నడవాలంటే నరకమే..  | Sakshi
Sakshi News home page

నడవాలంటే నరకమే.. 

Published Thu, Feb 14 2019 9:12 AM

Village Peoples Face To Road Problem Karimnagar - Sakshi

వీణవంక(హుజూరాబాద్‌): అడుగు తీసి అడుగు వేద్దామంటే కంకరరాళ్లు ఎక్కడ గుచ్చుకుంటాయోననే భయం... చీకటి పడితే రోడ్డు మధ్యనున్న విద్యుత్‌ స్తంభాలకు తాకుతామేమో అనే ఆందోళన... వాహనాలు వెళ్తుంటే అంతెత్తు లేస్తున్న దుమ్ము ఊపిరాడకుండా చేస్తోంది. దీంతో గత ఆరు నెలలుగా వీణవంక – జమ్మికుంట రహదారిపై నడిచే వాహనదారులకు నకరం నిత్యం నరకం కనిపిస్తోంది.

ప్రయాణికుల అష్టకష్టాలు.. 
వీణవంక–జమ్మికుంట ఫోర్‌లైన్‌ రోడ్డు పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా ఇంకా సా..గుతూనే ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే రహదారి వెంట వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

రూ.33 కోట్లతో నిర్మాణం..     
సంవత్సరం క్రితం వీణవంక–జమ్మికుంట మధ్య 12.5 కిలోమీటర్ల ఫోర్‌లైన్‌ రోడ్డు కోసం రూ.33 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్‌ మొదట వల్భాపూర్‌–నర్సింగాపూర్‌ గ్రామాల మధ్య పనులు ప్రారంభించారు. ఆరు నెలల క్రితం కంకరపోసి వదిలేశారు. తర్వాత వల్భా పూర్‌ నుంచి జగ్గయ్యపల్లి మధ్య కొంతదూరం వరకు కంకరపోసి పోశారు. మిగతా మట్టిపోసి అంతటితో వదిలేశాడు. దీంతో వాహనదారులు దుమ్ముతో పాటు కంకరతో నరకయాతన పడుతున్నారు. కంకరపై వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి.

ప్రమాదకరంగా విద్యుత్‌ స్తంభాలు... 
పాత కల్వర్టుల స్థానంలో కొత్త కల్వర్టులు నిర్మించారు. రోడ్డు వెడల్పు కావడంతో రోడ్డును ఆనుకొని వ్యవసాయ బావులు ఉన్నాయి. ప్రమాదకర వ్యవసాయ బావుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. వల్భాపూర్‌– రంగమ్మపల్లి గ్రామాల మధ్య విద్యుత్‌ స్తంభాలు రోడ్డుకు అడ్డంగా అతి ప్రమాదకరంగా ఉన్నాయి. రాత్రి సమయంలో స్తంభాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత శనివారం రాత్రి ఓ యువకుడు బైక్‌పై జమ్మికుంటకు వెళ్తుండగా చీకట్లో స్తంభాన్ని ఢీకొనడంతో గాయాలయ్యాయి. విద్యుత్‌ స్తంభాల వద్ద ఎలాంటి రక్షణ  చర్యలు చేపట్టలేదు.

దుమ్ము ధూళితో సతమతం..
జగ్గయ్యపల్లి– నర్సింగాపూర్‌ గ్రామాల మధ్య దుమ్ము విపరీతంగా లేస్తోంది. రోడ్డుపై నీటిని సక్రమంగా చల్లించకపోవడంతో దుమ్ములేచి ఇబ్బందులు పడుతున్నారు. ఈ రూట్‌లో నిత్యం ఆర్టీసీ బస్సులు 16 ట్రిప్పులు నడుస్తుంటాయి. వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు తిరుగుతుంటాయి. కంకర జారడం వల్ల ప్రమాదాలు జరగడంతో పాటు వాహనాల టైర్లు త్వరగా చెడిపోతున్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు.

బిల్లు మంజూరులో జాప్యం వల్లేనా?
పోర్‌లైన్‌ రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు జరుగుతున్న పనులకు సకాలంలో బిల్లులు రావడం లేదని సమాచారం. దీంతో కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇంకా మూడు నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా.. పనులు అడుగు కూడా ముందుకు కదలకపోవడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే పనులు పూర్తి కావడానికి ఎంకాలం పడుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఆర్‌అండ్‌బీ ఏఈ స్వప్నను వివరణ కోరగా దుమ్ము లేవకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రమాదకరంగా ఉన్న స్తంభాల వద్ద రక్షణ చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. 

రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలు 

Advertisement
Advertisement