమర్థ వినియోగం’ అంశంపై గురువారం వాలంతరి (నీరు, భూమి నిర్వహణ, శిక్షణ, పరిశోధన సంస్థ)లో జరిగిన జాతీయ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. సాగునీరు, మురుగునీటి వ్యవస్థపై అంతర్జాతీయ కమిషన్ (ఐసీఐడీ) సెక్రటరీ జనరల్ అవినాష్ త్యాగి, క్లైమా అడాప్ట్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఉదయ శేఖర్ నాగోతు, వాలంతరీ డెరైక్టర్ నారాయణరెడ్డి, అదనపు డెరైక్టర్ ఎల్లారెడ్డి, ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు తదితరులు సదస్సులో మాట్లాడారు.

    ఈ సందర్భంగా వారేమన్నారంటే... ‘‘వ్యవసాయ రంగానికి ప్రస్తుతం ఏటా 557 బీసీఎం (బిలియన్ క్యూబిక్ మీటర్ల)ల నీటి వినియోగం ఉండగా, 2015 నాటికి ఇది 611 బీసీఎంలకు పెరుగుతుందని అంచనా. అదే 2050 నాటికి 807 బీసీఎంలకు చేరుతుంది. తాగునీటి డిమాండ్ కూడా ప్రస్తుతం ఉన్న 43 బీసీఎంల డిమాండ్ నుంచి 2050లో 111 బీసీఎంలకు పెరగనుంది. 2009లో వచ్చిన కృష్ణా వరదలు 1000 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. అది మన జీవిత కాలంలోనే చూశాం. వాతావరణాన్ని కాపాడుకోలేక పోతే విపత్తులు విరుచుకుపడటం ఖాయం.

    వాతావరణంలో మార్పుల ఫలితంగా వర్షపాతం పెరుగుతుంది. కానీ ఏడాదిలో వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గిపోతుంది. ఫలితంగా దేశంలో కరువు పరిస్థితి నెలకొంటుంది. సాగునీటి రంగంలో వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో, నీటి వినియోగాన్ని తగ్గిస్తే.. మిగతా రంగాలకు నీళ్లివడం సాధ్యం. ఈ దిశగా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పని చేయాలి. నీటి వృథా అరికట్టడం తక్షణ కర్తవ్యం’’.
     

Advertisement
Advertisement